Suryaa.co.in

Andhra Pradesh

పెళ్లికానుక పేరుతో జగన్ రెడ్డి ఎన్నికల స్టంట్

-ప్రచార ఆర్భాటం తప్ప.. పేదింటి ఆడబిడ్డలకు భరోసానివ్వని దుస్థితి
– తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత

జగన్మోహన్ రెడ్డి చెప్పేది కొండంత-చేసేది గోరంత. ఐదేళ్లుగా పెళ్లి కానుక పథకానికి తిలోదకాలు ఇచ్చి ఎన్నికల వేళ బటన్ నొక్కుడుతో హడావుడి చేయడం మహిళలను మోసం చేయడమే. మహిళా సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన 22 పథకాలను రద్దు చేసి పెళ్లికానుక అనడం సిగ్గుచేటు. తల్లికీ, చెల్లికీ న్యాయం చేయలేని జగన్ రెడ్డి రాష్ట్రంలోని ఆడబిడ్డలకు న్యాయం చేస్తాడా? నిరుపేద కుటుంబాలలోని ఆడపిల్లల పెళ్లి… కుటుంబానికి భారం కాకూడదని చంద్రబాబు పెళ్లికానుక పథకం తెస్తే జగన్ రెడ్డి తూట్లు పొడిచాడు.

తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే సుమారు 80 వేలమందికి పెళ్లి కానుకలు ఇస్తే జగన్ రెడ్డి ఇచ్చానని చెబుతోంది కేవలం 35 వేలమందికే. మాటలు కోటలు దాటించి చేతలు గడప దాటకపోవడాన్ని మోసకారి సంక్షేమం అనక ఏమంటారు జగన్ రెడ్డీ? తెలుగుదేశం ప్రభుత్వం విద్యా అర్హత నిబంధన లేకుండా పెళ్లికానుక అమలు చేస్తే జగన్ రెడ్డి నిబంధన పెట్టి పేదలకు పథకం దూరం చేయడం దుర్మార్గం కాదా? పైగా తన ఫోటో పిచ్చి, ప్రకటనల పిచ్చికి కోట్లకు కోట్లు ప్రజాధనం మంచినీళ్ల ప్రాయంగా దుర్వినియోగం చేసే హక్కు మీకు ఎవరిచ్చారు?

ప్రజల సొమ్ముతో ప్రకటనలు ఇస్తూ.. గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం దుర్మార్గం. పైగా గతంలో బటన్ నొక్కిన డబ్బులే ఇంకా పూర్తిగా జమకాలేదు. ఇప్పుడు వేస్తున్న డబ్బులు ఎప్పటికి జమ అవుతాయో కూడా తెలియని స్థితి.

టీడీపీ హయాంలో దాదాపు 2,500 మంది స్థానిక యువతులను కళ్యాణమిత్రలుగా నియమిస్తే, జగన్ రెడ్డి వచ్చాక వారికి వేతనాలు కూడా ఇవ్వకుండా వారిని రోడ్డున పడేశారు. ఇలాంటి జగన్ రెడ్డి.. ఇప్పుడు కళ్యాణమస్తు, షాదీ తోఫా అంటూ బటన్లు నొక్కడం సిగ్గుచేటు.

చదువులకు దూరం చేసి చదువుంటే పథకాలనడం మోసం చేయడం కాదా? టీడీపీ ప్రభుత్వం కులాంతర వివాహం చేసుకున్నవారందరికీ పథకం అమలు చేస్తే జగన్ రెడ్డి ఒక్క రూపాయి ఇవ్వకపోవడం ద్రోహం కాదా? జగన్ రెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఉపయోగం లేదు. కేవలం ప్రచారార్భాటం చేస్తూ ఐదేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్న జగన్ రెడ్డిని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

LEAVE A RESPONSE