-హత్య చేశాడని సీబీఐ నిర్ధారించిన అవినాశ్ రెడ్డిని జగన్ రెడ్డి వెనకేసుకొస్తున్నాడు
-పొరపాటున కడపలో అవినాశ్ రెడ్డిని గెలిపిస్తే ప్రతి ఇంటికీ గొడ్డలి తీసుకొస్తారు
-నేరాలు ఘోరాలు చేయడంలో జగన్ రెడ్డి పీహెచ్డీ చేశాడు… అభివృద్ధిలో ఓనమాలు కూడా రావు
-మూడేళ్లలో పూర్తి చేస్తానన్న కడప స్టీల్ ప్లాంట్ ఏమైందో సమాధానం చెప్పాలి
-మద్యం ఆదాయం కోసం 30 వేల మంది మహిళల మాంగళ్యాలు తెంచాడు
-రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకు రావడమే లక్ష్యంగా మేనిఫెస్టో
-సీమలో రాజకీయంగా బలిజల గొంతు నొక్కి సామాజిక న్యాయం అంటున్నాడు
-ఎమ్మెల్యే, మేయర్ మారీచుల్లా మారి కడపను ఊడ్చేస్తున్నారు
-కడపలో జగన్ రెడ్డి రౌడీయిజాన్ని అణచివేసే ఆదిపరాశక్తి మీ రెడ్డమ్మను గెలిపించుకోవాలి
-కడప ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడు
కడప రాజకీయం మారుతోంది. కడప గడప గడపలో మార్పు కనిపిస్తోంది. కడప అసెంబ్లీ అభ్యర్ధిగా మాధవి రెడ్డి, పార్లమెంటు అభ్యర్ధిగా భూపేష్ రెడ్డిని గెలిపించుకోవాలి. కడప రెడ్డమ్మగా పిలుచుకునే మీ మాధవి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి. కడపలో జగన్ రెడ్డి రౌడీయిజాన్ని అణచివేయడానికి ఈ రెడ్డమ్మే కరెక్ట్. రాయలసీమ నడిబొడ్డునున్న కడప నుండి మాట్లాడుతున్నా. ఏ నాయకుడినైనా నమ్మి ఓటేస్తే అతను ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. అందరికీ ఆదర్శంగా నిలవాలి.
పోటీ చేసే నాయకులు ప్రజాభిమానం, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రశాంతమైన వాతావరణం కల్పించేలా ఉండాలి. కానీ, ఇక్కడ నుండి గెలిచిన సైకో జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక అహంకారి, సైకో అధికారంలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో రాష్ట్రమంతా ఈ రోజు చూస్తోంది. కన్న తండ్రి రాష్ట్రం నుండి ఇతన్ని తరిమేశాడు. కన్నతల్లికి తిండిపెట్టనోడు రాష్ట్రానికేం చేస్తాడు. కన్న చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వకుండా వేధించినోడు ప్రజలకు మేలు చేస్తాడా? సంస్కారం లేని వ్యక్తి, విధ్వంసకారుడితో రాష్ట్రం నాశనమవుతోంది.
బందిపోటులా మారి.. రాష్ట్రం మొత్తాన్ని ఊడ్చేస్తున్నాడు. గతంలో ఇసుక ఉచితంగా అందిస్తే.. నేడు ఎవరికైనా ఇసుక దొరుకుతోందా? 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టాడు. ఈ రోజు నేను హామీ ఇస్తున్నా జూన్ 4 తర్వాత ఇసుక మొత్తాన్ని ఉచితంగా అందిస్తా. ఉపాధికి భరోసాగా ఉంటా.
మద్య నిషేధం చేస్తానని అధికారంలోకి రావడానికి ముందు మహిళల ఓట్లు వేయించుకున్నాడు. మద్య నిషేధం చేయకుంటే ఓటు అడగను అన్నాడు. కానీ, ఈ రోజు రూ.60 ఉండే క్వార్టర్ నేడు రూ.200కి అమ్ముతున్నాడు. కిల్లీ కొట్టు నుండి పానీ పూరీ బండి వరకు ప్రతి చోటా డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని జే బ్రాండ్స్ ప్రజల నెత్తిన రుద్దుతున్నాడు. సైకో జగన్ రెడ్డికి చెందిన కల్తీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు. తన ఖాజానా నింపుకోవడం కోసం 30 వేల మంది మహిళల మాంగళ్యాలు తెంచాడు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అర్హత ఉందా?
నేను అధికారంలో ఉండగా విద్యుత్ ఛార్జీలు పెంచకపోగా, అదనపు విద్యుత్ ఉత్పత్తి సాధించాను. కానీ జగన్ రెడ్డి తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి రూ.60 వేల కోట్లు పిండుకున్నాడు. ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచాడు. చివరికి చెత్తపై కూడా పన్నేశాడు. ఎన్నికలకు ముందు బుగ్గలు నిమిరి, నెత్తిన చెయ్యి పెట్టి.. అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు గుద్దుతున్నాడు. ప్రజల ఆదాయం పెరగలేదు. ఖర్చులు తగ్గలేదు. జీవన ప్రమాణాలు పెరగలేదు.
రెండు రోజుల క్రితం.. ఇక్కడకు వచ్చి అవినాశ్ రెడ్డి అనే అమాయకుడంట, అతన్ని తీసుకొచ్చాడు. అవినాశ్ రెడ్డి ఏమీ తెలియని పిల్లాడు అంటున్నాడు. పిల్లవాడు బడికిపోవాలి అంతేగానీ పార్లమెంటుకు పంపుతారా? నీ తమ్ముడు చిన్న పిల్లోడనేది నిజమైతే స్కూలుకు పంపిద్దాం. రావణాసురుడు, భకాసురుడు, నరకాసురుడు, సైతాన్ అనే వారి గురించి విన్నాం. చదివాం. కానీ, వారందరినీ కలిపితే ఈ జగన్ రెడ్డి.
బాబాయిని గొడ్డలి వేటుతో చంపేసి, తిరిగి బాధితుల్ని నిందితులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. బాబాయిని ఎవరు చంపారో అర్ధమైందా? మరోసారి పొరపాటున కడపలో ఓటేస్తే.. ప్రతి ఇంటికీ గొడ్డలి తీసుకొస్తారు. బాత్రూంలో రక్తం పారిస్తారు. రక్తం మరిగిన తోడేలులా తయారయ్యాడు. ఆయనో నియంత.. ప్రజలంతా బానిసలు అనేలా వ్యవహరిస్తున్నాడు.
ఐదేళ్లు పాలించిన ముఖ్యమంత్రి ఏం చేశారో చెప్పాలి. ఏం చేస్తారో చెప్పాలి. కడప నడిబొడ్డు దేవుని గడపలో నిలబడి సవాల్ చేస్తున్నా. కడప స్టీల్ ప్లాంట్ మూడేళ్లలో పూర్తి చేస్తానన్నావ్. రెండు సార్లు శంకుస్థాపనలు చేశాడు గానీ, ఎందుకు పూర్తి చేయలేదు? రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేశాడా? రాయలసీమ ద్రోహి. కడపకు దగా చేసిన దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి. ప్రజల్లో ఉండే బలహీనతే ఈ దుర్మార్గుడికి బలం అవుతుంది. అహంకారంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నాడు. 45 సంవత్సరాలుగా ప్రజా సేవలో ఉన్నాను. నవ్యాంధ్ర అభివృద్ధిని పున:ప్రారంభించే వరకు వెనక్కి తగ్గను.
పొత్తుల గురించి ప్రశ్నించే వారికి చెబుతున్నా.. రాష్ట్రంలో వ్యతిరేక ఓటు విడిపోవడానికి వీల్లేదని పవన్ కల్యాణ్ ముందుకు వచ్చారు. మరోవైపు బీజేపీ మరోసారి అధికారంలోకి రాబోతోంది. రాష్ట్రానికి మేలు జరగాలనే లక్ష్యంతో బీజేపీతో కలిసి నడుస్తున్నాం. గతంలోనూ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఏ మైనార్టీకైనా అన్యాయం జరిగిందా? రాష్ట్రం బాగుపడాలి, అభివృద్ధి పథంలో నడవాలంటే కేంద్ర సహకారం అవసరమనే బీజేపీతో పొత్తుకు వెళ్లాం. హైదరాబాద్‌లో తొలిసారి ఉర్దూ యూనివర్శిటీ పెట్టాం. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టాం. రెండో భాషగా ఉర్దూని ప్రకటించాం.
హజ్ హౌస్ కట్టించి నేరుగా మక్కాకు విమాన సర్వీసులు పెట్టాం. విభజన తర్వాత కడపలో ఉర్దూ యూనివర్శిటీ కట్టించాను. ఇక్కడి నుండే హజ్ యాత్రకు విమాన సర్వీసులకు ప్రయత్నాలు చేశాం. 90 శాతానిక పైగా పూర్తైన పనుల్ని జగన్ రెడ్డి పూర్తి చేయలేదు. నేను రాగానే దాన్ని పూర్తి చేసి తోడుగా నిలుస్తాను. హజ్ యాత్రికకులకు రూ.లక్ష ఆర్ధిక సాయం అందిస్తాం. మసీదులు కట్టాం. దుల్హన్ తో యువతులకు అండగా నిలిస్తే.. జగన్ రెడ్డి రద్దు చేశాడు. రంజాన్ తోఫా రద్దు చేశాడు. విదేశీ విద్య పథకాన్ని దూరం చేశాడు. గతంలో మైనార్టీల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తే అన్నీ రద్దు చేసిన జగన్ రెడ్డి.. ఇప్పుడు వచ్చి మాయల ఫకీరులా మాట్లాడుతున్నాడు.
2014-19 మధ్య కాలంలో మైనార్టీ రిజర్వేషన్లు కాపాడేందుకు సుప్రీంకోర్టులో పోరాడింది తెలుగుదేశమే. అధికారంలోకి వచ్చాక దాన్ని పూర్తిగా కాపాడుతానని మైనార్టీ సోదరులకు హామీ ఇస్తున్నా. సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లులకు ఢిల్లీలో మద్దతిచ్చి గల్లీలో డ్రామాలు ఆడుతున్నాడు. నేరాలు ఘోరాలు చేయడంలో జగన్ పీహెచ్డీ చేశాడు. అభివృద్ధి చేయడంలో ఓనమాలు కూడా రావు. మౌజం, ఇమాంలకు గౌరవ వేతనం కల్పిస్తా. మసీదుల నిర్వహణకు నిధులు ఇస్తానని మేనిఫెస్టోలో పేర్కొన్నాను.
పేద మైనార్టీ సోదరులకు 2 సెంట్ల స్థలం కేటాయించి ఇల్లు నిర్మించే బాధ్యత తీసుకుంటాను. జగన్ రెడ్డి రద్దు చేసిన ప్రతి పథకాన్ని పునరుద్దరిస్తాను. నూర్ బాషాలకు కార్పొరేషన్ పెట్టి రూ.100 కోట్ల బడ్జెట్ కేటాయిస్తాను. రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలిచ్చి స్వయం ఉపాధికి తోడుగా నిలుస్తాను. మైనార్టీలను రక్షించుకోవడం మా సిద్ధాంతం.
బీజేపీ తెలుగుదేశం కూటమి ప్రజల కోసం ఏర్పడింది. అందరం త్యాగాలు చేశాం. రాష్ట్రాన్ని సైకో చేతుల నుండి కాపాడుకోవాలనేది మా సంకల్పంతో కూటమిగా ఏర్పడ్డాం. సౌత్ కొరియా.. నార్త్ కొరియాలా ఏపీ తెలంగాణ తయారయ్యాయి. నార్త్ కొరియాలో కిమ్ ఎలా ఉంటే.. ఏపీలో జగన్ అంతకు మించి అనేలా తయారయ్యాడు. ఎవరు సంతోషంగా ఉండకూడదు. కష్టం వస్తే ఏడవకూడదనే కిమ్ లా జగన్ వ్యవహరిస్తున్నాడు. ప్రశ్నించే వారిపై దాడులు.. ఎదురిస్తే కేసులు పెట్టి జగన్ రెడ్డి వేధించాడు. ఓటు అనే ఆయుధాన్ని పట్టుకుని ప్రజలంతా సిద్ధంగా ఉండాలి.
గతంలో కోడికత్తితో హత్య చేయించాలనుకున్నానంట. ఇప్పుడు గులకరాయితో హత్యాయత్నం చేశానంట. కానీ, గొడ్డలితో నరికేసినోళ్లు మాత్రం నారాసుర రక్త చరిత్ర అంటాడు. వైఎస్ చనిపోయినప్పుడు మిత్రుడిని కోల్పోయామని బాధపడుతుంటే.. ఈ సైకో మాత్రం తండ్రి శవానికి అంత్యక్రియలు కూడా పూర్తి చేయక ముందే సీఎం అయిపోవాలని సంతకాలు సేకరించాడు. రిలయన్స్ అధినేత వైఎస్ ని చంపాడని ఆరోపించి, దాడులు చేయించి ఇప్పుడు ఆ రిలయన్స్ వారికి రాజ్యసభ ఇచ్చాడు. ఇది కపట నాటకం కాదా?
ఇప్పుడు మరో నాటకానికి తెరలేపాడు. గులకరాయి కనబడదు.. కానీ దెబ్బ తగులుతుంది. నా జీవితంలో వెతుక్కుంటే అభివృద్ధి, సంక్షేమం, సుస్థిరాభివృద్ధి కనిపిస్తుంది. కానీ ఈ సైకో జీవితమంతా నేరాలు ఘోరాలే. నేరాలు చేయడం వాటిని ప్రత్యర్ధులపై నెట్టేయడం అలవాటుగా మారిపోయింది. ఈ సైకో జగన్ లాంటి నేరస్తుల పాలిట లాఠీ పట్టిన పోలీసులా ఉంటాను.
ఇసుక మాఫియా, మద్యం మాఫియా, భూ మాఫియా, మైనింగ్ మాఫియా, హత్యా రాజకీయాలు, ప్రజల ఆస్తుల కబ్జా, ప్రభుత్వ టెర్రరిజం, దాడులు కేసులు, శవ రాజకీయాలు డ్రామాలనే తొమ్మిది రత్నాలతో ప్రజల్లోకి వస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా? భూమిస్తా తప్ప కొట్టేయను అంటున్న జగన్ రెడ్డిని అడుగుతున్నా.. ఇడుపులపాయలో 360 ఎకరాలు పేదల భూముల్ని కొట్టేసింది మీ కుటుంబం కాదా ? అనంతపురంలో లేపాక్షి పేరుతో 10 వేల ఎకరాలు, వాన్ పిక్ పేరుతో 26 వేల ఎకరాలు, కడపలో బ్రాహ్మణీ స్టీల్స్ పేరుతో కబ్జా చేశాడు.
ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి శ్రీరంగ నీతులు చెబుతున్నాడు. జగన్ రెడ్డి మీ భూములపై కన్నేశాడు. జగన్ రెడ్డి మరోసారి గెలిస్తే మీ భూమి మీది కాదు. మీ భూమి పేపర్లపై జగన్ రెడ్డి బొమ్మేంటి? జగన్ రెడ్డి తాత ఆస్తా దానిపై అతని బొమ్మ వేసుకోవడానికి. సర్వే రాళ్లపై కూడా బొమ్మ వేయించుకున్నాడు. అంటే ఫోటో చూసి భయపడుతూ ఉండాలనేలా వ్యవహరించాడు. ఒంటి మిట్టలో చేనేత కార్మికుడి భూమిని వైసీపీ నేతలు సర్వే నెంబర్లు మార్చి కబ్జా చేస్తే.. కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. మరో బిడ్డ హైదరాబాద్‌లో ఉండి బతికి పోయింది. ఆమెకు ఆర్ధిక సాయం అందించాను. చదువుకోవడానికి రూ.5 లక్షలిచ్చి అండగా నిలిచా. అధికారంలోకి వచ్చాక ఆమె భూముల్ని వెనక్కి ఇచే బాధ్యత తీసుకుంటాను.
పరిశ్రమలు రావాలంటే మంచి పాలకులు అధికారంలో ఉండాలి. దశాబ్దాలుగా కష్టబడి సంపాదించుకున్న ఆస్తుల్ని కబ్జా చేసి, గొంతుపై కత్తి పెట్టి రాయించుకుంటుంటే పరిశ్రమలు ఎలా వస్తాయి? తిరుపతి నుండి అమర్ రాజా, లులూ లాంటి పరిశ్రమలు ఎందుకు పారిపోయాయో ఆలోచించండి.
గతంలో అబ్దుల్ కలాంని రాష్ట్రపతిని చేసేందుకు ప్రతిపాదించింది నేనే. నంద్యాలలో అబ్దుల్ సలాం అనే మైనార్టీ సోదరుడిని వేధించి, వారి కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి కల్పించారు. ఎంతటి మనో వేదన అనుభవించి ఉంటే అంతటి నిర్ణయం తీసుకుంటారు? అలాంటి బతుకులు మనకు కావాలా? ఇలాంటి క్రూరుల్ని మరోసారి గెలిపించుకుంటామా? మైదుకూరులో ఒక మైనార్టీ సోదరుడి ఆస్తులు లాక్కుంటే రోడ్లపై తిరుగుతున్నాడు. నందికొట్కూరులో నమాజ్ చేసి ఇంటికొస్తున్న మహిళ బురకా తీసి దొంగ అని అవమానించడమే కాకుండా, తిరిగి కుటుంబ సభ్యులపై దాడికి దిగారు. ఇలాంటి రౌడీయిజాన్ని సహిద్దామా?
రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకు రావడమే లక్ష్యంగా మేనిఫెస్టో తీసుకొచ్చాం. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.15 చొప్పున ఇస్తా. తల్లిక వందనంతో ప్రతి బిడ్డకీ ఏటా రూ.15 వేలు, ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తా. డ్వాక్రాకు రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ అమలు చేస్తాను. సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాకుండా.. ప్రతి రూపాయిని రెట్టింపు ఆదాయం పొందే మార్గాలు చూపిస్తాను. ప్రతి ఒక్క యువకుడికి ఉద్యోగం ఇచ్చే బాధ్యత నాది. అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీపై తొలి సంతకం పెడతాను. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా. అంత వరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తాను. బీసీ డిక్లరేషన్లో పేర్కొన్న ప్రతి అంశాన్ని పక్కాగా అమలు చేసే బాధ్యత నాది.
పెన్షన్ అమలు చేసిందే ఎన్టీఆర్. రూ.200 ఉన్న పెన్షన్ రూ.1800 పెంచి రూ.2000 చేశాను. అధికారంలోకి రాగానే రూ.4000 ఇస్తా. అది కూడా ఏప్రిల్ నెల నుండే అమలు చేస్తాను. ఇంటి వద్దనే అందిస్తాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 సంవత్సరాలకే పెన్షణ్ అందిస్తాం. ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా అమలు చేస్తాను. ప్రమాదంలో చనిపోయిన కుటుంబానికి రూ.10 లక్షలు బీమా అమలు చేస్తాను.
నరకం చూపిస్తున్న రోడ్లను మెరుగుపరుస్తా. పెట్రోల్ డీజిల్ ధరలు, విద్యుత్ ఛార్జీలు నియంత్రిస్తాను. చెత్త పన్నును పూర్తిగా రద్దు చేస్తాను. జే బ్రాండ్స్ రాష్ట్రంలో లేకుండా చేస్తా. జే బ్రాండ్స్ ద్వారా ప్రజల నుండి దోచుకున్న ప్రతి రూపాయి కక్కిస్తాను. అన్న క్యాంటీన్లు పున:ప్రారంభిస్తాను. పదవీ విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం చేస్తా. మెప్మా ఉద్యోగులకు అకౌంట్లలోనే జీతాలు చేరుస్తా.
రాయలసీమలో ఒక్క బలిజకైనా సీటిచ్చాడా? బలిజలకు రాజకీయంగా గొంతు నొక్కి ఉద్దరించానంటున్నాడు. బలిజల అడ్డా రాజంపేటను బాలసుబ్రహ్మణ్యం అనే బలిజలకు కేటాయించాను. తిరుపతిలో ఒక బలిజకు సీటిచ్చారు. అనంతపురం, కర్నూలులో బీసీలకు అధికంగా సీట్లిచ్చాం. కానీ, సామాజిక న్యాయం అనే జగన్ రెడ్డి దగా చేసి అదే సామాజిక న్యాయం అంటున్నాడు.
జగన్ రెడ్డి వదిలిన బాణం రివర్స్ అయింది. తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాలని అడిగితే.. ఆమె రోడ్డెక్కింది. మరో వైపు తండ్రిని చంపేసిన వారిని అరెస్టు చేయాలంటూ మరో చెల్లి రోడ్డెక్కింది. అది వారి కుటుంబ సమస్య. దాన్ని మనపైకి నెట్టాలనుకుంటే సహించేది లేదు. యువకుడు, నీతి నిజాయితీకి మారుపేరు విద్యా వంతుడు భూపేష్ రెడ్డిని పార్లమెంటుకు పంపించే బాధ్యత మీది. అవినాశ్ రెడ్డికి భూపేష్ రెడ్డికి మధ్య మీరు ఎవరివైపు ఉంటారు.
చదువుకుని కలం పెట్టుకుని తిరిగే వ్యక్తి మన భూపేష్ రెడ్డి. గొడ్డలి పెట్టుకుని తిరిగే నర హంతకుడు ఈ అవినాశ్ రెడ్డి. సీబీఐ కేసు పెట్టడంతో పాటు ఆధారాలన్నీ సేకరించి అరెస్టు చేసే సమయంలో అధకారాన్ని అడ్డు పెట్టి అరెస్టు కాకుండా చేశాడు. తోక కుక్కను ఆడిస్తున్నట్లు అవినాశ్ రెడ్డి జగన్ రెడ్డిని ఆడిస్తున్నాడు. ఏంటి ఈ చిదంబర రహస్యం. ఏంటి ఈ అంత:పుర రాజకీయాలు?
కడపలో ముగ్గురు మారీచులున్నారు. ఒక ఎమ్మెల్యే, ఒకరు మేయర్, మరొకరు రవీంద్రనాథ్ రెడ్డి. వీరంతా ఏకమై కడపను నాశనం చేస్తున్నారు. ఓటు వేసే ముందు ఆలోచించి ఓటేయండి. ల్యాండ్ శ్యాండ్ మైనింగ్ సెటిల్మెంట్లతో జిల్లాను కబ్జా చేస్తున్నాడు. మంత్రి తమ్ముడు షాడో మంత్రిగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వేసి అమ్మేస్తున్నారు. చలమా రెడ్డి కొండను అనకొండలా మింగేశారు. దర్గా భూములు, వక్ఫ్ బోర్డు భూముల్ని కబ్జా చేస్తున్నారు. దేవుడి భూములు కబ్జా చేసిన వారిని సహించేది లేదు. ప్రతి గజం వెనక్కి రప్పిస్తా.
నియోజకవర్గంలో తాగునీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తాను. వంద రోజుల్లో గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేస్తా. ఉపాధి కల్పన కోసం కడప ఇండస్ట్రియల్ టౌన్ షిప్ అభివృద్ధి చేస్తా. కడప విమానాశ్రయాన్ని పున:ప్రారంభిస్తా. నీళ్లున్నాయి. భూములున్నాయి. కడపకు పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. రిమ్స్ లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తాను. గతంలో సీమలో ముఠా కక్షల్ని అణచివేశాను.
తన మన బేధం లేకుండా ఫ్యాక్సనిజాన్ని తొక్కి పడేశాం. అధికారంలోకి వచ్చాక రాజకీయ రౌడీల్ని తుంగలో తొక్కి చూపిస్తాను. ప్రతి పేద వారికి ఇల్లు కట్టించి ఇస్తాను. బుగ్గవంక ప్రాంతాన్ని సుందరీకరణ పనులు వీలైనంత త్వరగా చేయిస్తాను. పాత కడవ చెరువును ట్యాంక్ బండ్ మాదిరి అభివృద్ధి చేసి చూపిస్తాను. తొలి గడప దేవుని కడపలో వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తా.జనాన్ని చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తోంది.
మీ ఉత్సాహం చూస్తుంటే మనసు ఉప్పొంగిపోతోంది. కడపలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధుల్ని ఎమ్మెల్యే, ఎంపీగా గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలి. జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ తీసుకొస్తాను. ప్రతి మాదిగ సోదరుడికి చెప్పండి. ఇదే విషయంపై జగన్ రెడ్డిని వివరణ అడగాలి. మనో నిబ్బరంతో రాష్ట్రాభివృద్ధికి తోడుగా నిలవాలి