– లెనిన్ సెంటర్ లో ధర్నా- నేతల అరెస్టు
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను దగా చేస్తూన్నాడని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు మండిపడ్డారు.ఖాళీగా ఉన్న 2.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఉద్యోగుల 62 ఏళ్ల పదవీ విరమణ వయసు పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో పీ డీ ఎస్ యూ, ఏఐఎస్ఎఫ్, ఎస్ ఎఫ్ఐ, టిఎన్ఎస్ఎఫ్,డివైఎఫ్ఐ, తెలుగు యువత సంఘాల, ఐసా సంఘాల ఆధ్వర్యంలో గురువారం లెనిన్ సెంటర్ లో ధర్నా జరిగింది.
అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి ప్రదర్శనగా బయల్దేరిన నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట తీవ్రంగా జరిగింది. పోలీసులు నాయకులను వాహనాల్లోకి ఎక్కించారు.గవర్నర్పేట, అజిత్సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా పీ డీ ఎస్ యూ
రాష్ట్ర అధ్యక్షులు ఎ.రవిచంద్ర, ఏఐఎస్ఎఫ్ రాష్ట్రఅధ్యక్షులు జాన్సన్ బాబు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారు నాగ శ్రవణ్,డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాము, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ లు మాట్లాడుతూ-ఉద్యోగాలు కల్పించకుండా నిరుద్యోగులను జగన్ తీవ్రంగా వంచించాడని విమర్శించారు.2.35 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. గతేడాది 10,143 పోస్టులకు జారీ చేసిన ఉద్యోగ క్యాలెండర్ కి నేటికీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు.
ఏపీపీఎస్సీ గ్రూపు1,2 పోస్టులకు గతేడాది ఆగస్ట్ లో ఇవ్వాల్సిన నోటిఫికేషన్ ఇవ్వలేదని విమర్శించారు.గతంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని ఇవ్వని విధంగా గ్రూపు 1 పోస్టులు 31 గ్రూపు 2 పోస్టులు 5 మాత్రమే సీఎం జగన్ ఇచ్చాడని తెలిపారు పోలీస్ శాఖ పోస్టులు 6,500 భర్తీకి కేలండర్ ప్రకటించకుండా కేవలం 450 మాత్రమే ఇచ్చి నిరుద్యోగుల ఆశలపై సీఎం నీళ్లు చల్లాడన్నారు.కనీసం వాటికి కూడా సెప్టెంబర్ లో ఇవ్వాల్సిన నోటిఫికేషన్ జారీ చేయలేదన్నారు.670 గ్రూప్ 4 రెవిన్యూ పోస్టులు ప్రిలిమ్స్, మెయిన్స్ కి నెగిటివ్ మార్కులను అమలు చేసి నిరుద్యోగులను ప్రభుత్వం వంచించిందన్నారు.
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచి నిరుద్యోగుల నోట్లో జగన్ మట్టి కొట్టాడని దుయ్యబట్టారు.దీన్ని తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు.మాట తప్పను, మడమ తిప్పను అని నిరుద్యోగుల జీవితాలతో జగన్ చెలగాటమాడుతున్నాడన్నారు.2.35 లక్షల ఉద్యోగాలు కల్పించేంత వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.మొత్తం 62 మంది నాయకులను అరెస్ట్ చేసి గవర్నర్పేట ,అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
అరెస్ట్ అయినవారిలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్, పీ డీ ఎస్ యూ నగర అధ్యక్షులు ఐ. రాజేష్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు సోమేశ్వరావు, ఐసా నాయకులు అఖిల్, డీ వై ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, టీ ఎన్ ఎస్ ఎఫ్ నాయకులు సత్యసాయి,తెలుగు యువత నాయకులు నాగురు వడ్డే శోభన్ తదితరులు ఉన్నారు.