– కాలు బెణకడంతో ఒంటిమిట్ట పర్యటన రద్దు అని అధికార ప్రకటన
– సీతారాముల వారికి పట్టువస్ర్తాలు సమర్పించాల్సిన సీఎం జగన్
– తాజా నొప్పితో ప్రయాణాలు వద్దని చెప్పిన డాక్టర్లు
– దానితో ఒంటిమిట్ట పర్యటన రద్దు
– మరి చిలకలూరిపేటకు ఎలా వెళుతున్నారంటూ బీజేపీ మెలిక
– చిలకలూరిపేట పర్యటనకు వెళ్లమని డాక్టర్లు చెప్పారా అని ప్రశ్న
– రాములోరి కల్యాణం కంటే జగన్‌కు ఏం ముఖ్యమైన పనులున్నాయని నిలదీత
– హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆందోళన
– జగన్ తన హిందూ వ్యతిరేక వైఖరి బయటపెట్టారన్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ సీఎం జగనన్నకు కాలు నొప్పి కష్టాలొచ్చిపడ్డాయి. రోజూ ఎక్సర్సైజులు చేసే జగనన్నకు.. ఇటీవల ఉదయం ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో కాలు బెణికిందట. ఆ నొప్పి సాయంత్రానికి మరింత పెరిగింది. గతంలో కూడా జగన్‌కు ఇలాగే కాలినొప్పి గాయం సమస్య ఎదురయింది. తాజాగా మళ్లీ కాలు బెణకడంతో ఆయన బయటకు వెళ్లకూడదని, కాలు కదపకూడదని వైద్యులు సలహా ఇచ్చారు. సహజంగా కాలు బెణికితే కారు-హెలికాఫ్టర్ ప్రయాణాలు చేయడం కష్టం. అందువల్ల ఆయన హాజరుకావలసిన, ఒంటిమిట్ట సీతారాముల కల్యాణ కార్యక్రమ పర్యటన రద్దయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకారంగా వైద్యుల సలహా మేరకు, సీఎం జగన్ తన ఒంటిమిట్ట సీతారాముల కల్యాణ కార్యక్రమ హాజరీని రద్దు చేసుకున్నారు.
అయితే.. గురువారం పల్నాడు నరసరావుపేట జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో, ప్రభుత్వం కొత్తగా రూపొందించిన ‘ప్యామిలీ డాక్టర్’ ప్రోగ్రామును, ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించాల్సి ఉంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ సొంత నియోజకవర్గమైన చిలకలూరిపేటలో, ఆ కార్యక్రమం ప్రారంభించాల్సి ఉంది. కానీ సీఎం జగనన్న కాలు బెణకడంతో, అంత పెద్ద ఒంటిమిట్ట రాములోరి కల్యాణానికే వెళ్లడం లేదు కాబట్టి, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికీ వెళ్లకపోవచ్చని పార్టీ-ప్రభుత్వ వర్గాలు భావించాయి. అందువల్ల ఆ కార్యక్రమాన్ని క్యాంపు ఆఫీసు నుంచే, వర్చువల్‌గా ప్రారంభించవచ్చని అనుకున్నారు. అలా జరిగితే బాగానే ఉండేది.
కానీ అక్కడే అసలు సమస్య వచ్చి పడింది. చిలకలూరిపేటలో ‘ఫ్యామిలీ డాక్టర్’ కార్యక్రమానికి జగనన్న స్వయంగా హాజరవుతున్నారన్న సమాచారంతో, బీజేపీ నాయకులు అగ్గిరాముళ్లయ్యారు. చిలకలూరిపేట కార్యక్రమానికి అడ్డురాని కాలునొప్పి.. ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి హాజరయేందుకు అడ్డువచ్చిందా? అన్న లా పాయింట్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. పైగా ఇది జగన్ హిందూ వ్యతిరేక వైఖరికి నిలువెత్తు నిదర్శనమని.. మతాన్ని ముడిపెట్టి, నానా యాగీ చేస్తుండటం వైసీపీకి ఇబ్బందిగా మారింది.
దీనిపై ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు మాట్లాడుతూ.. ‘‘ఒంటిమిట్ట రాములవారి కల్యాణానికి కాలునొప్పి సాకు చెప్పిన జగన్‌కు, చిలకలూరిపేట కార్యక్రమానికి వెళ్లేందుకు నొప్పి రాదా? ఒంటిమిట్టకు వెళ్లవద్దన్న డాక్టర్, చిలకలూరిపేటకు వెళ్లమని చెప్పారా? కాలు బెణికితే ఎవరైనా కారు, హెలికాఫ్టర్ ప్రయాణాలు చేస్తారా? మీ పార్టీలో ఎవరైనా ఆర్ధోపెడిక్ డాక్టర్లుంటే కాస్త చెప్పమనండి. విని మేమూ సంతోషించి, ప్రయాణాలు చేస్తాం. ఇదంతా జగన్ హిందూ వ్యతిరేక వైఖరిని చాటుతుంది. అసలు సీతారాముల కల్యాణం కంటే సీఎంకు ఏం ముఖ్యమైన పనులున్నాయి? జగన్ నిర్ణయంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుకు ఆయన హిందువులకు క్షమాపణ చెప్పాల’ని డిమాండ్ చేశారు.
దీనితో బీజేపీ ఎదురుదాడిని ఎలా ఎదుర్కోవాలో తెలియక, వైసీపీ వర్గాలు తలపట్టుకున్నాయి. చిలకలూరిపేట కార్యక్రమ హాజరును సమర్ధిస్తే ఒక సమస్య. ఒంటిమిట్ట పర్యటన రద్దుపై మాట్లాడే అవకాశం లేకపోవడం మరో సమస్య. అలాగని బీజేపీ వాదనను ఖండించలేని సంకటం. ఇదీ.. వైసీపీ ‘కాలునొప్పి’ ఇరకాటం!