Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి .. మీరిస్తామన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ ?

– నిరుద్యోగుల్ని వదిలేసి వైసీపీ కార్యకర్తలకు జాబ్ మేళాలు వైసీపీ బరితెగింపుకు నిదర్శనం
– వైసీపీ కార్యకర్తలకు జాబ్ మేళాలు ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఎలా నిర్వహిస్తారు? కావాలంటే తాడేపల్లి ప్యాలెస్ లోనో, లోటస్ పాండ్ లోనో నిర్వహించుకోండి.
– టిడిపి శాసన మండలి సభ్యులు మంతెన సత్యనారాయణ రాజు

అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాలిస్తానని చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట తప్పి నిరుద్యోగులను నిలువునా మోసం చేశారు. నాడు కులం చూడం, మతం చూడం రాజకీయం చూడం అంటూ పలికిన కుహనా మేధావులు కేవలం వైసీపీ కార్యకర్తలకే జాబ్ మేళాలు నిర్వహించటం ఏంటి? దీన్ని పక్షపాతం అనాలా లేక బరితెగింపు అనాలా?

పైగా వైసీపీ కార్యకర్తలకు జాబు మేళాలు ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఎలా నిర్వహిస్తారు? వైసీపీ రాజకీయ కార్యక్రమాలకు యూనివర్సిటీలను ఎలా ఉపయోగిస్తారు? వైసీపీ కార్యకర్తలకు జాబ్ మేళాలు నిర్వహించాలంటే తాడేపల్లి ప్యాలెస్ లోనో ‎ లేదా లోటస్ పాండ్ లోనో నిర్వహించుకోండి అంతే తప్ప ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో నిర్వహిస్తే ఊరుకోం. కేవలం వైసీపీ కార్యకర్తలకే జాబ్ మేళాలు నిర్వహించి ఉపాధి కల్పిస్తే…మిగతా నిరుద్యోగుల పరిస్థితి ఏంటి?

రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులుంటే వారి గురించి ఆలోచించకుండా కేవలం ఎన్నికల్లో వైసీపీ తరపున ఓటర్లకు డబ్బులు పంచిన వాళ్లకు, ఎన్నికల వేళ పోలింగ్ బూతుల్లో గొడవలు చేసిన వారికి ఉధ్యోగాలివ్వటం ఏంటి? ఇప్పటికే వాలంటీర్ వ్యవస్ధ పేరుతో 50 ఇళ్లకు ఒక వైసీపీ కార్యకర్తను వదిలారు, వాళ్లు సేవా ముసుగులో లబ్దిదారులు దగ్గర లంచాలు తీసుకుంటుంటే మరికొంతమంది మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేవలం వైసీపీకి చెందిన వారికే లబ్ది చేకూరేలా వ్యవహరిస్తున్నారు తప్ప నిరుద్యోగుల్ని, ప్రజల్ని పట్టించుకోవటం లేదు. జగన్ రెడ్డి వైఖరితో రాష్ట్రానికి కొత్తగా ఒక్క పరిశ్రమ రాకపోగా ఉన్న కంపెనీలు తరిమేసి వాటిల్లో పనిచేస్తున్న యువతను రోడ్డున పడేశారు, కొత్తగా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. జగన్ రెడ్డి 3 ఏళ్ల పాలనలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక సుమారు 400 మందికి పైగా నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

మరో వైపు నిరుద్యోగులు అథికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 4 వ స్ధానంలో ఉంది. జగన్ రెడ్డి పాలనలో ఏపీ పరిస్థితి, రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతోంది. కానీ జగన్ రెడ్డి మాత్రం నిరుద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టకుండా కేవలం వైసీపీ కార్యకర్తలకు లబ్డి చేకూర్చేలా వ్యహరించటం ముఖ్యమంత్రిలో హోదాలో ఉన్న వ్యక్తికి సరికాదు. ఇచ్చిన హామీ ప్రకారం జగన్ రెడ్డి వెంటనే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలి.

 

LEAVE A RESPONSE