– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
– ప్రభుత్వాసుపత్రిలో వైఎస్సార్ చిత్రపటానికి ఘన నివాళి
గుడివాడ , సెప్టెంబర్ 2 : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన మార్గంలోనే సీఎం జగన్మోహనరెడ్డి పయనిస్తూ రాష్ట్ర ప్రజలను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) అన్నారు . గురువారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని ఏరియా ప్రభుత్వాసుపత్రిలో వైఎస్సార్ వర్ధంతి వేడుకలను నిర్వహించారు . ఈ సందర్భంగా దివంగత రాజశేఖరరెడ్డి చిత్రపటానికి మంత్రి కొడాలి నాని పూలమాల వేసి నివాళులర్పించారు . అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ దివంగత వైఎస్సార్ ప్రజలకు ఎంతో మేలు చేశారన్నారు . అందువల్లే నేటికీ ఆయన ప్రజల మనస్సుల్లో ఒక డాక్టర్ గా , దైవంగా గూడు కట్టుకున్నారని , మరణించి 12 ఏళ్ళు గడిచినా ఇంకా ప్రజల గుండెల్లోనే సజీనంగా బతికే ఉన్నారన్నారు . ఆయన కుమారుడు జగన్మోహనరెడ్డి సొంతంగా పార్టీ పెడితే ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెల్పించారని , ఆ తర్వాత ముఖ్యమంత్రిని చేశారన్నారు . 151 స్థానాలను కట్టబెట్టిన ప్రజల రుణం తీర్చుకునేందుకు వైఎస్సార్ చూపిన మార్గంలోనే జగన్మోహనరెడ్డి నడుస్తున్నారని చెప్పారు . రాష్ట్రంలోని ప్రజలందరినీ సీఎం జగన్మోహనరెడ్డి గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారని తెలిపారు . దివంగత రాజశేఖరరెడ్డి మరణం రాష్ట్ర ప్రజల దురదృష్టమని అన్నారు . వైఎస్సార్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు . 2004 లో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గుడివాడలో బైపాస్ రోడ్లను పూర్తిచేశారన్నారు . తాను ఎమ్మెల్యేగా గెల్చిన తర్వాత 2004 లో ఇళ్ళపట్టాల సమస్యను వైఎస్సార్ దృష్టికి పాదయాత్ర ద్వారా తీసుకువెళ్ళానన్నారు . 77 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇచ్చారన్నారు . ఆ తర్వాత మూడు నెలలకు వైఎస్సార్ మరణించారని చెప్పారు . కాంగ్రెస్ , టీడీపీ ప్రభుత్వాలు వచ్చాయని , లబ్ధిదారుల దగ్గర డబ్బులు కట్టించుకుని ఒక్క ఇంటిని కూడా నిర్మించి ఇవ్వలేదన్నారు . కనీసం మౌలిక సదుపాయాలను కూడా కల్పించలేదన్నారు . వైఎస్సార్ ఇచ్చిన 77 ఎకరాల్లో 8,912 టిడ్కో ఇళ్ళను నిర్మిస్తున్నామని చెప్పారు . రూ . లక్ష కట్టిన లబ్ధిదారులకు రూ . 50 వేలు , రూ . 50 వేలు చెల్లించిన లబ్ధిదారులకు రూ . 25 వేలు తిరిగి ఇచ్చామన్నారు . 300 చదరపు అడుగుల విస్తీర్ణం కల్గిన ఫ్లాట్లను రూ . 1 కే కేటాయిస్తున్నామన్నారు . గత ప్రభుత్వం లబ్ధిదారుల పేరున బ్యాంక్ ల నుండి రుణాలను తీసుకుందని , కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించలేదన్నారు . గత ప్రభుత్వం చేసిన అప్పులను సీఎం జగన్ ప్రభుత్వం చెల్లించడం జరుగుతోందన్నారు . అలాగే మరో 180 ఎకరాల భూమిని రూ . 92 కోట్లతో కొనుగోలు చేయడం జరిగిందన్నారు . 5 వేల మంది పేదలకు ఇళ్ళపట్టాలను ఇచ్చామని , మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు . ఎన్టీఆర్ పేరు , ఆయన చేసిన కార్యక్రమాలను చెప్పుకునే వారికి భంగపాటు తప్పదన్నారు . గుడివాడ నియోజకవర్గానికి అత్యధిక నిధులు ఇచ్చి అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రులుగా దివంగత వైఎస్సార్ , జగన్మోహనరెడ్డిలు నిలిచి పోతారని మంత్రి కొడాలి నాని చెప్పారు , ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ జ్యోతిర్మయి , అదమా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూర్యదేవ బాలాజీ ప్రసాద్ , వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు , ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి , సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ఇందిరాదేవి , మాజీ కౌన్సిలర్ మాదాసు వెంకటలక్ష్మి , ఆసుపత్రి అభివృద్ధి సంఘం సభ్యులు , పలువురు వైద్యులు , పార్టీ నాయకులు పాల్గొన్నారు .