అవును. నాకు కొంచెం తిక్కుంది. దానికో లెక్కుందని పవన్ కల్యాణ్ సినిమాలో చెప్పినట్లు… వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హిందూ వ్యతిరేక విధానం వెనుక తిక్కేమీ లేదు. దానికో ఎలక్షను లెక్కుంది! మత రాజకీయ కిక్కుంది. వినాయక చవితిపై ఆంక్షలు విధించడం ద్వారా.. తాను హిందువులకు వ్యతిరేకమన్న సంకేతాలు మిగిలిన మతాలకు పంపి, రాజకీయ ప్రయోజనం సాధించడమే ఆ లెక్కల వెనుకున్న రహస్యం. అన్ని మతాలూ తనకే ఓటు వేసి, హిందువుల్లో కులపిచ్చగాళ్లంతా చీలిపోతే ఆ కిక్కే వేరప్పా! ఇదంతా తెలియాలంటే, భారత స్వాతంత్య్ర సమర చరిత్రలోకి ఓసారి తొంగిచూడాలి. చూస్తే.. 128 ఏళ్ల తర్వాత హైందవ సంప్రదాయంపై దాడి ఎందుకున్నది అర్ధమవుతుంది.
* * *
1885లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబడింది.
మొదటి 20 సంవత్సరాలు, అంటే 1905 వరకు మితవాద దశ అంటారు. ఈ దశలో, కలకత్తా, బొంబాయి, మద్రాసు, లాహోర్, పూనా, ఢిల్లీ లాంటి పెద్ద నగరాలలో, ఉన్నత విద్యావంతులు మాత్రమే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేవారు. వారందరికీ బ్రిటిష్ వారు అంటే విపరీతమైన గౌరవం. భారత దేశాన్ని అభివృద్ధి చేయడానికి బ్రిటిష్ వారు పాలిస్తున్నారు అని పూర్తిగా నమ్మేవారు.
1835 లో ఇంగ్లీషు మాధ్యమంలో ఆధునిక విద్యను ప్రవేశపెట్టిన తర్వాత లక్షలాది మంది భారతీయులు డిగ్రీ పూర్తి చేసుకున్నారు. కానీ మనదేశంలో బ్రిటిష్ వారి పారిశ్రామిక వ్యూహం ప్రకారం-మన దేశంలోని ముడి సరుకును ఇంగ్లాండ్ కు తరలించి, అక్కడ పరిశ్రమలలో తయారైన వస్తువులను, మన దేశంలోకి దిగుమతి చేసి, మన మార్కెట్లో అధిక ధరలకు అమ్మడం ద్వారా, ఆ డబ్బును మళ్లీ ఇంగ్లాండ్ కి తరలించడం ద్వారా-భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి స్తంభించి, నిరుద్యోగం విపరీతంగా పెరగటం వలన….. కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం రెండు అంశాలను మాత్రమే 1905 వరకు ప్రధానంగా బ్రిటిష్ వారి నుండి కోరారు.
* * *
మొదటిది-భారతీయులకు ఉద్యోగ అవకాశాలు పెంచడం.
రెండవది-రాష్ట్ర మరియు కేంద్ర శాసనసభలో భారతీయుల ప్రాతినిధ్యం పెంచటం.
ఈ ఇరవై సంవత్సరాలలో…. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం అనే పదాన్ని ఎప్పుడూ వాడలేదు. అది వారి ఎజెండాలో లేదు. ఎందుకంటే… సతీసహగమనం, బాల్య వివాహాలు లాంటి ఎన్నో సాంఘిక దురాచారాలను రద్దు చేసిన, రైల్వే లాంటి ఆధునిక రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసిన, టెలిగ్రామ్ లాంటి ఆధునిక సమాచార వ్యవస్థను అభివృద్ధి చేసిన, వేదాలు ఉపనిషత్తులు తప్ప భౌతిక జ్ఞానాన్ని అందించని భారతీయ సంప్రదాయ విద్య స్థానంలో, గణిత శాస్త్రం, భౌతిక, రసాయన శాస్త్రాలు, జీవశాస్త్రం, వృక్ష శాస్త్రం, చరిత్ర, ఆర్థికశాస్త్రం, భూగోళ శాస్త్రం, మనో విజ్ఞాన శాస్త్రం, రాజనీతి శాస్త్రం, తత్వశాస్త్రం… మొదలైన ఆధునిక బోధనా అంశాలను ప్రవేశపెట్టిన…. బ్రిటిష్ వారంటే…ఈ నాయకులకు అందరికీ చాలా గౌరవభావం. అది మనకు కూడా అలవాటు చేశారు. అందుకే ఇప్పటికి కూడా మనం బ్రిటిష్ వారిని, తెల్లదొరలు అని గౌరవంగా పిలుస్తాం.
ఈ నేపథ్యంలో…… దేశంలో యువతరంలో పెరుగుతున్న అలజడిని, ఆందోళనని, ఆవేశాన్ని…… నలుగురు నాయకులు గ్రహించారు. వారే పంజాబ్ రాష్ట్రంలో లాలాలజపతిరాయ్, మహారాష్ట్రలో బాలగంగాధర్ తిలక్, బెంగాల్ లో అరవింద ఘోష్, బిపిన్ చంద్రపాల్. వీరిలో అరవింద ఘోష్ కంటే మిగిలిన ముగ్గురు ఎక్కువ ప్రాచుర్యం పొందారు.
లాలాలజపతిరాయ్ చాలా పెద్ద నాయకుడు అయ్యేవాడు… కానీ పంజాబ్ రాజకీయాలకే పరిమితం కావటం వలన పంజాబ్ కేసరిగా (పంజాబ్ కే….సరి) మిగిలిపోయాడు.
దేశం మొత్తం తిరిగి వందలాది సభల్లో, లక్షలాది మందిని ఉర్రూతలూగించే ఉపన్యాసాలు చేసిన బిపిన్ చంద్రపాల్, దేశ పర్యటన ముగించుకొని, ఇంటికెళ్లి, రాజకీయాలు వదిలేశాడు.(నేను ప్రస్తుతం ఈ దారిలో ఉన్నాను అనుకుంటా)
అరవింద ఘోష్ స్వదేశీ ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా పని చేసి, జైలుకెళ్లి, జైలులో ఆధ్యాత్మికత పై దృష్టి మళ్లించి, బయటికి వచ్చాక పాండిచ్చేరి వెళ్లి, ఆశ్రమం పెట్టుకొని, స్వామి గా మారి, రాజకీయాలు వదిలేశాడు.
ఇక మిగిలింది… బాలగంగాధర్ తిలక్.
నికార్సయిన దేశభక్తుడు, బ్రిటిష్ దోపిడీలో భారత దేశానికి జరుగుతున్న నష్టాన్ని గ్రహించాడు. దాన్నే పదిమందికి చెప్పి, వారిలో దేశభక్తిని పెంపొందించి, బ్రిటిష్ వారి నుంచి భారతదేశానికి స్వరాజ్యం సాధించాలనే దృఢ సంకల్పంతో పని చేశాడు. స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించాడు.
బ్రిటీష్ వలస పాలనలో జరుగుతున్న దోపిడి కారణంగా… వ్యవసాయం సంక్షోభంలో పడింది, పరిశ్రమలు మూతపడ్డాయి, నిరుద్యోగం పెరుగుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, మన ఎగుమతులు పడిపోతున్నాయి, మన దిగుమతులు పెరిగిపోతున్నాయి, తరచుగా వస్తున్న క్షామాల వల్ల కోట్లాది మంది మరణిస్తున్నారు.
* * *
ఇవన్నీ గమనించి, 1905 నాటికి కాంగ్రెస్ పార్టీలో ప్రధాన నాయకుడిగా ఎదిగి, ప్రజల్ని సమీకరించడం ద్వారా బ్రిటిష్ వారి పై పోరాడి స్వరాజ్యం సాధించాలి అనుకున్నాడు. తిలక్ డిమాండ్ చేసిన స్వరాజ్యం అంటే—పూర్తి స్వాతంత్ర్యం కాదు. అధినివేశ ప్రతిపత్తి మాత్రమే.
(అంటే… భారతదేశాన్ని భారతీయులే పాలిస్తారు, భారత దేశం మాత్రం బ్రిటిష్ సామ్రాజ్యం లో భాగంగా కొనసాగుతోంది)తిలక్ స్వరాజ్ డిమాండ్ ని ఇతర కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించడం వల్లనే 1907లో సూరత్ కాంగ్రెస్ సమావేశంలో, కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది.
(కాంగ్రెస్ పార్టీ 1929 లాహోర్ కాంగ్రెస్ లో పూర్ణ స్వరాజ్ తీర్మానం చేసింది)
మళ్లీ కొంచెం వెనక్కి వెళ్దాం..
ప్రజా పోరాటం ద్వారానే స్వరాజ్యం సాధించాలనే లక్ష్యంతో తిలక్ అనేక సమావేశాలు నిర్వహించాడు. అదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం, ఉద్యమాలపై తీవ్ర నిర్బంధాన్ని అమలు చేయడం మొదలు పెట్టింది. దాదాపు అన్ని రకాల బహిరంగ రాజకీయ కార్యక్రమాలను నిషేధించింది. అందులో పాల్గొన్న వారిపై తీవ్రమైన కేసులు పెట్టింది.
ఈ నేపథ్యంలో… పోలీసు నిర్బంధాన్ని అధిగమించి, ప్రజల్ని సమీకరించి, వారిలో దేశభక్తి ని నింపి, స్వరాజ్యాన్ని సాధించాలన్న లక్ష్యంతో……. 1893లో, పూనాలో, దేశ చరిత్రలో మొట్టమొదటి సారి, బహిరంగ ప్రదేశాలలో, మండపాలు నిర్మించి, గణపతి విగ్రహాలను ప్రతిష్టించి, వేలాది మందిని భక్తి పేరుతో సమీకరించి, ప్రతిరోజు సాయంత్రం, ఒక్కో ప్రాంతంలో మండపం దగ్గర, ఆధ్యాత్మిక ఉపన్యాసం ప్రారంభించి… రామాయణంలో పిడకలాటలాగా(అంటే రామాయణాన్ని మొదలుపెట్టి, అందరూ కథలో లీనమైన తర్వాత, హఠాత్తుగా త్రిపీఠికల ప్రస్తావన తెచ్చి, బౌద్ధ మతాన్ని ప్రచారం చేయటం)
హిందూ దేవుళ్ళ లో తొలి పూజ గణపతి కి ఎందుకు చేయాలో వివరిస్తూ, హిందూ పండగల వైశిష్ట్యాన్ని ప్రస్తావిస్తూ, ఆయా పండగల వెనక ఉన్న సామాజిక ప్రయోజనాలను ప్రస్తుతిస్తూ……. అందరూ పూర్తిగా, తన ఉపన్యాసంలో లీనమయ్యారు, అని నిర్ధారించుకున్నాక…
చేతినిండా డబ్బు లేకపోవడం వల్ల, మనం పండుగలు కూడా చేసుకోలేకపోతున్నాం, అని అందరూ అర్థం చేసుకునే విధంగా చెప్పి….. అప్పుడు బ్రహ్మాస్త్రాన్ని తీసేవాడు…….
డబ్బులు ఎందుకు లేవు తెలుసా?
వ్యవసాయం లేకపోవటంవల్ల, పరిశ్రమలు లేకపోవడం వల్ల, చదువుకున్న వాళ్లకు ఉద్యోగం లేకపోవడం వల్ల, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల, అధిక పన్నుల వల్ల, అధిక ధరల వల్ల, అన్నిటికీ మించి మన సమస్యలు కూడా చెప్పుకునే… భావప్రకటనా స్వేచ్ఛ లేకపోవడంవల్ల.
అని చెప్పి……. కొన్ని క్షణాల మౌనం తరువాత…….
వీటన్నిటికీ కారణం ఎవరో తెలుసా? అని అమాయకంగా అడిగేవాడు.
అప్పుడు వచ్చేది సమాధానం….. ఆకాశం దద్దరిల్లేలా…. బ్రిటిష్ పాలన..
బ్రిటిష్ పాలన… బ్రిటిష్ పాలన….. బ్రిటిష్ పాలన అని.
ఆ విధంగా……
పరాయి పాలన నుండి భారతదేశ విముక్తి కోసం….
బ్రిటిష్ వలస దోపిడీ నుండి భారత ఆర్థిక వ్యవస్థను రక్షించడం కోసం….
రాజకీయ ప్రయోజనాల కోసం, పదవుల కోసం కాకుండా….. దేశ స్వాతంత్రం కోసం, మనసా వాచా కర్మణా రాజకీయ దురుద్దేశాలు లేని….
ఒక అపూర్వ ఘట్టం 1893 లో, పూనా లో ప్రారంభమైన…బహిరంగ గణపతి పూజ!
* * *
మరి 128 ఏళ్ల ఈ హైందవ సాంప్రదాయం పై .. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కోవిడ్ పేరు తో, ఎందుకు ఆంక్షలు విధిస్తూ ఉన్నాడో తెలుసా?
తన ప్రభుత్వం హిందూ సంప్రదాయాల విషయంలో… హిందువులతో ఘర్షణ పడుతున్నట్టు… ఇతర మతస్తులకు సందేశం వెళ్ళాలి.
నిజంగానే జగన్మోహన్ రెడ్డి హిందువులతో పోరాడుతున్నానని వాళ్ళు భ్ర మ పడాలి.
జగన్ బీజేపీకి దూరంగా ఉన్నాడు అని వాళ్ళు అనుకోవాలి.
అంతిమంగా వాళ్ళ ఓటు బ్యాంకు, జగన్ బ్యాంకు లాకర్ లో భద్రంగా ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ లో హిందువుల ఓట్లు గురించి భయపడాల్సిందేమీ లేదు.
ఎందుకంటే….
వాళ్ళు కులాన్ని బట్టి, తలో పార్టీకి ఓటు వేసుకుంటారు. కాబట్టి వాళ్ళ ఓట్లు చీలిపోతాయి.
సర్వేజనా సుఖినోభవంతు (జగన్మోహన్రెడ్డి తప్ప)