Suryaa.co.in

Telangana

పంట నష్టం…సర్కార్ శూన్య హస్తం…

రైతు బంధు లేదు…గిట్టుబాటు ధర రాదు
కౌలు రైతును ఆదుకునే నాథుడు లేడు
మా పిల్లలకు ఉద్యోగాలు రావు
పాదయాత్రలో బండి సంజయ్ కు వెతలు వినిపిస్తున్న అన్నదాతలు
భయపడొద్దు….అండగా ఉంటూ పోరాడేందుకే యాత్ర చేస్తున్నానని చెప్పిన బండి సంజయ్
6వ రోజు పాదయాత్రలో భాగంగా దామరగిద్దె లో పొలాలను సందర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ టమాట పంట పండిస్తున్న రైతులు రమేశ్ రెడ్డి, బూదెమ్మ, నర్సమ్మ, యాదయ్య లను కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన సంభాషణ వివరాలు..
బండి సంజయ్ : అమ్మా….బూదెమ్మ…ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నరు? టమాట పంట వేసిండ్రు కదా..ఎంత పెట్టుబడి అయ్యింది.
బూదెమ్మ : 4 ఎకరాలు సాగుచేస్తన్నం సారూ…టమాట వేసినం. ఇప్పటిదాకా రూ. 2 లక్షల పెట్టుబడి అయ్యింది. కానీ అకాల వర్షాలతో టమోటా పంట అంత మురిగిపోయింది. ఉన్న కొద్ది టమాటాలకు గిట్టుబాటు ధర లేదు. ఈ ఏడు అంతా లాసే సారూ..ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. పోయినేడు కూడా ఇట్లనే అయ్యింది.
బండి సంజయ్ : మరి అప్పుడు ప్రభుత్వం పంట నష్టపరిహారం ఇవ్వలేదా? ఇప్పుడైనా పంట నష్టపరిహారానికి దరఖాస్తు చేసుకున్నరా?
బూదెమ్మ : లేదు సార్..నయాపైసా పరిహారం రాలేదు. ప్రభుత్వపోళ్ల కాడికి, మా ఊరు లీడర్ల కాడికి పోయి అడిగినా ఎవ్వరు కూడా సాయం చేయలేదు.
బండి సంజయ్ : నీకు ఫించన్ పైసలు, రేషన్ అందుతున్నయా?
బూదెమ్మ : సారూ రేషన్ బియ్యం అందుతున్నయ్. కానీ ఫించన్ ఇస్తలేరు. దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు రాలేదు.
బండి సంజయ్ : మీరేం భయపడకండి. బీజేపీ మీకు అండగా ఉంటది. 2023లో బీజేపీ అధికారంలోకి వచ్చినక మీ కుటుంబాన్ని ఆదుకుంటం.
బండి సంజయ్ : ఏం నర్సమ్మ మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది?
నర్సమ్మ : రెండెకరాలు కౌలుకు తీసుకుని బెండ తోట సాగుచేస్తున్నసారూ..
బండి సంజయ్ : ఎంత పెట్టుబడి పెట్టినవ్. గిట్టుబాటైతుందా?
నర్సమ్మ : సొంత పొలముంటే ఎంతో కొంత గిట్టుబాటయ్యేది. కౌలు చేస్తే కష్టాలే మిగుల్తున్నయ్ సారూ..మాకు రైతు బంధు కూడా ఇస్తలేరాయే…
నర్సమ్మ : సార్ రుణ మాఫీ ,ఫించన్ కూడా వస్తా లేదని ఆవేదన వ్యక్తం చేసిన నర్సమ్మ.
బండి సంజయ్ : నువ్వేం బాధపడకు. కేసీఆర్ ఉన్నన్నాళ్లు మీ కష్టాలు తీరవు. మీ తరపున పోరాడతం. బీజేపీ అధికారంలోకి వచ్చినంక రైతులను ఆదుకుంటం.


దామరగిద్దలో యాదయ్య అనే రైతు, ఆయన కుమారుడు రాజశేఖర్ తో బండి సంజయ్ సంభాషణ
బండి సంజయ్ : నీ పేరేంది పెద్దమనిషి? ఎన్ని ఎకరాల పొలముంది?
యాదయ్య : మాకు 2 ఎకరాల పొలముంది. వానలొస్తేనే పంటలు వేసుకుంటం. కాల్వలు లేవు సారూ…
బండి సంజయ్ : గిట్టుబాటు ధర వస్తుందా? ప్రభుత్వ సాయం చేస్తుందా?
యాదయ్య : గిట్టుబాటు ధర ఎక్కడిది సారూ….అంతా లాసే. నా కొడుకు రాజశేఖర్ పెద్ద చదువు చదివిండు.కానీ ఉద్యోగాల్లేకపాయే. జర సూడు సారూ…
బండి సంజయ్ : ఏం రాజశేఖర్….ఏం చదువుకున్నవ్? జాబ్ చేయడం లేదా?
రాజశేఖర్ : నేను ఏవీ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏడేళ్ల నుండి ప్రిపేర్ అవుతున్న. అదిగో…ఇదిగో అంటున్నరే తప్ప అప్పటి నుండి ఒక్క నోటీస్ కూడా రాలే. ఉద్యోగం లేక చాలా ఇబ్బందిగా ఉంది. సర్. దయచేసి నోటిఫికేషన్లు వచ్చేలా చేయండి సార్…
బండి సంజయ్ : రాజశేఖర్ కేసీఆర్ చెప్పేవన్నీ దొంగ మాటలు. మోసపు హామీలే. మీరింకా నమ్మకండి. మీరేం భయపడకండి. బీజేపీ మీకు అండగా ఉంటుంది. మీ బాధలు, సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నం. ప్రభుత్వంపై ఉద్యమం చేస్తున్నం. మీరంతా కలిసి రండి. బీజేపీ అధికారంలోకొస్తే ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటం.

LEAVE A RESPONSE