Home » భవిష్యత్ తరాల కోసం మెడికల్ కళాశాలను తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నా

భవిష్యత్ తరాల కోసం మెడికల్ కళాశాలను తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నా

– గుడివాడలో జిల్లా ప్రభుత్వాసుపత్రిని ఏర్పాటు చేస్తున్నాం
– ఏరియా ఆసుపత్రిని ప్రాథమిక వైద్యశాలగా కొనసాగిస్తాం
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ , సెప్టెంబర్ 2 : భవిష్యత్ తరాలకు మెరుగైన వైద్యం అందించేందుకు గుడివాడకు మెడికల్ కళాశాలను తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నానని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) చెప్పారు . గురువారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని ఏరియా ప్రభుత్వాసుపత్రిలో అదమా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభను మంత్రి కొడాలి నాని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు . ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ 500 పడకల సామర్థ్యం కల్గిన జిల్లా ఆసుపత్రి మచిలీపట్నంలో ఉందని , దీన్ని మెడికల్ కళాశాలకు అప్పగించారన్నారు . గుడివాడలో జిల్లా ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని సీఎం జగన్మోహనరెడ్డిని కోరగా అందుకు ఆయన అంగీకరించారన్నారు . ఇందుకు అవసరమైన 10 ఎకరాల భూమిని సేకరించాలని చెప్పారన్నారు . 25 ఎకరాల భూమి ఉంటే భవిష్యత్తులో మెడికల్ కళాశాల వస్తుందనే ఆలోచనతో 30 ఎకరాల భూమిని కూడా సేకరించామన్నారు . రానున్న రోజుల్లో గుడివాడకు జిల్లా ఆసుపత్రి వస్తుందని చెప్పారు . ఏరియా ఆసుపత్రిని ప్రాథమిక వైద్యశాలగా కొనసాగిస్తామని తెలిపారు . పార్లమెంట్ కు ఇంకో మెడికల్ కళాశాల ఇచ్చే పరిస్థితి ఉంటే గుడివాడలో అందుకు అవసరమైన హంగు , ఆర్భాటాలను పూర్తి చేశామన్నారు . తద్వారా భవిష్యత్ తరాలకు మెరుగైన వైద్య సేవలను అందించే అవకాశం కలుగుతుందన్నారు . స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 74 ఏళ్ళలో రాష్ట్రంలో 11 మెడికల్ కళాశాలలను మాత్రమే నిర్మించారని చెప్పారు .
జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 16 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు అనుమతులు తెచ్చారన్నారు . ఇందు కోసం రూ . 7 వేల 500 కోట్లు ఖర్చు చేస్తున్నారని , ప్రతి పార్లమెంట్ లోనూ ఒక మెడికల్ కళాశాల ఉండేలా చూస్తున్నారన్నారు . ఇప్పటికే ఆయా మెడికల్ కళాశాలల నిర్మాణానికి టెండర్లను పిలిచి పనులను కూడా ప్రారంభించారన్నారు . అర్ధరాత్రి , అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్ళలేని వారికి వైద్యం అందించేందుకు 108 అంబులెన్స్ ను ప్రతి మండలంలోనూ అందుబాటులోకి తెచ్చారన్నారు . దాదాపు 1,200 అంబులెన్స్ లను కొనుగోలు చేసి వాటి ద్వారా వైద్యం అందించడం జరుగుతోందన్నారు . అలాగే 104 సర్వీస్ ను కూడా అన్ని గ్రామాలకు విస్తరించడం జరిగిందన్నారు . గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేదప్రజలందరికీ నెలకు సరిపడా మందులను కూడా ఉచితంగా అందిస్తున్నామన్నారు . రూ.వెయ్యి దాటిన ప్రతి వైద్య ఖర్చునూ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చారని చెప్పారు . ఈ వ్యవస్థలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని , సీఎం జగన్మోహనరెడ్డి వాటన్నింటికీ రిపేర్ చేసి పూర్తిస్థాయిలో వైద్యాన్ని అందిస్తున్నారన్నారు . పేదప్రజలకు కార్పోరేట్ వైద్యాన్ని దివంగత వైఎస్సార్ , జగన్మోహనరెడ్డిలు మాత్రమే అందిస్తున్నారని చెప్పారు . ఇటువంటి ముఖ్యమంత్రులు రావడం రాష్ట్ర ప్రజల అదృష్టమని అన్నారు . ఆసుపత్రులు , పాఠశాలల ఆధునికీకరణ కోసం ఎంత ఖర్చు చేయడానికైనా జగన్మోహనరెడ్డి వెనకాడడం లేదన్నారు . ప్రభుత్వ పథకాలను పేదల ఇంటి దగ్గరే అందించేలా సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని మంత్రి కొడాలి నాని చెప్పారు . ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ జ్యోతిర్మయి , అదమా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూర్యదేవ బాలాజీ ప్రసాద్ , వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ , జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు , ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి , సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ఇందిరాదేవి , మాజీ కౌన్సిలర్ మాదాసు వెంకటలక్ష్మి , ఆసుపత్రి అభివృద్ధి సంఘం సభ్యులు , పలువురు వైద్యులు , పార్టీ నాయకులు పాల్గొన్నారు .

Leave a Reply