అక్షయ పాత్ర మెగా కిచెన్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ

అక్షయ పాత్ర సంస్థ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ సంఖ్యలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తోంది. ఈ సంస్థ తాజాగా ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో లక్ష మందికి వంట చేయగల సామర్థం ఉన్న మెగా కిచెన్ ను ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వారణాసి పర్యటనలో భాగంగా ఆ మహా వంటశాలను ప్రారంభించారు. ఈ వంటశాలను వారణాసిలోని ఎల్టీ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ యంత్ర సహిత వంటశాల ద్వారా 150 పాఠశాలలకు భోజనం సరఫరా చేస్తారు.

ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఇలాంటి భారీ సామర్థ్యం ఉన్న కిచెన్ లతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రజల మధ్య ఉండడం తనకెప్పుడూ సంతోషం కలిగిస్తుందని తెలిపారు.

ఇదిలావుంచితే, యూపీ విపక్షనేత, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ, తమ ప్రభుత్వ హయాంలో 11 ప్రాంతాల్లో అక్షయపాత్ర కిచెన్ లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని, కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చాక అక్షయపాత్ర యోజన పథకానికి స్వస్తి పలికారని ఆరోపించారు. అయితే, యువత, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో ప్రభుత్వం దిగొచ్చిందని, పథకాన్ని మళ్లీ ప్రారంభిస్తున్నారని వ్యాఖ్యానించారు.

Leave a Reply