– పవన్ సినిమాలపై జగనన్న ఫ్యాన్స్ పంజా
– సినిమాలు ఆడనీయమని వార్నింగ్
– ‘రిపబ్లిక్’ సినిమాపై జగనన్న ఫ్యాన్స్ నిషేధం
– నూజివీడులో జగన్ అభిమానుల హల్‌చల్
( మార్తి సుబ్రహ్మణ్యం- విజయవాడ)
తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకు ‘రాజకీయ పార్టీల గ్రహణం’ పట్టే ప్రమాదం కనిపిస్తోంది. సినీ నటులు రాజకీయాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే హీరోలకు సంబంధించిన సినిమాలపై.. అధికార పార్టీ నుంచి నిషేధాలు ఎదురవుతున్న విచిత్ర పరిస్థితి తొలిసారిగా ఇప్పుడే కనిపిస్తోంది. వైసీపీ చీఫ్- ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై, తిరుగుబాటు బావుటా ఎగురవేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను, రాజకీయంగా ఎదుర్కొంటున్న వైసీపీ.. ఇప్పుడు నేరుగా ఆయన నటించిన సినిమాలను అడ్డుకుంటామని రంగంలోకి దిగిన వైనం సంచలనం సృష్టిస్తోంది.
భవిష్యత్తులో పవన్ నటించిన సినిమాలు ఆడకుండా చూస్తామంటూ, కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన జగన్ అభిమానులు శనివారం చేసిన హడావిడి చర్చనీయాంశంగా మారింది. ‘‘ జగనన్న నన్నేమీ పీకలేరని పీకే అంటున్నాడు కదా. జగనన్న దాకా ఎందుకు? జగనన్న ఫ్యాన్స్ ఏం పీకుతారో చేసి చూపిస్తాం. జగన్‌పై యుద్ధం ప్రకటిస్తున్నానని అన్నారు కదా? ఆయన కాదు. మేమే పవన్‌పై యుద్ధం ప్రకటిస్తున్నాం. పవన్ వెళ్లిన ‘రిపబ్లిక్’ సినిమా ఎలా ఆడుతుందో మేమూ చూస్తాం. ఆ సినిమాను చూడవద్దని మేం ఇప్పటికే రెండు తెలుగు రాష్టాల్లోని జగన్ అభిమానులను కోరాం. ఆ సినిమా ఎలా విడుదల అవుతుందో చూస్తాం. రేపు పవన్ నటించే ఏ సినిమానూ తెలుగు రాష్ట్రాల్లో ఆడనిచ్చేది లేదు. అప్పుడే జగనన్న ఫ్యాన్స్ సత్తా ఏమిటో, జగనన్న ఏం పీకుతారో పవన్‌కు తెలుస్తుంది’ అని జగన్మోహన్‌రెడ్డి ఫ్యాన్స్.. నూజివీడులో ఏర్పాటుచేసిన ప్రత్యేక ప్రదర్శనలో సవాల్ విసిరారు.
నూజివీడులో జగన్ ఫ్యాన్స్ విడుదల చేసిన ఈ వీడియో, సోషల్‌మీడియోలో విపరీతంగా వైరల్ అవుతోంది. వైసీపీ సోషల్‌మీడియా కూడా దీనిని బాగా వైరల్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. పవన్ సినిమాలు ఆడనీయమంటూ జగన్ అభిమానులు చేసిన హెచ్చరిక, అటు జనసేన అభిమానులనూ రెచ్చగొట్టేలా
మారింది. నిజంగా జగన్ ఫ్యాన్స్ ఆ సాహసం చేస్తే, తమ సత్తా ఏమిటో కూడా రుచిచూపించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. సినిమాలకు-రాజకీయాలకూ ముడిపెట్టడం చేతకానివారు చేసే పని అని, దమ్ముంటే పవన్‌ను రాజకీయంగా ఎదుర్కోవాలని పవన్ ఫ్యాన్స్, వైసీపీ చర్యలపై ఫైరవుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఈ విచిత్ర పరిస్థితి సినీ పరిశ్రమను హడలెత్తిస్తోంది. గతంలో ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా కృష్ణ రాజకీయ నేపథ్యంలో అనేక సినిమాలు తీసినా, అప్పట్లో ఇలాంటి ఉన్మాద పరిస్థితి తలెత్తలేదని సినీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సైతం, ఆయనకు వ్యతిరేకంగా సినిమాలు వచ్చినా, ఎన్టీఆర్ అభిమానులు ఈ స్థాయిలో హెచ్చరికలు జారీ చేసిన సందర్భాలు లేవని గుర్తుచేస్తున్నారు. చివరకు థియేటర్లు కూడా ఇవ్వని భయానక పరిస్థితి ఉండేది కాదంటున్నారు. ఇప్పుడు ఏపీలో ఏర్పడిన ఇలాంటి దురదృష్టకర పరిస్థితి పరిశ్రమ మనుగడకు ప్రమాదకరమేనంటున్నారు.