Suryaa.co.in

Andhra Pradesh Political News

నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు జగనే కారణం!

– శవ రాజకీయాలు.. కోడి పందెం నీతులు

(భూమా బాబు)

తెలిసిందే కదా… తమ వారి గొడ్డలిపోట్ల హత్యలైనా… ఇతరుల ఖాతాలో వేసే కథలు చెప్పడంలో జగన్ సిద్ధహస్తుడు అని. ఇప్పుడు పల్నాడు జిల్లా రెంటిపల్లె గ్రామ వైస్ సర్పంచ్, 40 ఏళ్ల వై.సి.పి. నాయకుడు నాగమల్లేశ్వరరావు గారి ఆత్మహత్య విషయంలో కూడా అదే రాజకీయం మొదలైంది. ఇది విషాదమే అయినా, దీని వెనుక ఉన్న నేపథ్యం మనం లోతుగా అర్థం చేసుకోవాలి.

ఎప్పుడూ దూకుడుగా ఉండే నాగ మల్లేశ్వర రావు, గతంలో తెలుగుదేశం నాయకులను, కార్యకర్తలను వేధించడంలో ముందుండేవాడు. అలాంటిది, జూన్ 4న ఎన్నికల ఫలితాల రోజు పోలీసులు ఆయన్ని ముందస్తు అరెస్టు చేశారు. ఇది సాధారణంగా ఎన్నికల సమయాలలో జరిగే ప్రక్రియే. ఆ తరువాత పంపేశారు.

అసలు కథ నాలుగు రోజుల తర్వాత, అంటే జూన్ 8న మొదలైంది. వై.సి.పి. గెలుస్తుందని పెద్ద మొత్తంలో తన రెండు ఎకరాల పొలాన్ని పందెం కాసిన ఆయన, ఆ అప్పు తీర్చలేక, పార్టీ ఓటమిని, పందెంలో తన ఓటమిని అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసు వర్గాల నుండి అందిన సమాచారం.

అసలు ఆ స్థాయిలో… ఒక్క నాగమల్లేశ్వరరావు గారే కాదు, వేలాదిమంది లక్షల్లో… కోట్లల్లో పందేలు కాశారు. క్రికెట్, ఎన్నికల ఫలితాలు ఏదైనాసరే… చివరికి అవేమీ లేకపోతే ఆన్‌లైన్ బెట్టింగ్‌లు ఆడి ఆత్మహత్యలు చేసుకొనే వారి వార్తలను మనం నిత్యం మీడియాలో చూస్తుంటాం. ఇది కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు, దీని వెనుక ఉన్న సామాజిక, రాజకీయ కోణాలు కీలకం.

జగన్ అతి నమ్మకం, భ్రమల ప్రచారం

నాగమల్లేశ్వరరావు అతి నమ్మకానికి అసలు కారణం జగనే. గులకరాయి బ్యాండేజ్ బబ్లూ ప్రచార సభలకు జనం రాకున్నా… గ్రీన్ మ్యాట్లు వేసి, టీవీలలో కృత్రిమ క్రౌడ్ చూపించి “వైనాట్ 175” అనే ఎన్నికల ప్రచారం చేసి పార్టీ నాయకులను, కార్యకర్తలను నమ్మించింది జగనే. ఎన్నికల పోలింగ్ తరువాత, ఫలితాల ముందు మెజారిటీ సర్వే సంస్థలు వైకాపా ఓడిపోతోంది అని చెబుతున్నా… “వైనాట్ 175, మనం క్లీన్ స్వీప్ చేస్తున్నాం” అని ముందురోజు కూడా జగన్ పెద్ద ఎత్తున ప్రచారం చేయించి పార్టీ వర్గాలను, అభిమానులను నమ్మించాడు. ఒక రకంగా చెప్పాలంటే భ్రమల్లో ఉంచాడు.

ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా పార్టీ వర్గాలను కూడా తప్పుదోవ పట్టించి… పందేలు కాసిన వారి మాటలను కూడా వైకాపా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయించడం మన అందరికీ తెలిసిన విషయమే. అవి చూసి అయోమయంతో నిద్రలేని రాత్రులు గడిపారు కోట్లాదిమంది. ఆ ధీమాతో, ఆ భ్రమల్లో ఉండి చివరి రోజు వరకూ పందేలు కాసి బలైనవారు, బ్రతుకులను నాశనం చేసుకొన్న వారు ఎంతోమంది ఉన్నారు.

కోడి పందెం నీతులు – శవ రాజకీయాలు

పందెంలో ఓడి చనిపోయిన కోడికి బతికున్న దానికంటే విలువ ఎక్కువ. దానినే ‘కోజా’ అంటారు. దీని కోసం ఆరాటపడని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తికాదు. కోజా మాంసానికి మంచి గిరాకీ ఉంటుంది. పందెం రాయుళ్ల కంటే కోసలను కాల్చి మాంసం తయారు చేసేవాళ్లు చేతినిండా సంపాదించుకుంటారంటే… కోజాల విలువ ఎంత ఉంటుందో అర్థమవుతుంది. ప్రతి కోడిపందేల బరి వద్ద కోజాలను కాల్చి మాంసం నరికే దుకాణాలు ఉంటాయి. ఇది కొవ్వు లేకుండా రుచిగా, బలవర్థకంగా ఉండటంతో ఎక్కువ మంది తినేందుకు ఇష్టపడతారు. పందెం కోళ్లను కొన్ని నెలలు బాదం, పిస్తా, జీడిపప్పు వంటి ఆహారంతో పాటు రోజూ వ్యాయామం చేయిస్తూ పెంచడం వల్ల కండలు తేరి కొవ్వు లేకుండా మాంసం రుచిగా ఉంటుంది. అందుకే పందేలకు కోజా కోసం వెళ్లేవారూ అధికంగా ఉంటారు.

చావుల కోసం ఎదురుచూస్తూ… రాష్ట్రానికి వచ్చి శవ రాజకీయాలు చేసే జగన్, తన అతి ప్రచారం వలన భూములను పందెం కాసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొన్నాడనే పశ్చాత్తాపం లేదు సరికదా, పందెం బరిలో ఓడిన కోడిని లొట్టలు వేసుకొని ఆరగించినట్లు, నాగమల్లేశ్వరరావు చావుకు కూడా “రెడ్ బుక్” రాజకీయ మసాలా అద్ది, ఆ ఖాతాలో వేసి రాజకీయం చెయ్యడానికి ప్లాన్ చేసుకొని, ఏకంగా పరామర్శ పేరుతో పర్యటన పెట్టుకోవడం శోచనీయం.

ఇప్పుడు తీరికగా ఏడాది తరువాత ఈ నెల 18న వై.ఎస్. జగన్ గారు పల్నాడు జిల్లాలో పర్యటించి, నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారట. ముందస్తుగా “రెడ్ బుక్ కుట్రకు బలైపోయిన నాగమల్లేశ్వరరావు” అని ప్రచారం మొదలెట్టించాడు. పాపం, పందెం కట్టి పొలం పోగొట్టుకున్న నాగమల్లేశ్వరరావు గారు, ఇప్పుడు పార్టీ కుట్రకు “బలిపశువు” అయ్యాడు.

పందెం కోడిని కోజా చేసిన కసాయి లెక్కన జగన్ తయారయ్యాడు. నాగ మల్లేష్ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఇకపై పందెం రాయుళ్లు జగన్ లాంటి వారి అబద్ధపు ప్రచారాలు నమ్మి పొలాలు తాకట్టు పెట్టకుండా, ఇంట్లో కూర్చుని టీవీలో ఫలితాలు చూడాలని విజ్ఞప్తి. అసలు పందేల జోలికి వెళ్లి ప్రాణాలు, ఆస్తులు పోగొట్టుకోవద్దని మనవి.

LEAVE A RESPONSE