Suryaa.co.in

Andhra Pradesh

కొండపైకి వెళ్ళాలి అంటే..జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే

టిటిడికి బాలకోటయ్య సూచన

తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్ళే అన్యమతస్థులు స్వామి వారిపై నమ్మకం ఉందంటూ డిక్లరేషన్ పై సంతకం పెట్టాల్సిందే అని, అలా పెట్టకుండా వెళ్ళరాదన్న టిటిడి దేవస్థానం నిబంధనలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాటించి తీరాలని, అలా చేయని పక్షంలో దేవ దేవునికి మరోమారు జగన్ అపచారం చేసినట్లే అవుతుందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి సూచించారు.

శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సిఎంగా ఉన్నంత కాలం తిరుపతి కొండను అపవిత్రం చేయటంతోపాటు స్వామి వారినే సతీసమేతంగా తాడేపల్లి ప్యాలెస్ కు తెప్పించుకుని అపచారం చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి పదవి పోగానే, స్వామి దగ్గరకు బయలు దేరారా? అంటూ విమర్శించారు. స్వామి వారి లడ్డూ, తీర్థ ప్రసాదాలలో కల్తీ జరిగిందన్న ఆరోపణలను నిజాయితీగా ఎదుర్కొవాలని, విచారణకు లేఖలు రాయాలని తెలిపారు. అగ్నిపరీక్ష కు నిలబడకుండా తిరుపతిని రాజకీయం చేస్తే, ప్రజలు నమ్మరు అని తెలిపారు.

గత ఐదేళ్ళ పాలనలో పలు హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే, పట్టించుకోక పోగా, మంత్రులు దేవుళ్ళను చులకనగా మాట్లాడారన్నారు. డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుపతి కొండకు టిటిడి అనుమతిస్తే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. సంతకం పెట్టకుండా జగన్ను కొండపైకి అనుమతించొద్దని బాలకోటయ్య కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE