Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను తరిమివేస్తున్న జగన్ రెడ్డి

– పెట్టుబడుల ఆకర్షణలో ఏవిధంగా అగ్రగామి అయ్యారో చెప్పాలి
– జాతీయ సగటు కంటే రెట్టింపుగా రాష్ట్రంలో నిరుద్యోగ పట్టభద్రులు శాతం 35.14
– విశాఖలో ఫేక్ పెట్టుబడుల ఒప్పందాలు
– ఎన్నికల ఏడాదిలో యువతను మభ్యపెట్టేందుకే అబద్ధపు ప్రచారానికి దిగారు
– పరిశ్రమల శాఖ మాజీ మంత్రి ఎన్ అమర్ నాథ్ రెడ్డి

దేశంలోనే అత్యధిక పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించిందంటూ జగన్ రెడ్డి మోసపు ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ముడుపులు, రాజకీయ కక్షల కోసం నాలుగేళ్లుగా పరిశ్రమలపై దాడులు, విధ్వంసాలు తప్ప రాష్ట్రంలో కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ఉన్న పరిశ్రమలే ఒక్కోటి రాష్ట్రం నుంచి తరలివెళ్తున్నాయి. వాస్తవాలను కప్పిపుచ్చి యువతను మోసగిచ్చేందుకు తన కరపత్రిక ద్వారా అబద్ధాలు వల్లెవేస్తున్నారు. జగన్ రెడ్డి మోసానికి వివేకానందరెడ్డి హత్య ఏధంగా కేసు స్టడీగా మారిందో.. పెట్టుబడులపైన జగన్మోసపు రెడ్డి వల్లెవేసే అబద్ధాలు కూడా ఓ కేస్ స్టడీ. జగన్ రెడ్డి ఫేక్ ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని గ్రహించాలి.

వైకాపా ప్రకటనః పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ నెం.1
వాస్తవం- గత ప్రభుత్వంలో ఎంవోయూలు చేసుకుని పనులకు సిద్ధంగా ఉన్న కంపెనీలను ముడుపుల కోసం తరిమేయడంతో రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము జగన్ రెడ్డికి ఉందా?

వైకాపా ప్రకటనః306 ప్రాజెక్టులకు సంబంధించి రూ.7.65 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలు జరిగాయి
వాస్తవం- లేపాక్షి నాలెడ్జ్ హబ్, రస్ అల్ ఖైమా బాక్సైట్ లతో ఆనాడు ఏవిధంగా ఫేక్ ఎంవోయూలు చేసుకున్నారో.. నేడు ఎన్నికల స్టంట్ కోసం విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించి, ఆ పేరుతో 9 లక్షల ఎకరాలు స్వాహాకు తెరతీశారు. ఇండోసోల్ మార్కెట్ క్యాపిటల్ రూ.123 కోట్లు. అలాంటి కంపెనీ రూ.76వేల కోట్ల పెట్టుబడి సాధ్యమేనా? ఇది జగన్ రెడ్డి బినామీ కాదా? రీ న్యూ పవర్ మార్కెట్ క్యాపిటల్ రూ.9 వేల కోట్లు. అలాంటి కంపెనీ రూ.97 వేల కోట్ల పెట్టుబడి ఎలా సాధ్యం? మూడేళ్ల క్రితం ప్రారంభించి, రూ.500 కోట్లు కూడా టర్నోవర్ లేని షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఏకంగా రూ.8,855 కోట్లు పెట్టుబడి పెడుతోందని చెప్పడమే ఎంవోయూల తంతు ఏవిధంగా జరిగిందో తేటతెల్లమైంది. ఇది అవినాష్ రెడ్డి బినామీ కంపెనీ కాదా? షెల్ కంపెనీలు, ఫేక్ ఇన్వాయిస్ లు సృష్టించడంలో ఆరితేరిన జగన్ రెడ్డి.. గ్లోబల్ సమ్మిట్ పేరుతో ఫేక్ ప్రకటనలు చేశారు. ఇప్పుడు కూడా పెట్టుబడుల్లో అగ్రగామి అంటూ దుష్ప్రచారానికి దిగారు. విశాఖలో నిర్వహించింది గ్లోబల్ సమ్మిట్ కాదు… గోబెల్స్ సమ్మిట్.

చంద్రబాబు పాలనలో 5 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 5,13,351 మందికి ఉద్యోగాలు వచ్చాయని శాసనమండలి సాక్షిగా జగన్ రెడ్డి పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రకటించారు. ఐటీ రంగంలో లోకేష్ మంత్రి అయ్యేనాటికి కేవలం 5వేల మంది ఉద్యోగాలు ఉండగా దానిని 35 వేల ఉద్యోగాలకు పెంచారు. జగన్ రెడ్డి పాలనలో కొత్తగా పరిశ్రమలు రాకపోవడంతో రాష్ట్రంలో ఉన్నత విద్య చదువుకున్న వారికి ఉపాధి అవకాశాలు లభించడం లేదని, జాతీయ సగటు కంటే రెట్టింపుగా రాష్ట్రంలో నిరుద్యోగ పట్టభద్రులు 35.14 శాతం మంది ఉన్నారని సీఎంఐఈ సర్వేలో తేలడం విధ్వంస విధానాలకు నిదర్శనం.

రాష్ట్రంలో కుల, మత, ప్రాంతీయ విద్వేషాలతో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేశారు. మూడు రాజధానుల పేరుతో విద్వేషాలు పెంచుతున్నారు. పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కల్పించడంలో విఫలమయ్యారు. ఇప్పటికైనా పారిశ్రామిక వ్యతిరేక విధానాలు విడనాడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE