సమాఖ్య వ్యవస్థలో అత్యంత ప్రమాదకరమైన దుశ్చర్యకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వడికట్టింది. “తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా? అంటే, దూడ గడ్డి కోసం అన్నాడట వెనకటికి ఒకడు”.
ఆంధ్రప్రదేశ్ నీటి హక్కుల పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నవంబరు 29వ తేదీ అర్థరాత్రిపూట (తెల్లవారితే తెలంగాణలో ఎన్నికల పోలింగ్) జల వనరుల శాఖాధికారులు, పోలీసు అధికారుల నేతృత్వంలో భారీ సంఖ్యలో పోలీసులు దండెత్తిపోయి, సాగర్ డ్యాం స్పిల్ వే 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ ను స్వాధీనం చేసుకొని, తమ ఆధీనంలో ఉంచుకొన్నారట! త్రాగు నీటి కోసం నీటిని విడుదల చేశారట! అమ్మబాబోయ్! జగన్మోహన్ రెడ్డిగారు ఎంతటి సాహసం చేశారు! ఈ తరహా దృశ్యాలను సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం.
మన రాజ్యాంగం ఇలాంటి దుశ్చర్యలను అనుమతిస్తుందా? ప్రజాస్వామ్య – సమాఖ్య వ్యవస్థపై అవగాహనతోనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా? ఇంతకీ నాటకీయ ఫక్కీలో పొరుగు రాష్ట్రం తెలంగాణపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది, “నిజమైన నీటి యుద్ధమేనా!”, లేదా! మోడీ – కేసీఅర్ – జగన్ “ఎన్నికల రాజకీయ లాలూచీ కుస్తీనా!”.
2021 జూలై 15న కేంద్ర జలశక్తి శాఖ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు కృష్ణా నది యాజమాన్య బోర్డు పరిధిని నిర్దేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది కదా! రెండున్నరేళ్ళు గడుస్తున్నా దాన్ని ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ఏనాడైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారా? ప్రధానమంత్రి మోడీ, పునర్వ్యవస్థీకరణ చట్టం అమలుకు బాధ్యతవహిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షేకావత్ గార్లతో పలు దఫాలు కలిశారు కదా! ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులను పరిరక్షించాలని వారిని నిలదీశా?
కృష్ణా నది యాజమాన్య బోర్డును ఎందుకు ఏర్పాటు చేశారు? దాని బాధ్యత ఏంటి? అక్టోబరు 6న కృష్ణా నది యాజమాన్య బోర్డు శ్రీశైలం జలాశయం నుండి 30 టియంసీలు వినియోగించుకోవడానికి అనుమతించిందట, ఆ నీటిలో 15 టియంసీలను తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తికి వాడుకొని నాగార్జునసాగర్ జలాశయానికి వదిలిపెట్టిందట. ఆ నీటిని సాగర్ కుడి కాలువకు విడుదల చేయమంటే చేయలేదట.
తెలంగాణ నీటి పారుదల శాఖాధికారులు నీటిని విడుదల చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసిందా? తెలంగాణ ప్రభుత్వానికి ఉత్తరం వ్రాశారా? బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం పోలీసు బలగాలతో నీటి యుద్ధం చేస్తుందా? దాన్ని జగన్మోహన్ రెడ్డి సాహసోపేత నిర్ణయంగా అభివర్ణిస్తారా!
శ్రీశైలం జలాశయం నిర్వహణ బాధ్యత ఆంధ్రప్రదేశ్ కు అప్పగించడం జరిగింది. కానీ, కేసీఅర్ ప్రభుత్వం శ్రీశైలం ఎడమ వైపు విద్యుదుత్పత్తి కేంద్రం నియంత్రణను వాళ్ళ చేతుల్లోనే పెట్టుకొన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్న సాగర్ డ్యాంను స్వాధీనం చేసుకున్నామంటే చట్టం ఒప్పుకుంటుందా ? పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కృష్ణా నది యాజమాన్య బోర్డు తన పరిధిలోకి తీసుకొని, నిర్వహించమని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఆ పని చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే దుశ్చర్యకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాల్పడడం అత్యంత గర్హనీయం, బాధ్యతారాహిత్యం.
నిన్న ఉదయం ఒక దినపత్రిక ఇంటర్నెట్ ఎడిషన్ లో తాజా వార్తగా చదివినప్పుడే తెలంగాణ ఎన్నికల పోలింగ్ పూర్వరంగంలో ఇదొక రాజకీయ జిమ్మిక్ అనిపించింది. ప్రముఖ ఇంజనీర్ వీరయ్య గారు, ప్రముఖ రైతు నాయకులు యెర్నేని నాగేంద్రనాథ్ మరియు సుబ్బారావుగార్ల సంస్మరణ సభలో ఉండగా ఒక ఛానల్ మిత్రుడు ఫోన్ చేసి సాగర్ వద్ద జరిగిన ఘటనపై చర్చకు ఆహ్వానించారు. నేను సభలో పాల్గొంటున్నానని, సాధ్యంకాదని చెప్పాను.
ఆ సభలో కృష్ణా – గోదావరి నదీ జలాల సమస్యలపైనే నిర్వాహకులు ప్రత్యేక చర్చ చేపట్టారు. నేను మాట్లాడను. ఇంటికి రాగానే తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కా. పశ్య పద్మగారు ఫోన్ చేసి, ఈ సమస్యను ప్రస్తావించారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు అధికారులకు ఫోన్ చేస్తే, ఘటన జరిగింది వాస్తవమే, కానీ, రాష్ట్ర ప్రభుత్వాల నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీలు స్పందించి, చర్యలు తీసుకోవాలని సమాధానం చెప్పినట్టు ఆమె తెలిజేసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. కృష్ణా నది యాజమాన్య బోర్డు యొక్క బాధ్యత ఏంటో నిలదీయండని ఆమెకు సూచించా.

సామాజిక ఉద్యమకారుడు,
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక