ప్రజాబలం ముందు అధికారం, ధనబలం నిలువలేవు
ఎన్నికలకు సమాయాత్తం కాకుండా చేయాలన్నదే జగన్ కుట్ర
రాజమహేంద్రవరం క్యాంప్ లో ముఖ్యనేతలతో లోకేష్ సమావేశం
రాజమహేంద్రవరం:- జగన్ ప్రజల నమ్మకం పూర్తిగా కోల్పోయాడని, కేవలం పోలీసులను, సీఐడీని మాత్రమే నమ్ముకుని రాజకీయం చేస్తున్నారని లోకేష్ అన్నారు. రాజమహేంద్రవరంలోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో యువనేత నారా లోకేష్ శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు.
చంద్రబాబుపైన, తనపైన ప్రభుత్వం వరుసగా పెడుతున్న అక్రమ కేసుల విషయంలో ఢిల్లీలో ఉండి గత మూడువారాలుగా చేస్తున్న న్యాయపోరాటాన్ని నేతలకు వివరించారు. ఇటు ప్రజా క్షేత్రంలో, అటు న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగించాల్సి ఉందని అన్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన 28 రోజుల తరువాత కూడా దర్యాప్తు సంస్థ ఆధారాలు చూపలేకపోవడంతో కేసుల్లో డొల్లతనాన్ని ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారని నేతలు అభిప్రాయపడ్డారు.
రాజకీయ పార్టీగా టీడీపీకి వచ్చిన విరాళాలనే అవినీతి సొమ్ము అని స్కిల్ డెవలప్మెంట్ కేసులో నమ్మించే ప్రయత్నం చేసి సిఐడి మరింత అభాసుపాలైందని లోకేష్ అన్నారు. ప్రజాబలం ముందు అధికార బలం, ధన బలం నిలిచే పరిస్థితి ఉండదని స్పష్టంచేశారు. ప్రభుత్వ కక్ష పూరిత రాజకీయాలపై మరింత ఉద్ధృతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని లోకేష్ నేతలకు సూచించారు.
కార్యకర్తల నుంచి అధినేత వరకు అందరిపై కేసులు పెట్టడం ద్వారా ఎన్నికలకు సమాయత్తం కాకుండా చేయాలన్నదే జగన్ రెడ్డి కుట్ర అని పేర్కొన్నారు. ఆధారాలు లేని కేసులు ఎక్కువ రోజులు న్యాయస్థానాల్లో నిలువలేవని, త్వరలో తప్పుడు కేసులనుంచి బయటకు వచ్చి, రెట్టించిన ఉత్సాహంతో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.