Suryaa.co.in

Andhra Pradesh

అగ్రిగోల్డ్ బాధితులను మోసం చేసిన జగన్

• బాధితుల గోడు వినేందుకు ముఖ్యమంత్రికి తీరిక లేదా?
• డిపాజిటర్లకు చేరాల్సిన నిధులను దారి మళ్లించడం జగన్ కే చెల్లింది
టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు

మాట తప్పి మడమ తిప్పడంలో జగన్మోహన్ రెడ్డి తనకు తానే సాటి. ప్రతిపక్షంలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా వారి సమస్యలను పట్టించుకోకపోవడం దుర్మార్గం. కనీసం అగ్రిగోల్డ్ బాధితుల గోడు వినేందుకు కూడా ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం దుర్మార్గం కాదా?
అగ్రిగోల్డ్‌ బాధితులకు టీడీపీ ప్రభుత్వం మేలు చేస్తే జగన్ వారిని గాలికొదిలేయడమే కాకుండా వారి ఆస్తులనూ అన్యాక్రాంతం చేయడం దారుణం. దేశంలో ఎక్కడా లేని విధంగా అగ్రిగోల్డ్ ఆస్తులను సీజ్‌ చేసి బాధితులకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీనే. డిపాజిటర్లను ఆదుకునేందుకు రూ. 336 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి అండగా నిలబడితే జగన్ ఆ నిధులనూ దారి మళ్లించి బాధితులను వంచించారు.

జప్తు చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయిస్తే రూ. 35 వేల కోట్లు వస్తాయని ప్రతిపక్షంలో ఊదరగొట్టిన జగన్ ఇప్పుడు ఆస్తుల వేలంపై నోరుమెదపకపోవడం దేనికి సంకేతం? అగ్రిగోల్డ్‌ ఆస్తులను, హాయ్‌లాండ్‌ని తెలుగుదేశం పార్టీ నేతలు కొట్టేశారని విష ప్రచారం చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక తన రాజకీయ ప్రయోజనాల కోసం అగ్రిగోల్డ్‌ బాధితులను పావుగా వాడుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి రూ.1,182 కోట్లు కేటాయిస్తానన్న జగన్‌ ఆచరణలో ఎందుకు విఫలమయ్యారు?

ప్రభుత్వ భవనాలు మొదలుకొని చెట్టూ పుట్టా వరకూ వైసీపీ రంగులు వేయానికి వేల కోట్ల ప్రజాధనం మంచినీళ్ల ప్రాయతంగా ఖర్చు చేసే జగన్ అగ్రిగోల్డ్ బాధితులకు మాత్రం ఒక్క రూపాయి ఇవ్వడానికి కూడా మనసురాదు. చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం ఇస్తానన్న హామీని అటకెక్కించారు. అగ్రిగోల్డ్ బాధితులంతా జగన్ బాధితులుగా మారిపోయారు. జగన్ తన రాజకీయ ప్రయోజనాలు పక్కనపెట్టి అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలను పరిష్కరించి, ఆస్తులను పరిరక్షించాలి.

LEAVE A RESPONSE