-దక్కాల్సిన ప్రయోజనాలు అడిగిన వారిని విధుల నుండి తొలగిస్తారా.?
-కానిస్టేబుల్ ప్రకాష్ ను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి
-పోలీసులకు పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు?
– టీడీపీ శాసన సభ్యులు అనగాని సత్యప్రసాద్
కుటుంబ సభ్యులను వదిలి పండుగ నాడు సైతం ప్రజలకు రక్షణ కల్పిస్తూ శాంతి భద్రతలను కాపాడే పోలీసుల సంక్షేమం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మాట ఇస్తే తప్పను అని డైలాగులు చెప్పి ఇచ్చిన మాట తప్పడం, చెప్పింది మర్చిపోవడమే పనిగా ఈ ముఖ్యమంత్రి పెట్టుకున్నారు. అధికారంలోకి వస్తే పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తామన్న మాట ఇప్పుడు ఏమైంది.? పోలీసుల సమస్యలపై ఎందుకు ఈ ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు.? పోలీస్ సంస్మరణ దినోత్సవం సాక్షిగా యేటా 6 వేల ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి, హోంమంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిందీ లేదు.
కోవిడ్ లో విధులు నిర్వర్తిస్తూ చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. ఒక్కరికైనా సాయం చేశారా.? టీడీపీ హయాంలో పోలీసులకు పెంచిన జీతాలను తమ ప్రభుత్వం పెంచినట్లుగా చెప్పుకోవడానికి ఈ ముఖ్యమంత్రికి సిగ్గుండాలి. అర్హత లేని వారికి కేబినెట్ హోదా ఇస్తూ ప్రభుత్వ ధనాన్ని దోచిపెడుతూ నిజాయితీగా పనిచేసే పోలీసు అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా వీఆర్ లో పెట్టి వేధిస్తున్నారు.
ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడుగుతున్న పోలీసులపైనా కక్షసాధింపులకు ఈ ప్రభుత్వం పాల్పడుతోంది. జగన్ సార్..మా సమస్యలు పరిష్కరించండని వేడుకున్న కానిస్టేబుల్ ప్రకాష్ ను విధుల నుండి తప్పించడం దుర్మార్గం. రావాల్సిన జీత భత్యాలు అడగడం తప్పా.? పోలీసులు న్యాయపరంగా ఏం డిమాండ్ చేస్తున్నారో తెలుసుకోవడానికి ఈ ప్రభుత్వానికి ఓపిక లేదా? ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి, విధుల నుండి తప్పించడం వారి గొంతునొక్కాలనుకోవడమే.
కానిస్టేబుల్ ప్రకాష్ కుటుంబాన్ని పండగపూట పస్తులుంచిన దిక్కుమాలిన ప్రభుత్వం వైసీపీ. ఆ కుటుంబ ఉసురు ఈ ప్రభుత్వానికి తగలక మానదు. ప్రకాష్ మాదిరి మిగతా పోలీసులు కూడా నోరెత్తగలిగితేనే మీకు న్యాయం జరగుతుంది. లేదంటే జగన్మోహన్ రెడ్డి అణచివేతకు రోజూ చింతించక తప్పదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కానిస్టేబుల్ ప్రకాష్ కుటుంబానికి అన్ని విధాలా న్యాయం చేస్తాం. పోలీసుల ఆత్మస్థైర్యాన్ని జగన్ రెడ్డి దెబ్బతీస్తున్నారు. పోలీసుల న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలి.