సీఎం జగన్ తెచ్చింది సామాజిక విప్లవం
బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వైకాపాతోనే
చంద్రబాబు 14 ఏళ్ల పరిపాలనలో చేసింది శూన్యం
సామాజిక సాధికారత యాత్రలో విజయసాయి రెడ్డి
అక్టోబర్ 27: రాష్ట్రంలో బీసీలు, ఎస్పీలు, ఎస్టీలు, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల అభివృద్ది కోసం గడిచిన నాలుగున్నర ఏళ్లలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, తీసుకొచ్చిన పాలన సంస్కరణలు, అభివృద్ది కార్యక్రమాలు దేశంలో మరే ఇతర రాష్ట్రంలో జరగలేదని రాజ్యసభ సభ్యులు, దక్షిణ కోస్తా జిల్లాల వైకాపా రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి అన్నారు.
రెండో రోజు తిరుపతి అర్బన్ పరిధిలో శుక్రవారం నిర్వహించిన సామాజిక సాధికారత బస్సు యాత్రలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సామాజిక విప్లవం తీసుకొచ్చారని, బడుగు బలహీన వర్గాల అభివృద్ది కోసం తెచ్చిన పాలనాపరమైన సంస్కరణలు చరిత్ర సృష్టించాయని అన్నారు.
ఇది సాధికారత బస్సు యాత్ర మాత్రమే కాదని, ఇది ‘సాధికారత విప్లవ యాత్ర అని అన్నారు. బడుగు బలహీన వర్గాలు వైకాపాతోనే ఉన్నారని, రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిని చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో 25 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ప్రజాసేవలో నిమఘ్నమవుతారని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదని, కేవలం నాలుగున్నర ఏళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలనతో చరిత్ర సృష్టించారని అన్నారు. అనంతరం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు