గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో అదమా ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కొడాలి నాని

– పూర్ణకుంభ స్వాగతం , శిలాఫలకం ఆవిష్కరణ
గుడివాడ , సెప్టెంబర్ 2 : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని శ్రీమతి అన్నే పుష్ప లీలావతి , శ్రీ అన్నే నరసింహారావు ఏరియా ప్రభుత్వాసుపత్రిలో అదమా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అందజేసిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ను రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) గురువారం ప్రారంభించారు . ముందుగా మంత్రి కొడాలి నానికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో , పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు . ఆసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి , సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిరాదేవిలు మంత్రి కొడాలి నానికి పుష్పగుచ్ఛాలను అందజేసి దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు . ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు . ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ప్రస్తుతం ఆక్సిజన్ అవసరం చాలా తగ్గిందన్నారు . మూడు నెలల కిందట దేశంలో , రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరా లేక అనేక మంది ప్రాణాలను పోగొట్టుకున్న పరిస్థితులను అందరం చూశామన్నారు . ప్రభుత్వాలతో పాటు స్వచ్చంధ సంస్థలు , ఆర్ధికంగా బాగున్న కొన్ని వ్యవస్థలు ముందుకు వచ్చి ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయన్నారు . అదమా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ క్యూటివ్ డైరెక్టర్ బాలాజీ ప్రసాద్ ఈ ప్రాంతం వారు కావడంతో ఇక్కడి ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశ్యంతో గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చారన్నారు . గుడివాడ ప్రజల తరపున అదమా సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు . రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకో ప్లాంట్ ను ఏర్పాటు చేయనుందని తెలిపారు . అదమా , మెగా ఇంజనీర్స్ వంటి సంస్థలు ప్రజలకు మేలు చేసే ఉద్దేశ్యంతో ముందుకు వస్తే ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు . ప్రజలకు మరింత మేలు చేకూర్చే వ్యవస్థను సీఎం జగన్మోహనరెడ్డి తీసుకువచ్చారని తెలిపారు
. గుడివాడలో అదమా కంపెనీ ఇచ్చిన ప్లాంట్ ను ప్రారంభించామని , నిర్వహణను ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు . దాతల ఉద్ధేశ్యాన్ని ప్రభుత్వం నూరుశాతం నెరవేర్చుతుందని చెప్పారు . అన్నింటిలో వేలు పెట్టడం , అన్నీ తనకే తెలుసని సలహాలు ఇవ్వడం వంటివి ఇష్టం ఉండదన్నారు . ఎంతో కష్టపడి , ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని వైద్యులు ఈ స్థాయికి వచ్చారన్నారు . దేవుడు , ప్రజల దయ వల్ల తాను ఎమ్మెల్యే , మంత్రిని అయ్యానన్నారు . అన్నీ తెలుసని అంటూ ఆసుపత్రిలో వైద్యం ఎలా చేయాలి , బెడ్లు ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే విషయాలను వైద్యులు చెప్పే అలవాటు లేదన్నారు . ఆసుపత్రి జిల్లా ఇన్ ఛార్జిగా , గుడివాడ ప్రభుత్వాసుపత్రి ఇన్ ఛార్జిగా , లేడీ డాక్టర్లు , నర్స్ లు , క్లీనింగ్ చేసే కార్మికులు అందరూ మహిళలే ఉన్నారని , 24 గంటలూ అందుబాటులో ఉండి రోగుల ప్రాణాలను కాపాడుతున్నారన్నారు . ఇంత మంది మహిళలు పనిచేస్తున్నారని , ఎవరు పట్టించుకున్నా , పట్టించుకోకపోయినా ఈ ఆసుపత్రి దిగ్విజయంగా నడుస్తుందనే భావన తనకు ఉందన్నారు . అందువల్లే ప్రతి విషయంలోనూ తాను జోక్యం చేసుకోనని చెప్పారు . అనారోగ్యంతో వచ్చే వారికి సరైన వైద్యం అందించి పూర్తి ఆరోగ్యంతో వారిని ఇంటికి పంపించేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని మంత్రి కొడాలి నాని సూచించారు . ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ జ్యోతిర్మయి , అదమా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూర్యదేవ బాలాజీ ప్రసాద్ , వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ , జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు , ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి , సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ఇందిరాదేవి , మాజీ కౌన్సిలర్ మాదాసు వెంకటలక్ష్మి , ఆసుపత్రి అభివృద్ధి సంఘం సభ్యులు , పలువురు వైద్యులు , పార్టీ నాయకులు పాల్గొన్నారు .

Leave a Reply