Suryaa.co.in

Andhra Pradesh

వక్ఫ్‌ బిల్లుకు జగన్ వ్యతిరేకం

– ముస్లిం హక్కులకు భంగం కలిగే చట్టాన్ని అంగీకరించం
– జగన్‌ఆదేశాలతో 9 అంశాలకు వ్యతిరేకంగా లేఖ
– వక్ఫ్‌ బిల్లును తెలుగుదేశం పార్టీ అంగీకరించింది
– మంత్రి రామ్మోహన్‌నాయుడు కేబినెట్‌లో బిల్లును అంగీకరించారు
బయట లోక్‌సభలో మాత్రం ఆ పార్టీ డ్రామాలు
– వి.విజయసాయిరెడ్డి
– కుమ్మరిపాలెం, ఈద్గా మైదానంలో జరిగిన వక్ఫ్‌ పరిరక్షణ మహాసభకు ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌తో సహా హాజరైన వైయస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,, ఎంపి వి.విజయసాయిరెడ్డి

విజయవాడ: ముస్లిం హక్కులను, మనోభావాలను, సాంప్రదాయాలను కాలరాసే ఏ చట్టాలను, సవరణలను తాము అంగీకరించబోదని, ముస్లిం సమాజానికి ఎల్లవేళలా అండగా ఉండి తమ పార్టీ పోరాడుతుందని వెయస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,, వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అందుకే వక్ఫ్‌ బిల్లుకు తమ పార్టీ వ్యతిరేకమని ఆయన వెల్లడించారు.

ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్‌ సవరణ చట్టంలో ముస్లిం సోదరులకు వ్యతిరేకంగా ఉన్న 8 పాయింట్లను పార్టీ అధ్యక్షుడు జగన్‌గారి ఆదేశాల మేరకు వ్యతిరేకించామని విజయసాయిరెడ్డి తెలిపారు. అయితే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం బీజేపీతో చేతులు కలిపి బిల్లును పాస్‌ చేయించడానికి ప్రయత్నం చేస్తోందని చెప్పారు. గత పార్లమెంటు సమావేశాలకు ముందు కేబినెట్‌లో ఆ బిల్లును టీడీపీ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్‌నాయుడు ఆమోదించారని తెలిపారు.

అయితే లోక్‌సభలో వక్ఫ్‌ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, కొన్ని సవరణలు చేయాలని మాట్లాడి డ్రామా చేశారని ఆక్షేపించారు. నిజంగా ఆ పార్టీ వక్ఫ్‌ బిల్లును వ్యతిరేకిస్తే, టీడీపీ మంత్రులు రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి బయటకు రావాలని తేల్చి చెప్పారు.

కాగా, తాము మాత్రం ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న 9 అంశాలపై అభ్యంతరాలున్నాయని, వాటిని అంగీకరించే ప్రసక్తే లేదని పార్టీ అధ్యక్షుడు జగన్‌గారి ఆదేశాలతో వైయస్సార్సీపీ తరఫున జాయింట్‌ పార్లమెంటరీ కమిటీకి లిఖితపూర్వకంగా డిసెంటింగ్‌ నోట్‌ ఇచ్చామని విజయసాయిరెడ్డి తెలిపారు.

ముస్లిం సమాజానికి నష్టం జరిగే విధంగా ఉన్న వక్ఫ్‌ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తి లేదని స్పష్టం చేసిన ఆయన, ముస్లింల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

చట్ట సవరణ ద్వారా బీజేపీ ప్రభుత్వం వక్ఫ్‌ బోర్డు భూములను కుట్ర పూరితంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాన్ని అడ్డుకుని తీరుతామన్న విజయసాయిరెడ్డి, వక్ఫ్‌ బోర్డులో ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చడాన్ని, సీఈవోలుగా నియమించడాన్ని కూడా ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. వక్ఫ్‌ బోర్డుకు విరాళాలు ఇవ్వడానికి విధించిన నిబంధనలపై కూడా తాము వ్యతిరేకమని ఆయన వివరించారు.

LEAVE A RESPONSE