Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌రెడ్డీ..ఈ ప్రశ్నలకు జవాబిచ్చే దమ్ముందా?

– సీఎంకు తెలుగుమహిళ అధ్యక్షురాలు అనిత లేఖాస్త్రం
మహిళా సంక్షేమంపై లేని గొప్పలు పోతున్న ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి, తమ ప్రశ్నలకు జవాబిచ్చే దమ్ముందా అని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సవాల్ చేశారు. ఆ మేరకు ఆమె ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు.లేఖ సారాంశం ఇదీ..
బహిరంగ లేఖ
తేది :11-09-2021
శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు,
ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్.
విషయం: రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు అరికట్టేందుకు తీసుకున్న చర్యలు ఏంటి – అఘాయిత్యాలకు పాల్పడిన నేరస్థులకు దిశ చట్టం అమలు చేస్తున్నారా? – దిశ చట్టం ద్వారా ఎంత మందికి శిక్షలు వేశారు? – మహిళలతో నీచంగా మాట్లాడుతూ అడ్డంగా దొరికిన మీ మంత్రులు, ఎమ్మెల్యేలపై మీరేం చర్యలు తీసుకున్నారు?
చట్టాలను సైతం ఫేక్ గా సృష్టించడం మీలాంటి ఫేక్ సీఎంల వలనే సాధ్యం. ఉత్తుత్తి చట్టాలు, అన్యాయం జరిగితే ఉలుకులేని పోలీసులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. దిశ బిల్లు చట్టం కాకముందే చట్టాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి, హోం మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. డిసెంబర్ 13, 2019న దిశ పేరుతో ఒక ఫేక్ చట్టం తీసుకు వచ్చి , వారంలో దర్యాప్తు, 14 రోజుల్లో విచారణ, 21 రోజుల్లో ఉరి అంటూ ప్రచారం చేసుకున్నారు. గడిచిన 26 నెలల్లో 500కి పైగా అఘాయిత్యాలు జరిగితే 21 రోజుల్లో ఎంత మందికి ఉరి వేశారో చెప్పాలి? దిశా బిల్లులో తాము లేవనెత్తిన అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వం నుంచి స్పందన, వివరణ రాలేదని లోక్ సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రా లిఖిత పూర్వ వివరణ(27.07.2021)ఇచ్చారంటేనే మహిళా భద్రత విషయంలో మీ చిత్తశుద్ది ఏపాటిదో దేశం మొత్తం అర్ధమవుతోంది. మహిళలతో నీచంగా మాట్లాడుతూ లైంగికంగా హింసిస్తూ రాసలీలల్లో మునిగి తేలుతూ అడ్డంగా దొరికిన మంత్రులు, ఎమ్మెల్య వైసీపీ నాయకుల పైనే మీరేం చర్యలు తీసుకోలేదు… అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై ఏం తీసుకుంటారనే భావం ప్రజల్లో కలుగుతుంది.
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం మీకుందా?
1. నర్సరావు పేటలో అనూష మీద అత్యాచారం జరిగి 7 నెలలు కావస్తున్నా ఎందుకు మీ ప్రభుత్వం దిశ చట్టం కింద ఉరిశిక్ష అమలు చేయలేదు? అనూష కుటుంబానికి అండగా నిలిచి ఆమె కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు వెళుతుంటే మీకెందుకు అంత ఉలుకు?
2. దిశ బిల్లును కేంద్రం తిప్పి పంపినా నిందితులపై దిశ చట్టం కింద చర్యలు తీసుకుంటున్నాం. ఈ చట్టం కింది ముగ్గురికి ఉరిశిక్ష, 20 మందికి జీవిత ఖైదు వేశామని డిసెంబర్ 23, 2020న రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. దిశ చట్టం కాదు. ఒక కార్యక్రమం మాత్రమే.కేంద్రం కొర్రీల వల్లే చట్టంగా మారేందుకు సమయం పడుతోందని సెప్టెంబర్ 03, 2021న డీజీపీ సవాంగ్ అన్నారు. వీరిద్దరిలో ప్రజలు ఎవరి మాటలు నమ్మాలి? చట్టం పేరుతో రాజకీయం చేయడం ఏంటి?
3. మహిళలు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతిచోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేమని మహిళ అయి ఉండీ హోంమంత్రి మాట్లాడటం బాధ్యతారాహిత్యం కాదా?
4. తాడేపల్లిలో మీ నివాసానికి కూతవేటు దూరంలో సామూహిక అత్యాచారం జరిగితే నిందితుడైన వెంకట్ రెడ్డిని ఇంతవరకు ఎందుకు పట్టుకోలేదు? నిందితుడికి రాజకీయ అండదండలు ఉన్నాయన్న విషయం వాస్తవం కాదా?
5. మహిళలకు రక్షణగా నిలిచే చట్టాలతో కూడా మీరు తమ చిల్లర రాజకీయాలకు వాడుకోవడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం కాదా?
6. టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ఫోర్త్ లయన్ యాప్ ను కాపీ కొట్టి దిశా యాప్ తామే రూపొందించినట్టు ప్రచారం చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి రాజకీయ దివాళాకోరుతనం కాదా?
7. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన నిర్భయ నిధి కింద ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం రూ. 112 కోట్లు కేటాయించగా ప్రభుత్వం కేవలం రూ. 38 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందంటే మహిళా భద్రత విషయంలో మీ చిత్తశుద్ది ఏపాటిదో అర్ధమవుతోంది.
8. రాష్ట్రంలో అత్యాచారాలకు, హత్యలకు గురైన మహిళలకు న్యాయం చేయండి అని నిరసన తెలిపేందుకు వెళ్తున్న నాపై, నారా లోకేష్ గారిపై శాంతి భద్రతలకు విఘాతం కలిగించామని ఐపీసీ 34, 186, 269 సెక్షన్ల కింద కేసులు పెడతారా.?
9. దిశ చట్టంతో 21 రోజుల్లో ఉరిశిక్ష వేస్తామన్నారు. రమ్య హత్యకు కారణమైన వ్యక్తిని ఎందుకు ఉరితీయలేదు.?
వంగలపూడి అనిత
టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు

LEAVE A RESPONSE