Suryaa.co.in

Editorial

కాంగ్రెస్ వైపు జగన్?

– మోదీపై జగన్ జంగ్
– మంత్రులతో మోదీని తిట్టిస్తున్న జగన్
– తాను తిట్టకుండా మంత్రులతో తిట్టిస్తున్న తెలివి
– బీజేపీ వల్లే పథకాలు ఆగుతాయన్న ప్రచారం
– ఇలాంటి ప్రధానిని ఎక్కడా చూడలేదన్న మంత్రి బొత్స
– ముగ్గురూ కలసి కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలు
– జగన్ తీరుపై ‘కమలం’ కన్నెర్ర
– జగన్ కాంగ్రెస్ దరిచేరుతున్నారని బీజేపీ అనుమానం?
– జగన్ విశ్వాసఘాతకంపై బీజేపీ ఆగ్రహం
– ఢిల్లీ దృష్టికి మంత్రి బొత్స విమర్శలు
– జగన్ ఆదేశాలతోనే బొత్స విమర్శలని విశ్లేషణ
– నిన్నటివరకూ పురందేశ్వరి, సత్యకుమార్‌పై ఆరోపణలు
– ఇప్పుడు నేరుగా మోదీపైనే విమర్శలు ఎక్కుపెట్టించిన జగన్
– ఇక ‘కమలం’తో జగన్ కటీఫేనా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

జగన్ ఎక్కడికి వెళ్లినా ‘సిద్ధమా’ అని మైకును ఐదారుసార్లు టపటపా కొడుతూ ప్రశ్నిస్తుంటారు. తాను మాత్రం బలమైన ప్రత్యర్ధులతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధం కాకుండా.. మంత్రులతో యుద్ధానికి సిద్ధం ‘చేయించి’, అతి లౌక్యం ప్రదర్శిస్తున్న వైచిత్రి. మొన్నటివరకూ తనను ఆదుకున్న మోదీపైనే, మంత్రులతో దారుణంగా తిట్టిస్తున్న జగన్.. తాను మాత్రం మోదీని పల్లెత్తు మాట అనకుండా, జాగ్రత్తగా యుద్ధం ప్రారంభించారు. అంటే.. తాము ముందే ఊహించినట్లు, జగన్ కాంగ్రెస్ కూటమికి చేరువవుతున్నారన్నది బీజేపీ అనుమానం!

సంక్షేమ పథకాలు నిలిచిపోవడానికి టీడీపీ ఫిర్యాదులే కారణమని.. అందుకు మోదీ సహకారమే కారణమంటూ, మంత్రి బొత్సతో మోదీని తిట్టించారు. చివరకు ఇలాంటి దిగజారుడు ప్రధానిని ఎప్పుడూ చూడలేదంటూ బొత్సతో దారుణంగా తిట్టించేందుకు సిద్ధమయ్యారు. అంటే.. ప్రత్యక్షంగానయినా.. పరోక్షంగానయినా మోదీపై జగన్ యుద్ధం ప్రారంభించారన్న మాట.

ఎట్టకేలకూ జగన్ ముసుగు తొలగించారు. ఐదేళ్లూ మోదీతో రాజకీయంగా- కేసులపరంగా లబ్థిపొందిన జగన్.. ఇప్పుడు మోదీపై తాను కాకుండా, తన మంత్రులతో తట్టిపోయిస్తున్న ‘అతితెలివి’ రాజకీయానికి తెరలేపడం, కమలం కన్నెర్రకు కారణమయింది. ‘జగన్‌ది నిస్సందేహంగా అతి తెలివి రాజకీయమే. ఆయన ఆదేశాలు లేకపోతే మంత్రి బొత్స ప్రధానిని విమర్శించే సాహసం చేస్తారా? మేం అన్నీ విచారించాం. బొత్స విమర్శల వెనుక ఎవరున్నార న్నది మా పార్టీకి నివేదిక పంపించామ’ని బీజేపీ కీకల నేత ఒకరు వెల్లడించారు.

ఇప్పటివరకూ కోర్టులకు హాజరుకాకుండా బీజేపీ సాయం తీసుకున్న జగన్.. తీరా ఎన్నికల సమయంలో మోదీనే తిట్టిస్తున్న తీరు, బీజేపీకి ఆగ్రహం తెప్పిస్తోంది. తాము జగన్‌ను నమ్మవద్దని ఎన్నోసార్లు ఢిల్లీకి చెప్పినా ఎవరూ తమ మాట వినలేదని, ఎన్నికల సమయంలో జగన్ అసలు స్వరూపాన్ని మా వాళ్లు ఆలస్యంగా తెలుసుకున్నారని బీజేపీ నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

‘‘అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఎప్పుడంటే అప్పుడు రుణాలు తీసుకున్నారు. జగన్ అక్రమార్కుల కేసులో ఇప్పటిదాకా కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపు తీసుకున్నారు. కోర్టులకు హాజరుగాని ఏకైక సీఎం ఆయనే. వివేకా హత్య కేసులో ఎంపి అవినాష్‌రెడ్డిని అరెస్టు కాకుండా చూసుకున్నారు. ఈడీ, సీబీఐ కేసుల్లో రిలీఫ్ తె చ్చుకున్నారు. చివరకు ఎంపి రఘురామకృష్ణంరాజుకు నర్సాపురం సీటివ్వకుండా కూడా చూసుకున్నారు. ఇవన్నీ కేంద్రంలోని మా పార్టీ సహకారం లేకపోతే సాధ్యమయ్యేవా? కేంద్రం కన్నెర్ర చేస్తే జగన్ ప్రభుత్వం ఇన్నాళ్లు ఉండేదా? అయినా ఇన్ని మేళ్లు పొందిన జగన్, ఇప్పుడు కనీస విశ్వాసం లేకుండా నేరుగా ప్రధాని మోదీపైనే యుద్ధానికి తెరలేపారు. నిన్న మంత్రి బొత్స మాట్లాడింది ఆయన సొంత మాటలు కాదు. జగన్ చెబితేనే ఆయన మోదీని విమర్శించారు’’ అని ఓ బీజేపీ కీలక నేత విశ్లేషించారు.

ఇదిలాఉండగా.. బీజేపీ కీలక నేత ఒకరు, ప్రధానిపై విమర్శలకు సంబంధించి బొత్సతో మాట్లాడినట్లు బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకాయన ‘మీకు తెలుసు కదా? అవన్నీ నేను చేస్తానని మీరెలా అనుకుంటారు? సీఎం గారు చెబితేనే మాట్లాడా. నాకు మోదీగారిపై ఎలాంటి కోపం లేదు. అయినా మోదీ గారి గురించి తెలిసి నా అంతట నేను ఎలా పెట్టుకుంటాననుకున్నారు? రాజకీయాల్లో ఇవన్నీ తప్పవు. మీకు తెలుసుకదా’ అని సమాధానం ఇచ్చినట్లు బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

రాష్ట్రంలో కేంద్ర నిధులతో అమలవుతున్న సంక్షేమ పథకాలను, బీజేపీ అండతోనే ఈసీ ఆపివేయించిందన్న విమర్శలపై బీజేపీ ఆగ్రహంతో ఉంది. ఎప్పుడో బటన్లు నొక్కిన జగన్, వాటికి అప్పుడే నిధులు ఇవ్వకుండా, ఇప్పుడు అనుమతి కోరడం అతి తెవిలికి నిదర్శనమని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. గతంలో ఎన్నికల ముందు.. టీడీపీ ప్రభుత్వం చేసిన రైతు రుణ మాఫీకి సంబంధించిన నిధుల విడుదలను కూడా ఈసీ అడ్డుకుని, పోలింగ్ తర్వాత విడుదల చేయాలని ఆదేశించిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. అలాంటిది తన తప్పును కూడా జగన్, బీజేపీపై రుద్దడాన్ని ఆ పార్టీ నేతలు సహించలేకపోతున్నారు.

ప్రధానంగా మంత్రి బొత్సతో మోదీని తిట్టించిన వైనంపై, బీజేపీ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ‘‘ఇంత దిగజారిన ప్రధానిని ఎప్పుడూ చూడలేదు. మాకు మోదీ ఇక్కడకు వచ్చి సుద్దులు చెప్పాల్సిన పనిలేదు. కూటమి స్క్రిప్టును మోదీ చదివేస్తున్నారు. ప్రధాని మాటలకు ఒకపవిత్రత ఉండాలి. ప్రధాని విలువను మోదీ తీస్తున్నారు. ఇంత దిగజారుడు ప్రధానిని నేనెప్పుడూ చూడలేద’ని బొత్స చేసిన విమర్శలను బీజేపీ నాయకత్వం ఇప్పటికే ఢిల్లీ దృష్టికి తీసుకువెళ్లింది. అటు జాతీయ నాయకత్వం కూడా జగన్ తీరుపై ఆగ్రహంతో ఉంది.

నిజానికి మొన్నటివరకూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పైనే విమర్శలకు పరిమితమైన వైసీపీ… ఇప్పుడు నేరుగా ప్రధాని మోదీపైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడమంటే, జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నది అర్ధమవుతోందని బీజేపీ నేతలు, ఢిల్లీ నాయకత్వానికి విశ్లేషించినట్లు సమాచారం.

‘కర్నాటక డెప్యూటీ సీఎం డికె శివకుమార్ ద్వారా, జగన్ కాంగ్రెస్‌తో మంతనాలు జరుపుతున్నారని మాకు ఎన్నికలకు ముందే తెలుసు. నెంబర్‌గేమ్‌లో తేడాలొస్తే కాంగ్రెస్‌ను ఆదుకుంటామని జగన్ కాంగ్రెస్‌కు హామీ ఇచ్చిన విషయంపై, మా పార్టీలో కూడా చర్చ జరిగింది. నిన్న మోదీగారిపై బొత్స విమర్శలతో, జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నది నిజమయింది. ఇవన్నీ మా పార్టీ నిశితంగా గమనిస్తోంద’ని బీజేపీ రాష్ట్ర నేత ఒకరు వెల్లడించారు.

LEAVE A RESPONSE