మే డే.. అది క్యాలెండర్లో ఒక ఎర్రటి తేదీ మాత్రమే కాదు. అది సమాజమనే మహా వృక్షానికి వేర్లుగా మారి, తమ రక్తాన్ని చెమటగా మార్చి పోస్తున్న కోట్లాది మంది శ్రామికుల ఆత్మగౌరవ పండుగ. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఆ శ్రమకు మూడు వేర్వేరు ముఖాలున్నాయి.. మూడు వేర్వేరు నొప్పులున్నాయి.
ఒకప్పుడు సీమ అంటే ఫ్యాక్షన్ రక్కసి కోరల్లో చిక్కుకున్న నేల. అక్కడ పేదవాడికి శ్రమించే స్వేచ్ఛ కూడా ఉండేది కాదు. పాలేగాడు పిలిస్తే వెళ్ళాలి.. వాడు చూపిన దిక్కుగా నడవాలి.. వాడు శత్రువు అన్న వాడిపై కత్తి ఎత్తాలి. వెళ్ళకపోతే పొట్టకూడు ఉండదు.. తిరగబడితే ఆ రాత్రే ఇల్లు బూడిదవుతుంది. గడచిన దశాబ్దాల్లో ఎనిమిది వేల మందికి పైగా సామాన్యులు ఈ వర్గపోరులో బలైపోయారు. తండ్రి జైల్లో, అన్న శత్రువుల చేతిలో — ఆ పసిపిల్లల బాల్యం భయం నీడలోనే గడిచిపోయేది. కార్మికుడు అంటే అక్కడ కేవలం ఒక ‘ఆయుధం’ మాత్రమే.
ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తెల్లవారుజామున బస్సు ఎక్కే కొడుకును చూసి అమ్మ కళ్ళు తుడుచుకుంటుంది — ఎందుకు వెళ్తున్నావని అడగదు, తెలుసు కాబట్టి. సొంత ఊళ్ళో పని లేదు.. ఉన్న పొలం గిట్టుబాటు కాదు. అక్కడ వాడు మేడలు కడతాడు — తను నివసించే హక్కు లేని మేడలు. రోడ్లు వేస్తాడు — తను నడవని రోడ్లు. తండ్రి ముఖం పిల్లలకు కేవలం పండగలకే గుర్తొచ్చే వలస బతుకది.
మరో వైపు కోస్తా ఆంధ్రాలో పంట పండింది అనుకునే లోపే వరద ముంచెత్తుతుంది. నెలల కష్టం గంటల్లో నీటి పాలవుతుంది — అప్పు మిగులుతుంది, పంట మిగలదు. చేపల వేటకు వెళ్తే ప్రాణాలకు గ్యారెంటీ లేదు.. వరద వస్తే పని దొరికే దారి లేదు.
ఫ్యాక్షన్ నుండి నక్సలిజం వరకు చూసిన గతాలను గొయ్యి తీసి పాతిన నాయకుడు నేడు పమిడిముక్కల సాక్షిగా కొత్త వెలుగులు నింపాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే అది ఒక పాలకుడి ప్రసంగంలా లేదు — కష్టం తెలిసిన ఒక పెద్దకొడుకు ఆవేదనలా ఉంది.
“నేను నేల మీద నుంచి వచ్చిన వాడిని. రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాబట్టే — మండుటెండలో మీ నుదుటి మీద చేరే చెమట చుక్క విలువ నాకు తెలుసు.”
ఆ మాటలు వింటుంటే అక్కడ కూర్చున్న వేలాది మంది కార్మికుల కళ్ళు చెమ్మగిల్లాయి.
కార్మికుడికి కావాల్సింది అద్భుతమైన హామీలు కాదు — మధ్యాహ్నం ఆకలేసినప్పుడు కడుపు నిండా నాలుగు మెతుకులు. రాష్ట్రవ్యాప్తంగా వెలిసిన 263 అన్న క్యాంటీన్లు కేవలం భవనాలు కావు.. అవి ఆకలి తీర్చే దేవాలయాలు. సీమ కూలీ అయినా, కోస్తా మత్స్యకారుడైనా, ఉత్తరాంధ్ర వలస కార్మికుడైనా — అందరికీ ఒకే గౌరవం, ఒకే భోజనం.
“కార్మికుడి కొడుకు ఎందుకు యజమాని కాకూడదు?”
ఈ ఒక్క ప్రశ్న తరతరాల పేదరికానికి చంద్రబాబు విసిరిన సవాల్. “వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్” — ప్రతి ఇంట్లో ఒక యజమానిని తయారు చేయడమే లక్ష్యం. లేబర్ అడ్డాలను స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలుగా మారుస్తున్నారు. వర్షమైనా, ఎండైనా నీడతో, వసతులతో 15 మోడల్ లేబర్ అడ్డాలను నిర్మిస్తున్నారు.
నిర్మాణ రంగంలో ఉన్న కార్మికుడి వివాహ ఖర్చుకు రూ.25 వేలు, కార్మికుడి కుమార్తెకు కూడా ఈ పథకం, వారికి సంతానం కలిగితే రూ.20 వేలు ఆర్ధిక సాయం, సాధారణ మరణానికి రూ.60 వేలు…అంత్యక్రియలకు రూ.20 వేలు ఇవన్నీ ఒక ప్రభుత్వం ఇస్తున్న కానుకలు కాదు, ఆ కుటుంబాలకు ఇస్తున్న భరోసా. ఆటో డ్రైవర్‌కి ఇచ్చే రూ. 15,000 సాయం — ఒక రోజు రిపేర్ వచ్చినా ఆ రాత్రి ఆ కుటుంబానికి ప్రశాంతమైన నిద్రను ఇస్తుంది. అచ్యుతాపురం నుండి అమరావతి వరకు వెలుస్తున్న ఈఎస్ఐ ఆసుపత్రులు — కార్మికుడి ఆరోగ్యం కూడా ప్రభుత్వ బాధ్యత అని చాటిచెబుతున్నాయి.
పాలేగాడి నీడలో రోజుకు 161 రూపాయల గౌరవ వేతనం అని 50 ఇండ్లకు ఒకడిని నిఘా పెడితే వణికిన నేల ఇప్పుడు పారిశ్రామికవేత్త అడుగుల చప్పుడు వింటోంది. శ్రమ శక్తి పురస్కారాలు అందుకుంటున్న కార్మికులకు ముఖ్యమంత్రి సెల్యూట్ చేస్తుంటే — అక్కడ కనిపించింది అధికారం కాదు.. శ్రమను గౌరవించే ఒక గొప్ప సంస్కారం.
“రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తీ ఇబ్బంది పడకూడదు”
ఇది ఒక నాయకుడి ఆశయం మాత్రమే కాదు — ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు బలమైన వారసత్వం!