Suryaa.co.in

Andhra Pradesh

మీరు జగనన్నకు చెబుదామంటున్నారు-ప్రజలేమో తరిమికొడతామంటున్నారు

– జగన్ రెడ్డి సర్కస్ ఫీట్లు టీడీపీ విజయాన్ని, వైసీపీ ఓటమిని ఆపలేవు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు

జగనన్నకు చెబుదాం కార్యక్రమం జగన్ రెడ్డి పొలిటికల్ స్టంట్. రాష్ట్రానికే పెద్ద సమస్యగా మారిన జగన్ రెడ్డికి చెప్పుకోవడం వల్ల ప్రజలకు ఒరిగేదేమిటి? చేకూరే అదనపు ప్రయోజనమేంటి? తన అమసర్థ పాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ బటన్ నొక్కడాలు, కొత్త పేర్లతో పథకాలు ప్రకటించడాలు వంటి సర్కస్ ఫీట్లు చేస్తున్నారే తప్పించి ఇంకేం లేదు. ఆర్భాటంగా స్పందన కార్యక్రమం చేపట్టి నాలుగేళ్లయింది. ఒక్క సమస్యనైనా పరిష్కరించారా?

ఇప్పుడేమో జగనన్నకు చెబుదాం అంటున్నారు. పైగా 1902 పేరుతో మీరిచ్చిన హెల్ప్ లైన్ ఓ పెద్ద బోగస్. నాలుగేళ్లపాటు ప్రజలను మోసం చేసింది చాలదా? రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లను ఆపరేటర్లుగా పెట్టుకున్నా ఒక్క సమస్యా పరిష్కరించడం మీకు చేతకాదు. అయినా…ప్రజల్లోకి వచ్చి నేరుగా సమస్యలు వినలేని ముఖ్యమంత్రి ఫోన్ కాల్ ద్వారా సమస్యలు విని పరిష్కరిస్తాననడం హాస్యాస్పదం కాక మరేమిటి?

ప్రజాస్వామ్యంలో ప్రజలు చెప్పేది సావధానంగా విని ప్రభుత్వ యంత్రాంగంతో పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత. ఈ నాలుగేళ్లలో జగన్ రెడ్డి ఒక్కరోజైనా ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించారా? పాలనను గాలికొదిలేసి జే ట్యాక్స్ వసూళ్లలో మునిగితేలుతున్నారు. ఇష్టారాజ్యంగా ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారు. మూడు రాజధానుల పేరుతో అమరావతిని చంపేశారు. పోలవరాన్ని ప్రశ్నార్థకం చేశారు. ప్రత్యేకహోదాను అటకెక్కించారు. రైల్వే జోన్ ఊసే ఎత్తడం లేదు. వెనకబడిన జిల్లాలకు నిధులు రాకపోయినా ఉలుకూ పలుకూ లేదు.ఇన్ని సమస్యలకు కారణమైన జగన్ రెడ్డికి ప్రజలు ఏం చెప్పుకోవాలి?

గత టీడీపీ ప్రభుత్వంలో పీపుల్స్ ఫస్ట్ పేరుతో కార్యక్రమం నిర్వహించి ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాం. 1100 టోన్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. సమస్య పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు సీఎం డ్యాష్ బోర్డుకు అనుసంధానం కూడా చేశాం. మరి జగన్ రెడ్డి చేస్తున్నదేమిటి? తాడేపల్లి ప్యాలెస్ గడప దాటకుండా బోగస్ పథకాలకు రిబ్బన్ కటింగ్ చేస్తే నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదు. రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న డ్రామాలు రాష్ట్రమంతా గమనిస్తోంది. గడపగడపకు మన ప్రభుత్వం, ఇంటింటికీ స్టికర్లు అంటూ చేసిన హడావుడికి ప్రజలు ఛీ కొట్టినా జగన్ రెడ్డి, వైసీపీ నేతలకు బుద్ధి వచ్చినట్టు లేదు. జగనన్నకు చెబుదాం అంటూ మరో ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ తో వచ్చేస్తున్నారు. జగన్ రెడ్డి నకిలీ పథకాలకు కాలం చెల్లింది. మీ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

LEAVE A RESPONSE