Suryaa.co.in

Andhra Pradesh

85% హామీలు ఎగ్గొట్టిన జగన్ రెడ్డిని ఓడించాలి

– మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు డా. రాజ్యలక్ష్మి శిరిగినీడి

నర్సాపురం: సంపూర్ణ మధ్యనిషేధం చేసి ఓట్లు అడుగుతానన్న హామీపై మాట తప్పి మడం తిప్పి, నాసిరకం మద్యం పోసి 30 వేల మంది ప్రాణాలు తీసి, 35 లక్షల మంది ఆరోగ్యాన్ని నాశనం చేసి న జగన్ రెడ్డి పార్టీని ఓడించాలని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు డా. రాజ్యలక్ష్మి శిరిగినీడి పిలుపునిచ్చారు.

జగన్ రెడ్డి మ్యానిఫెస్టో, పాదయాత్ర హామీల్లో 85 శాతం విఫలమయ్యాడంటూ నర్సాపురంలో గురువారం విలేఖరులతో మాట్లాడారు. జగన్ రెడ్డి పోస్తున్న నాశిరకం మద్యం కారణంగా మహిళల మాంగల్యాలు మంటగలిసి కుటుంబాలు చితికిపోతున్నాయన్నారు. ‘కరెంటు రేట్లు తొమ్మిది సార్లు పెంచి రూ.64 వేల కోట్లు భారం మోపారు. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీపై మాట తప్పాడు. మెగా డిఎస్సీని దగా డిఎస్సీ చేశాడు. ప్రతి జనవరి లో జాబ్ క్యాలండర్‌ హామీకి విరుద్ధంగా జాబ్ లెస్ క్యాలండర్‌ చేశాడని.. ఇసుక రేట్లు నాలుగు రెట్లు పంచి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధి రెబ్బ తీశాడని రాజ్యలక్ష్మి మండిపడ్డారు.

ఇసుక అక్రమ వ్యాపారంలో జగన్ రూ.50 వేల కోట్లు లూటీ చేశాడని, బూటకపు సంక్షేమ పథకాలతో పది రూపాయలు ఇచ్చి తొంబై రూపాయలు దోచుకుంటున్నాడని రాజ్యలక్ష్మి ఎద్దేవా చేశారు. వారంలో రద్దు చేస్తానన్న సి. పి. ఎస్ హామీపై మాట తప్పాడన్నారు. ఇలా 85% హామీలు అమలు చేయకపోగా.. 99% చేశానని జగన్ రెడ్డి అబద్దాలు చెపుతున్నాడని రాజ్యలక్ష్మి ఆక్షేపించారు.

130కి పైగా సంక్షేమ పథకాలు రద్దు చేసిన పేదల ద్రోహి జగన్ రెడ్డి అని.. అందుకే జగన్‌ని ఇంటికి పంపించడానికి ప్రతీ ఒక్కరు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా కార్యదర్శి తాయారు, సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ చల్లా పద్మావతి, బండి స్వర్ణలత, తోట భారతి, సుంకర రాజకుమారి, తోట అరుణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE