– అధికారికంగా అన్నమయ్యను తెలుగుకు ప్రతీకగా ప్రకటించాలి
– సార్వజనీనమైన, సార్వకాలికమైన ఒక విశ్వకవి అన్నమయ్య!
అన్నమయ్య ఒక మహోన్నతమైన కవి, తాత్త్వికుడు, భక్తుడు. అన్నమయ్య ఒక అంతర్జాతీయస్థాయి కవి. ఇవాళ ప్రపంచంలో గొప్ప కవులుగా పరిగణించబడుతున్న లావొచు, రూమీ, ఖలీల్ జిబ్రాన్, వంటి వాళ్ల శిల్పం అన్నమయ్యలో సాంద్రంగా ఉంది. అంత వేమన కూడా అన్నమయ్యలో ఒక పార్శ్వం మాత్రమే. అన్నమయ్యలో ఉన్న వస్తువైవిధ్యం, శిల్ప వైవిధ్యం, విషయావగాహన, తీక్ష్ణతలు ఏ కవిలోనూ లేవు.
కవి అన్నమయ్య ఒక తాత్త్వికుడు. అన్నమయ్య ఒక భక్తుడు.
అన్నమయ్య కృతులు అని తెలియకుండానే “జ్యో అచ్యుతానంద జో జో ముకుంద”, “చందమామ రావే” వంటి పాటలు జనబాహుళ్యంలోకి వచ్చాయి.
“లేని భ్రమ లుడిగి లేవయ్యా
లేనగుమోముతో లేవయ్యా”
అనీ,
“తలఁపు గారణము తత్త్వవేత్తలకు
చలము గారణము సంసారులకు
ఫలము గారణము పరమ వేదాంతులకు
కలిమి గారణము కర్ములకును”
అనీ,
“నీ చేఁతలే రాత్రులుఁబగళ్లు నీచేఁతలే కాలత్రయము”
అనీ,
“వేడుకకు వెలలేదు”
అనీ,
“ఎప్పుడే బుద్ధి పుట్టునో యెరఁగ రాదు”
అనీ,
“కావరపు విషయాల కట్లువదలవు”
అనీ,
“ఏది చూచినా నీవే యిన్నియును మఱి నీవే”
అనీ,
“సంతలే చొచ్చితిఁగాని సరకుఁ గాననైతి
(ఇలాంటివి సూఫీ కవుల్లో కూడా కనిపిస్తాయి)”
అనీ,
“తగుదైవ మొకఁడే తమ మతములే వేరు”
అనీ,
“వలపు వెఱపెఱుగునా”?
అనీ,
“దట్టపు జడునికి దైవంబేలా”?
అనీ,
“పాయము ముదిసినాను భావము ముదియదు”
అనీ అన్న అన్నమయ్య ఇంకా ఎన్నో అన్నారు. అన్నమయ్య అన్నవన్నో ఉన్నతమైనవి; ఉల్లానికి మంచి చేసేవి.
అన్నమయ్య ఇవాళ అందఱుకీ అందుబాటులోకి రావడానికి ఉద్యమించిన త్రిమూర్తులు:
1. సాదు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు
2. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు
3. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు.
1927లో సాదు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ విషయమై తమ పనిని మొదలు పెట్టారు. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు విశేషమైన కృషి చేశారు. రాళ్లపల్లి వారు అన్నమయ్య గొప్పదనాన్ని వివరించే బాధ్యత తీసుకుని సఫలమయ్యారు. వేమన కవితా ధోరణికి మూలాలు అన్నమయ్యలో ఉన్నాయని తెలియజేశారు. అన్నమయ్య విషయమై గౌరిపెద్ది రామసుబ్బశర్మ , కామిశెట్టి శ్రీనివాస్ శ్లాఘనీయమైన కృషి చేశారు. ప్రస్తుతం వేటూరి ఆనందమూర్తి గారు అన్నమయ్య సంకీర్తనల ఖనిగా ఉన్నారు.
అన్నమయ్య సంకీర్తన సి.పుల్లయ్య తీసిన జోడు కథల సినిమా ‘సతీ అనసూయ- ధ్రువ’ కోసం రికార్డ్ చెయ్యబడి ఆపై గ్రామఫోన్ రికార్డ్ గా విడుదలయింది (1937?). “జ్యో అచ్యుతానంద జో జో ముకుంద” సంకీర్తన అది. ఈ సంకీర్తనను తీసుకుని బల్జేపల్లి లక్ష్మీకాంతంతో సినిమా కోసం కొన్ని పంక్తులు వ్రాయించి కలిపారు.
అయితే అప్పటికి అది అన్నమయ్య రచన అని ఆ సినిమా కళాకారులకి తెలియదు. స్త్రీల పాట అనుకునే సినిమాకు తీసుకున్నారు. అన్నమయ్య సంకీర్తన రికార్డ్ గా వచ్చిన తొలి సందర్భం అది. ఆ సినిమాలో ఈ సంకీర్తనని పాడిన వారు సి. కృష్ణవేణి. అన్నమయ్య సంకీర్తనను తొలిసారి రికార్డ్ పై పాడిన వారు సి.కృష్ణవేణి.
మొట్టమొదట సారిగా అన్నమయ్య సంకీర్తనల ఎల్.పి. రికార్డ్ బాలమురళి కృష్ణ ఇచ్చారు.
1974 లో నేదునూరి వారు అన్నమయ్య సంకీర్తనలకు సంగీత రూపంలో ప్రాచుర్యాన్నిచ్చే పనిని చేపట్టారు. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు అన్నమయ్య బాషకు ముఖ్యమైన నాదం అయ్యారు. ఇంకా ఎండఱో అన్నమయ్యను నినదిస్తున్నారు. సముద్రాల లక్షమణయ్య వంటి ఎందఱో గొప్పవారు అన్నమయ్య సంకీర్తనలపై రాశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య సంకీర్తనల వ్యాప్తికి ఎంతో కృషి చేస్తోంది.
నాకు కనిపించిన అన్నమయ్యను ఆంధ్రజ్యోతిలో ‘అన్నమయ్య అన్నది’ పేరుతో 32 వ్యాసాల్లో రాశాను.
“అన్నమయ్య,
తెలుగుకవితా సౌభాగ్యాల అయ్య!”
తెలుగుకు ప్రతీకగా అన్నమయ్య!
ఎట్లా అయితే తమిళ్షులు తమ తమిళ్ష్ భాషకు మహాకవి సుబ్రమణియ బారదియార్ (సుబ్రహ్మణ్య భారతియార్)ను ప్రతీకగా చేసుకున్నారో ఆ తీరులో మహోన్నతమైన కవి-తాత్త్వికుడు అన్నమయ్యను తెలుగుభాషకు ప్రతీకగా మనం నిలుపుకోవాలి.
అన్నమయ్య సనాతన మూర్తిమత్వం; అన్నమయ్య భారతీయతా కృతి.
‘అన్నమయ్య తెలుగుభాష ప్రతీక’ అవాల్సిన అవసరం ఉంది.
ఆధికారికంగా అన్నమయ్యను తెలుగుకు ప్రతీకగా ప్రకటించాలని మాన్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంగా కార్యచరణ చెయ్యాలని నా సవినయ విజ్ఞప్తి.
అన్నమయ్య ఒక నిఖార్సైన ప్రజాకవి! తెలుగు భాషకు సంబంధించినంత వఱకూ ప్రజలలో ఎక్కువగా ఉన్న కవి అన్నమయ్య! అన్నమయ్య రాసినవి అని తెలియకుండానే అన్నమయ్య కృతులు ప్రజల్లో చలామణి అయ్యాయి. ఇవాళ్టి రోజున తెలుగు ప్రజల్లో ఎక్కవగా ఉన్న రచనలు అన్నమయ్య రచనలే.
అన్నమయ్య ఒక అంతర్జాతీయ స్థాయి కవి!
ఇవాళ అంతర్జాతీయంగా ఏ రచనా సంవిధానం, ఏ విధమైన చింతన, ఏ విధమైన భావన, ఉన్నతమైన కవిత్వంగా పరిగణించబడుతూ, కొనియాడబడుతూ, ఎక్కువగా చదవబడుతున్నదో ఆ స్థాయిలో కవిత్వం చెప్పారు అన్నమయ్య.
అన్నమయ్య అంతర్జాతీయ స్థాయి తెలుగు ప్రజాకవి!!!
అన్నమయ్య లోని వైవిధ్యం, వస్తు సంపద, రచనా శిల్పం, శైలి ఉత్కృష్టమైనవి. అన్నమయ్య కవిత్వజ్ఞత. అనన్యం; అసదృశం. సార్వజనీనమైన, సార్వకాలికమైన ఒక విశ్వకవి అన్నమయ్య!!!
అన్నమయ్య అన్నది మనకై ఉన్నది… స్మరించుకుంటూ ఉందాం; అన్నమయ్యను తెలుగు చిహ్నం చేసుకుందాం.
– రోచిష్మాన్
9444012279