Suryaa.co.in

Political News

అంబేద్కర్ స్ఫూర్తికి జగన్ రెడ్డి కత్తిపోట్లు

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే జీవో ఆర్.టి-1
దళితులను ఊళ్లకు దూరంగా తరలించే సామాజిక కుట్ర జగన్ మనస్తత్వానికి దర్పణం
ప్రజాస్వామ్యం ఖూనీ అయితే తీవ్రంగా నష్టపోయేది బడుగు, బలహీన, పేద వర్గాలే

భారత రాజ్యంగం ద్వారా అన్ని కులాలు, వర్గాలకు సమానత్వం కల్పించాలన్నది డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయం. ముఖ్యంగా శతాబ్దాలుగా, తరతరాలుగా వివక్షకు, అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాలకు సాధికారత కల్పించి వారిని ఇతరులతో సమానంగా చేయాలన్నది ఆయన కల. ఈ ఆశయ సాధనకు ఆయన ఎంచుకున్న మార్గం ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అనేది కేవలం పరిపాలనకు మాత్రమే సంబంధించిందికాదు.. అది బహుళార్థసాధక సామాజిక నిర్వహణ కోసం అని ఆయన అన్నారు.

ప్రపంచంలో ఏ దేశ చరిత్రలో లేనివిధంగా 1950లో రాజ్యంగం అమలులోకి వచ్చిన వెంటనే భారత పౌరులందరికీ ఓటు హక్కు కల్పించబడింది. సమసమాజ స్థాపనకు మన దేశం వేసిన తొలి గొప్ప అడుగు ఇదే. దీని ద్వారా అందరికీ గళమెత్తి తమ హక్కుల కోసం నినదించే అవకాశం కలిగింది. ఆ మహనీయుని ఇట్టి మహత్తర స్ఫూర్తికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వెన్నుపోటు కాదు నేరుగా కడుపులోనే కత్తులు దించుతున్నాడు.

నూతన సంవత్సర వేళ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఆర్.టి-1 ఒక తాజా నిదర్శనం. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ఈ చీకటి చట్టం ఉద్దేశం ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కుని హరించటమే. గత మూడున్నరేళ్లుగా దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలపై నిరంతరం జరుగుతూ వస్తున్న దాడుల నేపథ్యంలో ఈ తాజా చీకటి ప్రక్రియ జగన్ రెడ్డి వికృత మానసికతకు పరాకాష్ట. దళితులపైనే దళిత వివక్ష వ్యతిరేక చట్టాల ప్రయోగం, గుండు గీయించడం వంటి పలు అమానుష, అవమానకర చర్యలు, వారి స్థలాలను, ఆస్తులను బలవంతంగా లాక్కోవడం వంటి పలు చర్యలను రాష్ట్ర ప్రజలు గమనిస్తూ వస్తున్నారు.

జగనన్న కాలనీల పేరుతో దళితులను ఊళ్లకు దూరంగా, నివాసయోగ్యంకాని ప్రాంతాలకు తరలించే సామాజిక కుట్ర జగన్ మనస్తత్వానికి దర్పణం. దళితులకు, గిరిజనులకు నిర్దేశించిన సబ్ ప్లాన్ ల కోట్లాది రూపాయల నిధుల దారి మళ్లింపు ఈ వర్గాల పట్ల ముఖ్యమంత్రికి ఎటువంటి సానుభూతి లేదని స్పష్టం చేస్తోంది. దళిత కాలనీల్లో ఉంటేనే విద్యుత్ సబ్సిడీ ఇస్తామన్న నిబంధన ద్వారా ఈ వర్గాలను ప్రధాన స్రవంతికి దూరం చేసే కుట్రను కూడా చూశాం.

ప్రజాస్వామ్యం ఖూనీ అయితే తీవ్రంగా నష్టపోయేది బడుగు, బలహీన, పేద వర్గాలే. నిరంతరం దోపిడీకి గురవుతున్న ఈ తాడిత, పీడిత వర్గాలు సమిష్టిగా తమ హక్కుల కోసం ఉద్యమించకూడదని జగన్ తెచ్చిన తాజా చీకటి చట్టం ఈ వర్గాలకు ఒక హెచ్చరిక. ప్రజాస్వామ్య చట్రంలో సమసమాజ స్థాపన ఆకాంక్షించిన డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా నడుస్తున్న జగన్ రెడ్డికి చరమగీతం పాడవలసింది ప్రజలే.

– అంచా అయ్యేశ్వరరావు
(మాజీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి)

LEAVE A RESPONSE