-కడప జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైన వైయస్ జగన్మోహన్ రెడ్డి
-మూడు సంవత్సరాలు అయినా ముందుకు కదలని ఉక్కు ఫ్యాక్టరీ
-నిధుల లేమి తనంతో నత్తనడకన నీటిపారుదల ప్రాజెక్టులు
-సిపిఐ జిల్లా కార్యదర్శి జి ఈశ్వరయ్య
ఎన్నికల ముందు కడప జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య విమర్శించారు. గురువారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో తనతండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పనులు పూర్తి చేస్తాడని, వారి ఆశయాలు నెరవేరుస్తాడని ఓట్లేసి గెలిపించిన జిల్లా ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారని వారు తీవ్రంగా విమర్శించారు.
జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతి సందర్భంలో గతంలో చేసిన వాగ్దానాలు పదే పదే వల్లె వేస్తూ జిల్లా ప్రజల ఆశలపై ఆకాంక్షల పై నీళ్లు చల్లి పోతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు వైయస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లో కడప ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన చేసి అనతికాలంలోనే పూర్తి చేసి లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ప్రకటించి మూడు సంవత్సరాలు పూర్తయిన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నదన్నారు.
జిల్లాను కరువు నుండి శాశ్వతంగా విముక్తి చేస్తానని అందుకోసం రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తరలించేందుకు అనుగుణంగా గాలేరు-నగరి, తెలుగు గంగ వెడల్పు చేపట్టామని చెబుతున్నప్పటికీ నిధుల లేమి తనంతో పనులు పూర్తికాక ప్రాజెక్టులకు అనుబంధంగా పంట కాలువల నిర్మాణం జరగక అదనంగా ఒక ఎకరా ఆయకట్టును అభివృద్ధి చేయలేకపోయారు అన్నారు.
ఉద్యాన పంటలకు ప్రసిద్ధి గాంచిన కడప జిల్లాలో పంటల సాగు కు అవసరమైన సూక్ష్మ నీటి సేద్యము పరికరాలపై గత మూడు సంవత్సరాలుగా రాయితీని పూర్తిగా నిలిపివేయడం వల్ల పంటల సాగు కుంటు పడిందన్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతుల పాలిట విజ్ఞాన కేంద్రాలని చెబుతున్నప్పటికీ ఆచరణలో అందుకు భిన్నంగా విత్తనాలు ఎరువులు పురుగు మందులు రైతులకు అందించడం మొదలు పంటల కొనుగోలు వరకూ అధికార పార్టీ దళారులదే పెత్తనం గా నడుస్తుందన్నారు. జిల్లాలో వైను, మైన్ ల్యాండ్, స్యాండ్ మాఫియా చచ్చిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది అన్నారు. పులివెందుల కేంద్రంగా సూట్ (తరుగు) పేరుతో 25 శాతం పంటను స్థానిక అధికార పార్టీ దళారులు చీని రైతులను దోపిడీ చేస్తున్నారని వారు ఆరోపించారు.
ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతున్నప్పటికీ కడప రిమ్స్ లో కొన్ని మాసాలుగా ఎమ్మారై స్కానింగ్ యంత్రం మూలనపడి రోగులు నానా యాతన పడుతున్నారన్నారు. రిమ్స్ స్థాపించి దశాబ్దాలు అవుతున్నా గుండె, కిడ్నీ, గ్యాస్ట్రో సంబంధిత విభాగాలు వైద్యుల నియామకం జరగక పోవడం విచారకరమన్నారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన బుగ్గవంక బ్యూటిఫికేషన్, నగర సుందరీకరణ, రోడ్ల వెడల్పు, ఆక్రమణల తొలగింపు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అర్హులైన పేదలకు ఇళ్లు ఇంటి స్థలం భూమి పంపిణీ మహిళా డైరీ, ఐటీ పార్కుల ఏర్పాటు వంటి నిర్మాణాలు పూర్తిగా అటకెక్కించారు అన్నారు. రెండు తరాలుగా ఓట్లేసి గెలిపించి అధికారాన్ని కట్టబెడుతున్న కడప జిల్లా ప్రజానీకానికి మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంత చేసినా తక్కువే అని అన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన వాగ్దానాలు తక్షణం అమలు చేయకపోతే గెలిపించిన ప్రజలే ఓడిస్తారని వారు హెచ్చరించారు.