Suryaa.co.in

Political News

జగనన్న దళిత ద్రోహం

75 ఏళ్ల స్వతంత్ర భారతంలో మనం ఎక్కడున్నాం? మన ఉనికి ఏమిటి? రాజ్యాంగం చెప్పిన సమానత్వంలో మన ఆచరణ ఎలా ఉందని ప్రశ్నించుకుంటే.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని చెప్పొచ్చు. దేశంలో కుల, మత, సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగిపోలేదు. భారత రాజ్యాంగంలోని ” ఆర్టికల్ 46 .. రాష్ట్రం ప్రత్యేక శ్రద్ధతో బలహీనవర్గాల, మరీ ముఖ్యంగా, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల ప్రజల విద్య మరియు ఆర్థిక ప్రయోజనాలను ప్రోత్సహించాలని, సామాజిక అన్యాయం మరియు అన్ని రకాల దోపిడీ నుండి వారిని రక్షించాలని ” నిర్దేశించింది.

ఎన్నేళ్లయినా విద్య, ఉపాధి, మిగతా ఏ రంగంలో కూడా, ప్రత్యేకించి దళితులకు, వారికి దక్కాల్సిన గౌరవం దక్కక పోగా, అందరికన్నా మరింత అణచివేతకు, శ్రమదోపిడీకి గురవుతున్నారు. సమాజంలో అందరూ సమానమేనని రాజ్యాంగంలో రాసుకున్నది కాగితాలకే పరిమిత మవుతున్నది. శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతోన్న దళితుల సమగ్ర అభివృద్ధి కోసం, దళితుల్లో ఆర్థిక సాధికారత, స్వావలంబన సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ ట్రైబ్స్ వారికి జనాభా దామాషా ప్రకారం చట్టబద్ధంగా ఉప ప్రణాళికలు అమలు చేస్తున్నాయి.

కానీ రాష్ట్రంలో మొసలి కన్నీళ్లతో, బూటకపు వాగ్దానాలతో దళిత ఓట్లు కొల్లగొట్టి అధికారం సాధించిన నాటి నుండి, దళితుల అభ్యున్నతి కోసం చంద్రన్న ప్రవేశపెట్టిన అనేక పధకాలను రద్దు చేసి దళిత బిడ్డలను దారుణంగా మోసగించారు జగన్ రెడ్డి.

ఎస్సీ సబ్ ప్లాన్ మరియు ట్రైబల్ సబ్ ప్లాన్ :
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ సబ్ ప్లాన్ మరియు ట్రైబల్ సబ్ ప్లాన్ చట్టం, 2013 అనుసరించి రాష్ట్రం లోని ఎస్సీ, ఎస్ టి జనాభా నిష్పత్తి ప్రకారం ప్రతి ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులు చేసి, ఖర్చు చేయాలి, ఈ పథకం ముఖ్య లక్ష్యం వివిధ ఆదాయ ఉత్పత్తి మార్గాల ద్వారా దళిత ప్రజల ఆదాయాన్ని పెంపొందించడం, ఆయా వర్గాల లోని పేదరికాన్ని తగ్గించి వారిని దారిద్ర్య రేఖ ఎగువకు తేవడం, వారి సామాజిక, ఆర్ధిక పరిపుష్టికి దోహద పడటం.

ఎస్సీ సబ్ ప్లాన్ మరియు ట్రైబల్ సబ్ ప్లాన్ లను బలోపేతం చేసి దళితుల సామాజిక, ఆర్ధిక అభ్యున్నతిని మరింత వేగవంతం చేయడానికి రాష్ట్ర నిధులకు తోడుగా కేంద్ర ప్రభుత్వం ‘స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్’ ( SCA ) ద్వారా గ్రాంట్ ఇస్తుంది. ఆదాయ ఉత్పత్తి పథకాలకు, నైపుణ్య అభివృద్ధి పథకాలకు, మౌళిక సదుపాయాలు పెంపొందించడానికి కేంద్ర ప్రత్యేక నిధులను వెచ్చించి తద్వారా లక్ష్య జనాభా ( target population ) యొక్క పేదరికాన్ని తగ్గించడం ఈ పధకం ముఖ్య ఉద్దేశ్యం.

ఎస్సీ, ఎస్టీ వ్యక్తులకు, కుటుంబాలకు లేదా నివాస ప్రాంతాలకు చేసిన మొత్తం ఖర్చు .. సాధారణ పధకాల విషయంలో ప్రయోజనం పొందిన దళిత లబ్ధిదారులకు చేకూర్చిన మొత్తం మాత్రమే సబ్ ప్లాన్ క్రింద లెక్కిస్తారు. జగన్ రెడ్డి పాలనలో దళితుల అభ్యున్నతికి దోహదం చేసే పథకాలన్నిటికి స్వస్తి చెప్పి, కేవలం నవరత్నాలకే పరిమితం చేసి దళిత సమాజాన్ని వంచించారు. ఎన్ ఎస్ ఎఫ్ డి సి , ఎన్ ఎస్ కె డి సి ద్వారా కేంద్రం నుండి ఎస్సీ , ఎస్టీ కార్పొరేషన్ లకు వచ్చే నిధులను కూడా నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.

టిడిపి x వై సి పి
2014 – 2019 వరకు చంద్రన్న ఐదేళ్ల పాలనలో ఎస్సీ ఉప ప్రణాళికకు రూ. 40, 253 కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళికకు రూ. 14,210 కోట్లు ఖర్చు చేశారు. ఎస్సీ వర్గాల అభ్యున్నతి కోసం 2018 – 19 బడ్జెట్ లో రూ.14,367 కోట్లు కేటాయించి రూ11, 228 కోట్లు ( 90 శాతం ) తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు చేస్తే, దళిత ఉద్ధారకుణ్ణి అని డంబాలు పలికే జగన్మోహన రెడ్డి 2019 నుండి 2021 వరకు రెండేళ్లలో ఖర్చు చేసింది కేవలం రూ. 11,903 కోట్లు మాత్రమే.

బడ్జెట్ కేటాయింపులే తప్ప ఖర్చు చేయని వై కా పా ప్రభుత్వం 2021 – 22 ఆర్ధిక సంవత్సరంలో రూ. 13, 835 కోట్లు సబ్ ప్లాన్ క్రింద కేటాయించి ఎంత ఖర్చు చేశారనేది చిదంబర రహస్యం. దళిత వర్గాల పురోభివృద్ధికి తోడ్పడే ఉత్పాదక పథకాలకు కాకుండా సబ్ ప్లాన్ నిధులను నవరత్నాల కోసం ఖర్చు చేసి దళిత వర్గాలను వంచించింది వై కా పా ప్రభుత్వం.

దళితులకు అండగా చంద్రన్న :
తెలుగుదేశం హయాంలో దళిత వర్గాల అభ్యున్నతికి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా సహాయపడటమే కాకుండా .. ఎన్ ఎస్ ఎఫ్ డి సి , ఎన్ ఎస్ కె డి సి రుణ పథకాల ద్వారా అణగారిన వర్గాల స్వయం ఉపాధికి దోహద పడ్డారు. డప్పు కళాకారులకు, చర్మ కారులకు పెన్షన్ వయసు 65 ఏళ్ల నుండి 50 కి తగ్గించారు చంద్రబాబు. 34,137 మంది డప్పు కళాకారులకు నెలకు రూ. 2000 పెన్షన్ , 29,653 మంది చర్మకారులకు రు. 10 వేల విలువైన పనిముట్లు మరియు పెట్టుబడి సాయం క్రింద రూ. 20 వేలు అందించింది టిడిపి ప్రభుత్వం.

రూ. 3,795 కోట్లతో షుమారు 2 లక్షల 66 వేల మంది దళిత వర్గాల వారికి చంద్రబాబు గారి నేతృత్వంలో అనేక పథకాల ద్వారా సబ్సిడీ ఋణాలు ఇచ్చి జీవనోపాధి కల్పించారు. ఎస్సీ కాలనీలలో రూ. 337 కోట్లతో ఆర్.ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగింది. జగ్జీవన్ జ్యోతి పథకం క్రింద 25 లక్షల ఎస్సీ కుటుంబాలకు 100 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించారు. గృహ నిర్మాణం కోసం అదనంగా రూ. 25 వేల ఆర్థిక సాయం అందించడం జరిగింది. భూమిలేని ఎస్సీ లకు రూ. 135 కోట్లతో మూడు వేల ఎకరాలు, 1606 ఎస్సీ మహిళలకు 2,386 ఎకరాలు పంపిణీ చేసింది టిడిపి ప్రభుత్వం.

దళిత ఆడపడుచుల వివాహానికి రూ. 50 వేలు చంద్రన్న పెళ్లి కానుక, కులాంతర వివాహం చేసుకున్న వారికి రూ. 75 వేలు ఆర్థిక సాయం అందించారు. స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్న 17 లక్షల ఎస్సీ మహిళలు ఒక్కొక్కరికి రూ. 20 వేలు పసుపు – కుంకుమ అందించిన ఘనత చంద్రబాబుదే. స్వయం ఉపాధి కోసం ఎస్సీ రైతులకు ట్రాక్టర్లు, యుమంది వతకు జేసిబిలు, ప్రొక్లైన్లు, ట్రక్కులు, ఇన్నోవా కార్లు, ప్యాసింజర్ వాహనాలు తదితరాలను రాయితీ మీద ఇచ్చారు. ఎస్సీ కాలనీలలో రూ. 1388 కోట్లతో 5,384 కి.మీ అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు.

రూ. 200 కోట్లతో షుమారు 10 లక్షల 77 వేల మంది విద్యార్థులకు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్లు, షుమారు రూ. 2851 ఖర్చుతో 15 లక్షల 13 వేల మంది విద్యార్థులకు పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్లు అందచేసింది చంద్రన్న ప్రభుత్వం. ప్రతి మండలంలోని రెండు పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్ది వాటిలో దళిత బిడ్డలు చదువుకునే అవకాశం కలిపించారు.రూ. 522 కోట్లతో 188 ఎస్సీ గురుకులాలను అభివృద్ధి చేశారు. అంబేద్కర్ వోవర్సీస్ విద్యానిధి, ఎన్టీఆర్ విద్యోన్నతి పధకాలు దళిత బిడ్డల విదేశీ విద్యకు, ఉన్నత చదువులకు తోడ్పడ్డాయి.

జాతీయ షెడ్యూల్ తెగల ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ( NSTFDC ) ద్వారా రుణాల పంపిణీ పునః ప్రారంభం చేశారు. గిరిజన భూపంపిణీ పధకం క్రింద ఎకరా ధరను రూ.5 లక్షల నుండి రూ 15 లక్షలకు పెంచారు, రూ. 525 కోట్లతో గిరిజన ప్రాంతాలలో రెండు లక్షల ఎకరాలలో కాఫీ తోటలను అభివృద్ధి చేసి వేలాది మంది గిరిజనుల ఆర్ధిక అభ్యున్నతికి అవకాశం కలిపించింది టీడీపీ ప్రభుత్వం.

నవరత్నాల దళిత వంచన :
తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా ఆయా వర్గాల అభివృద్ధి కోసం అమలు చేసిన అన్ని పధకాలను రద్దు చేసి కేవలం నవరత్నాలను మాత్రమే ఇస్తున్నారు జగన్ రెడ్డి. నవరత్నాల ద్వారా ప్రజలకు మేలు చేస్తానని నమ్మబలికితే .. ఉన్న పథకాలకు తోడు అదనంగా నవరత్నాలు ఇస్తారని ఆశించిన ప్రజలు నమ్మకద్రోహానికి గురయ్యారు. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించింది వై కా పా ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల బ్యాంక్ లింక్ లోన్లు, భూమి కొనుగోలు పధకం, అంబేద్కర్ విదేశీ విద్య, గృహ నిర్మాణంలో అదనంగా ఇచ్చే రూ. 25 వేలు, పెళ్లి కానుక, కులాంతర వివాహాల ప్రోత్సాహకాలను రద్దు చేశారు.

పి జి విద్యార్థులకు ఫీజ్ రీఇంబర్స్మెంట్ ఎత్తి వేయడం దళిత ఉద్ధారణ అంటారా? ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన పధకంలో ఎస్సీ, ఎస్టీ మెజారిటీ గ్రామాల అభివృద్హి కోసం కేంద్రం కేటాయించిన నిధులను దారి మళ్లించారు. సెంటు పట్టా ఇళ్ల స్థలాలు ఇచ్చే క్రమంలో దళితులు, బిసి లకు చెందిన 11 వేల ఎకరాల అసైన్డ్ భూములు స్వాధీనం చేసుకోవడం ద్రోహం కాదా? కేవలం కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే అణగారిన వర్గాలకు న్యాయం జరిగినట్లు కాదు?ఎన్నికల సమయంలో మేనమామ నని సభలలో ఊదర కొడితే నమ్మిన దళిత బిడ్డల పాలిట కంస మామగా దాపురించారు జగన్ రెడ్డి.

దళిత జాతి , దళిత యువత పురోభివృద్ధికి దోహద పడే పధకాలను రద్దు చేసి కేవలం కొన్ని పధకాల ద్వారా మాత్రమే డబ్బు పంపిణీ చేయడం ద్వారా దళిత జాతి నిరంతరం చేయి చాచే జాతిగా మాత్రమే ఉండాలనే ఫ్యూడల్ భావజాలం వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా దళిత సమాజం మేల్కొని తమ హక్కుల కోసం పోరాడకపోతే చట్ట పరంగా సంక్రమించవలసిన పథకాలకు కూడా మంగళం పాడడానికి ప్రస్తుత ప్రభుత్వం వెనుకాడదు.

– లింగమనేని శివరామ ప్రసాద్
7981320543

LEAVE A RESPONSE