Home » రూ. 10. 70 కోట్ల నిధులతో ఏరియా ప్రభుత్వాసుపత్రిలో నూతన భవన నిర్మాణం

రూ. 10. 70 కోట్ల నిధులతో ఏరియా ప్రభుత్వాసుపత్రిలో నూతన భవన నిర్మాణం

– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ , సెప్టెంబర్ 2 : రూ . 10.70 కోట్ల నిధులతో గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) చెప్పారు . గురువారం ప్రభుత్వాసుపత్రిలో జరుగుతున్న నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు . ముందుగా మంత్రి కొడాలి నానికి ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి , సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిరాదేవిలు పుష్పగుచ్ఛాలను అందజేశారు . ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా 1983 లో గుడివాడలో 100 పడకల ఆసుపత్రిని నిర్మించారన్నారు . ఈ మూడు అంతస్థుల భవనం శిథిలమై , స్లాబ్ పెచ్చులు ఊడి వైద్యులు , రోగులపై పడుతున్నాయన్నారు . ఈ భవనాన్ని తొలగించి కొత్త భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు . ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి స్వయంగా రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల స్థితిగతులపై దృష్టి పెట్టారన్నారు . దీనిలో భాగంగా నాడు , నేడు కార్యక్రమంలో నూతన భవన నిర్మాణానికి రూ . 10.70 కోట్ల నిధులను మంజూరు చేశారని చెప్పారు . దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసిందని , ఆ తర్వాతే తనకు గాని , ఇక్కడి వైద్యులకు గాని తెలిసిందన్నారు . గుడివాడ నియోజకవర్గంలో 27 వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేశారన్నారు . ఈ హెల్త్ క్లినిక్ లో ఏఎన్ఎంలకు ప్రత్యేకంగా క్వార్టర్స్ ను కూడా నిర్మించారన్నారు . గ్రామాల్లో 24 గంటల పాటు ఏఎన్ఎంలు అందుబాటులో ఉండి వైద్యమ్ అందించే ఏర్పాట్లు చేశారన్నారు . గుడివాడ నియోజకవర్గంలో ఎన్టీఆర్ పుట్టారని , ఎమ్మెల్యేగా పనిచేశారని , ముఖ్యమంత్రి అయ్యారని , అనేక రకాలుగా అభివృద్ధి చేశారని చెప్పుకుంటూ వస్తున్నారన్నారు . 100 పడకల ఏరియా ఆసుపత్రిని ఎన్టీఆర్ హయాంలో నిర్మించారని చెప్పారు . గుడివాడలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ ను బ్రిటీష్ హాయంలోనే నిర్మించారన్నారు . మరో 106 ఎకరాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను 2006 లో నిర్మించారని , దీన్ని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారన్నారు . గుడివాడలో బైపాస్ రోడ్డును ఎన్టీఆర్ శాంక్షన్ చేశారని , రెండేళ్ళు మాత్రమే పనిచేయడం వల్ల రోడ్లు , కల్వర్ట్ లను నిర్మించలేదన్నారు . 60 ఏళ్ళ కిందట నిర్మించిన బస్టాండ్ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు . కొద్దిపాటి వర్షం కురిసినా నడుము లోతు నీరు చేరుతుందన్నారు . చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్ళ పాటు చెరువులోనే ఆర్టీసీ బస్టాండ్ ను నిడిపారన్నారు . జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ .23 కోట్లు కేటాయించారని చెప్పారు . శంఖుస్థాపన చేశామని , త్వరలో అధునాతన హంగులతో ఆర్టీసీ బస్టాండ్ అందుబాటులోకి రానుందని మంత్రి కొడాలి నాని తెలిపారు . ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ జ్యోతిర్మయి , అదమా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూర్యదేవ బాలాజీ ప్రసాద్ , వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ , జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు , మాజీ కౌన్సిలర్ మాదాసు వెంకటలక్ష్మి , ఆసుపత్రి అభివృద్ధి సంఘం సభ్యులు , పలువురు వైద్యులు , పార్టీ నాయకులు పాల్గొన్నారు .

Leave a Reply