Home » నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరగదు

నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరగదు

-ఏపీడబ్ల్యూజేఎఫ్‌ సమావేశంలో సజ్జల
ప్రభుత్వం ఇచ్చే రాయితీలన్నీ అర్హులైన జర్నలిస్టులకు అందాలన్నదే రాష్ట్ర ప్రభుత్ ఉద్దేశమని,ఏనిజమైన జర్నలిస్టుకుఅన్యాయం జరగదని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సంఖ్య చిన్నదా? పెద్దదా? అనే సంబంధం లేదని, యాజమాన్యాల నుంచి పొందలేని సౌకర్యాలను కోరుతున్నప్పుడు జర్నలిజంలోని నకిలీలను వేరాయాల్సి ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జర్నలిస్టులపై వ్యతిరేక భావమేమీ లేదని వివరించారు. జర్నలిస్టులంటే ముఖ్యమంత్రికి అపారమైన గౌరవ భావం ఉందన్నారు.
నేషనల్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్ (ఎన్‌ఏజే) పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ (ఏపీయూజేఎఫ్‌) విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మిడిల్‌ ఇన్‌కమ్‌ గ్రూపు (ఎంఐజీ)లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోందన్నారు. దీనిపై త్వరలో విధివిధానాలను ప్రకటిస్తామన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అక్రిడిటేషన్‌ జారీలో ఆలస్యం జరిగిందని, ఇకపై జాప్యం లేకుండా త్వరితగతిన ఇచ్చేందుకు సమాచార శాఖ చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని వివరించారు.
చిన్నపత్రికలకు జీఎస్టీ నిబంధనల్లోనూ సడలింపు ఇచ్చామన్నారు. అయితే పత్రికలు తేకుండానే తీసుకువస్తున్నట్టు చెబుతూ అక్రిడిటేషన్లు ఇమ్మంటే కుదరని తేల్చిచెప్పారు. నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఆరోగ్య శ్రీ కింద వైద్య సౌకర్యం కల్పిస్తామని, ఇందులో ఏమైనా ఇబ్బందులు ఉంటే చక్కదిద్దేలా చూస్తామని, నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఈమేరకు ఆదేశాలు కూడా ఇస్తామన్నారు. విజయవాడ, విశాఖ, హిందూపూర్‌ తదితర ప్రాంతాలలో గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన వివాదాలపై ఆయా జిల్లాల అధికారులతో చర్చించి పరిష్కరిస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నందున తమకు సానుకూలంగా వార్తలు రాయాలని తాము కోరుకోవడం లేదని, ఉన్నది ఉన్నట్టుగా రిపోర్ట్‌ చేయమని మాత్రమే కోరుతున్నామన్నారు. సంక్షేమ కమిటీ, దాడుల నివారణ కమిటీ వంటి వాటిని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేసే విషయమై అందరితో చర్చించాల్సి ఉందని వివరించారు. డిజిటల్‌ మీడియాను గుర్తించే విషయమై కేంద్రప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. సి.రాఘవాచారి ఏపీ ప్రెస్‌ అకాడమీని మీడియా అకాడమీగా మార్చే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామన్నారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుగా ఇచ్చిన హామీ మేరకు పరిహారం అందించడంలో, సాంకేతిక సమస్యల కారణంగా అందించలేక పోయామని చెబుతూ, అంతకుమించిన సహాయం అందించేందుకు గల అవకాశాలను పరిశీలించడంతో పాటు వారికి గృహ వసతి కల్పించేందుకు తగిన నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఆయన వివరించారు.
అంతకుముందు ప్రసంగించిన ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు జర్నలిస్టుల సమస్యలను ప్రస్తావించారు. అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు, మీడియా కమిషన్‌ ఏర్పాటు, చిన్నపత్రికల సమస్యలు వంటి వాటిని ప్రస్తావిస్తూ.. జర్నలిస్టులు ఆత్మగౌరవంతో బతికేలా చూడాలని కోరారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రసంగిస్తూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, తమ ప్రభుత్వం జర్నలిస్టులకు వ్యతిరేకం కాదని పునరుద్ఘాటించారు. ఏపీడబ్ల్యుజేఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకట్రావ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ , ఎ.పి బ్రాడ్ క్రాస్ట్ జర్నలిస్ట్ అసోషియేషన్ ప్రతినిధులు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. విశాఖపట్నం నుంచి హాజరైన ప్రతినిధివర్గం సింహాచలం దేవస్థానం ప్రసాదం అందజేశారు.

Leave a Reply