మేము సై …. మీరు సయ్యా ?

– విపక్ష పార్టీలకు బహుజన నేతల అల్టిమేటం

రాష్ట్రంలో నాలుగేళ్ళుగా గాడి తప్పిన అధికార వైకాపా పార్టీ రాక్షస పరిపాలనను గద్దె దింపేందుకు దళిత, బహుజన, మైనార్టీ కులాలుగా మేము సై , మీరు సయ్యా? అంటూ ప్రధాన రాజకీయ విపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేన పార్టీలకు దళిత, బహుజన నేతలు అల్టిమేటం జారీ చేశారు.

విజయవాడ ప్రెస్ క్లబ్ లో బహుజన ఐకాస ఉపాధ్యక్షుడు మామిడి సత్యం అధ్యక్షతన జరిగిన పాత్రికేయ సమావేశంలో బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య మాట్లాడారు. గత మూడేళ్లుగా రాష్ట్రంలోని రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలతో పాటు సిపిఐ, సిపిఎం, బిజెపి, కాంగ్రెస్, బిఎస్పీ వంటి అన్ని రాజకీయ పార్టీలను ఐక్యంగా సమస్యలపై పోరాడాలని కోరుతున్నామని, ఇప్పటికీ ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్యత కనిపించకపోవడం పట్ల, భావ సారూప్యత లేకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ తప్పులు చేస్తునప్పుడు, ప్రజలకు ప్రతిపక్షాలే జవాబుదారీగా ఉండాలని, ఐక్య పోరాటాలు, ఎన్నికల పొత్తులతో ప్రజలను సమీకరించాలని చెప్పారు.

ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా, ఐక్య పోరాటాలపై కానీ , పొత్తులపై కానీ విపక్షాలు ఒక్క అడుగు ముందుకు వేయలేదని చెప్పారు. క్లైమాక్స్ లేని సినిమాలతో, ఓటు చీలనివ్వం, రూట్ మ్యాప్ వంటి మాటలతోనే కాలయాపన చేస్తున్నారు అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కులాలకు పెద్దన్నలు, చిన్నన్నలు, మేనమామలు అంటూ ఎవరూ లేరన్నారు. కోటి పది లక్షల జనాభా గలిగిన ఎస్సీ, ఎస్టీలే పెద్దన్నలు అన్న సంగతి విపక్షాలు మరువరాదని పేర్కొన్నారు.

రానున్న ఎన్నికల్లో రాష్ట్ర తల రాత బహుజన కులాల చేతుల్లోనే ఉందన్నారు. ఎవరో చెబితే, ఏదో చేస్తే …దళితులు మళ్ళీ మోసపోయి చేతులు కట్టుకుని వెంట రారని, వారికి జరిగిన దారుణ మరణాలపై నిలబడే వారికే అండగా ఉంటారని గుర్తు చేశారు. పదేపదే అధికార పార్టీ ఆగడాలను విమర్శిస్తే సరిపోదని, స్పష్టమైన ఐక్య కార్యాచరణతో ఇప్పటికైనా ప్రజల ముందుకు వస్తారని ప్రజలు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

2009 ఉమ్మడి ఎపీలోనూ, 2019 విభజిత ఏపీ లోనూ జరిగిన రాజకీయ చారిత్రక తప్పిదాలను 2024 లో జరగనివ్వమని, అడ్డుకుంటామని హెచ్చరించారు. అధికార పార్టీ పరిపాలనా లోపాలను ప్రశ్నించే బహుజన కులాలకు ,స్పష్టమైన ఐక్య కార్యాచరణతో విపక్షాలు రాకపోతే వారిని కూడా ప్రశ్నిస్తామని తెలిపారు. అధికార పార్టీని నిగ్గదీసే బహుజన కులాలకు ప్రతిపక్ష పార్టీలను కూడా ప్రశ్నించే హక్కు ఉందన్నారు. అధికార పార్టీ చెప్పే మిత్ర బేధం కథల్లో పడి, ప్రజలు చెప్పే మిత్ర లాభం కథలను మరచిపోవద్దని హితవు పలికారు.

అధికార పార్టీ రోజూ చెబుతున్న నవరత్నాల ‘ఆవు కథల’తో ప్రజలు విసిగిపోయారు అని ఆరోపించారు.రాష్ట్రంలో దగాపడ్డ తొలి బాధితులు దళిత కులాలేనని, ఏం చేయాలో, ఎలా చేయాలో భవిష్యత్తు కాలంలో మేమే నిర్ణయించుకుంటామని ప్రకటించారు. త్వరలో రాష్ట్ర వ్యాప్త బృహత్తర కార్యాచరణ ప్రణాళికతో 26 జిల్లాల్లో కార్యాచరణ చేపట్టబోతున్నట్లు బాలకోటయ్య వివరించారు.
విలేకరుల సమావేశంలో నేషనల్ నవ క్రాంతి పార్టీ అధ్యక్షులు కనకం శ్రీనివాసరావు, రెల్లి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిరంశెట్టి నాగేందరావు, బహుజన ఐకాస నాయకులు వజ్రాల రవి శంకర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Leave a Reply