• 98శాతం హామీల అమలు వివరాలను ప్రజలముందు పెట్టే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా?
• జగన్మోహన్ రెడ్డి సంక్షేమమంతా రంగుకాగితాలకే పరిమితమైంది
• 98 శాతం హామీలు అమలుచేశామంటున్న జగన్ రెడ్డి, వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని లబ్దిదారుల వివరాలతో సహా ప్రజలముందు ఉంచాలని డిమాండ్ చేస్తున్నాం
• రాయలసీమలో ఏ ఒక్కరైతుకైనా డ్రిప్ ఇరిగేషన్ కింద ఈ ప్రభుత్వం రూపాయి సాయంచేసినట్టు నిరూపిస్తే, నా పదవికి రాజీనామాచేస్తాను
• టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు
అధికారంకోసం అలవికాని హామీలతో ఏపీప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక వారికిపట్టపగలే చుక్కలుకనిపించేలా చేస్తూ, నరకంచూపిస్తున్నాడని, జగన్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధి అంతా రంగుకాగితాలకే పరిమిత మైందని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ఎద్దేవాచేశారు.
“98శాతం ఎన్నికల హామీలు అమలు చేశామంటున్న ముఖ్యమంత్రి, మంత్రుల వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి, 98శాతం హామీలు ఇప్పటికే అమలుచేశామని నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నాడు. జగన్ రెడ్డి సంక్షేమం అంతా అంకెలగారడీ…. రంగుకాగితాలకే పరిమితమని ఘంటాపథంగా చెప్పగలం. సంక్షేమ పథకాలను కులాలవారీగా అమలు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. సంక్షేమం విషయంలో గత ప్రభుత్వంలో అవే కులాలకు ఎంత లబ్ది కలిగింది.. ఇప్పుడు ఎంత కలుగుతుందో ముఖ్యమంత్రి వాస్తవాలు చెప్పగలడా? పథకాలు, హామీల అమల్లో ఎంత పారదర్శకత, ప్రజలకు ఎంతప్రయోజనం ఒనగూరిందన్నది ప్రభుత్వమే చెప్పాలి.
రాష్ట్రంలో 1కోటి 67లక్షలకుటుంబాలకు, రూ.లక్షా 36వేలకోట్ల లబ్దిచేకూర్చినట్లు జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రులంటున్నారు. వారు చెబుతున్న లెక్కలకు సంబంధించిన పూర్తి వివరాలను వాస్తవాలతో ప్రజలముందు ఉంచగలరా? బడ్జెట్ ను కులాలవారీగా విభజించిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కింది. నవరత్నాలకు పెట్టిన ఖర్చులో కూడా కులాలవారీ లెక్కలే చెప్పడం నిజంగా సిగ్గుచేటు. బీసీలకు లక్షా 37వేలకోట్లు ఖర్చుపెట్టామంటున్న జగన్మోహన్ రెడ్డి, ప్రత్యేకంగా వారి సంక్షేమం, ఉన్నతికోసం తనపాలనలో ఏంచేశాడో చెప్పగలడా? బీసీ సబ్ ప్లాన్ ఏమైంది.? కార్పొరేషన్ల ద్వారా ఎంత మందికి స్వయం ఉపాధి కల్పించారు. ఎంత మందికి కార్పొరేషన్ల ద్వారా లబ్ది చేకూర్చారో ముఖ్యమంత్ర సమాధానం చెప్పాలి.
2019-20లో విత్తనాలు దొరక్క అనంతపురంలో రైతులు చనిపోయారు.. మరణించినవారి కుటుంబాలకు రూ.7లక్షల పరిహారమన్నారు.. ఇప్పటికీ ఇవ్వలేదు. అప్పులబాధతో అత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పైసా సాయంచేసిన దాఖలాలు లేవు. ఇలాచెప్పు కుంటూ పోతే ఈప్రభుత్వ మోసకారి సంక్షేమానికి లెక్కేలేదు. జీడీపీ, తలసరి ఆదాయంలో దేశంలోనే రాష్ట్రం అత్యంత దారుణంగా దిగజారిపోయింది.
రైతులు మొదలు ఉద్యోగుల వరకు అందరికీ పంగనామాలే….
రైతుభరోసా కింద ప్రతిరైతుకి రూ.15వేలు ఇస్తామన్న జగన్ రెడ్డి, రూ.7,500లతో సరిపెట్టాడు. కేంద్రం ప్రకటించకముందే రైతుభరోసా సాయం రూ.15వేలు ఇస్తానన్న జగన్ రెడ్డి, తీరా ఏరుదాటాక తెప్పతగలేసినట్టు కేంద్రమిచ్చే కిసాన్ యోజనసొమ్ముతో కలిపి రూ.15వేలని నాలుకమడతపెట్టేశాడు. గతప్రభుత్వంలో అన్నదాతలకు రూ.లక్షవరకు వడ్డీలేని రుణాలిస్తే, మూడు లక్షలవరకు పావలావడ్డీ కింద రుణాలిచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక పావలావడ్డీ రుణానికి మంగళం పాడేశాడు. ఆక్వా రంగానికి ఇస్తున్న విద్యుత్ సబ్సిడీ, డీజిల్ రాయితీని తొలగించారు. మోటార్లకు మీటర్లు బిగించి, రైతుల మెడకు ఉరితాళ్లు బిగించడానికి కూడా ఈ ముఖ్యమంత్రి వెనుకాడలేదు. అదేమంటే నాణ్యమైన విద్యుత్ కోసమంటూ నంగనాచి కబుర్లు చెబుతున్నారు.
పెద్దపళ్లెంలో అన్నం పెడుతున్నామని గొప్పలు చెప్పడం కాదు… ఎంత ఆహారం, ఎందరికి పెడుతున్నామన్నదే ప్రధానం. 2019-20 నుంచి ఇప్పటివరకు 8లక్షలకోట్లు అప్పులు చేసిన ముఖ్యమంత్రి, గత ప్రభుత్వం అమలుచేసినన్ని పథకాలు ఎందుకు అమలుచేయలేదు? జగన్ రెడ్డి చెబుతున్న పథకాల అమలు, సంక్షేమం అంతా ప్రకటనలకే పరిమితమైంది తప్ప, ప్రజలకు కాదు. ఈ ముఖ్యమంత్రి ఒకచేత్తో రూపాయిఇస్తూ, మరోచేత్తో 30 రూపాయలు లాక్కుంటున్నాడని ప్రజలకు బాగా అర్థమైంది.
టీడీపీ ప్రభుత్వం ఏటారైతురథం కింద ట్రాక్టర్లు పంపిణీ చేస్తే, జగన్మోహన్ రెడ్డి మూడేళ్లయ్యాక మొక్కుబడిగా అరకొరాపంపిణీ చేశాడు. రైతు ఇన్ పుట్ సబ్సిడీ, ధరలస్థిరీకరణనిధి, గిట్టుబాటుధరల మాటేమిటి అని ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. రాయలసీమ జిల్లాల్లో ఎక్కడైనా సరే డ్రిప్ ఇరిగేషన్ కు ఈప్రభుత్వం రూపాయి సాయం చేసిందని నిరూపిస్తే, నాపదవికి రాజీనామాచేస్తానని వ్యవసాయమంత్రికి, ముఖ్యమంత్రికి సవాల్ విసురుతున్నా. గోదావరిజిల్లాల్లో ఇప్పటికీ రైతులకు ధాన్యం కొనుగోళ్లతాలూకా డబ్బులివ్వలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న 2.30లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తామని చెప్పినవారు, ఇప్పుడేమో 75వేల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఖాళీలున్నాయంటున్నారు.
ఏటా జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగుల్ని మోసగించారు. టీడీపీహాయాంలో ఇచ్చిన నిరుద్యోగభృతికి మంగళంపాడారు. ప్రత్యేకహోదాతో ఉద్యోగాలు వస్తాయన్నారు.. ఇప్పుడేమో హోదా అడగడానికే బెంబేలెత్తుతున్నారు.
రాజశేఖర్ రెడ్డి హాయాంలో ఆరోగ్యశ్రీని కేవలం రెండు జిల్లాల్లోనే అమలుచేస్తే, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్టీఆర్ వైద్యసేవ పథకాన్ని రాష్ట్రమంతా అమలుచేశారు. ప్రజలకు ఎన్నికట్టుకథలు చెప్పినా, ఎన్ని రంగుకాగితాలుపంచినా, వారిజీవన విధానం మెరుగు పడలేదని జగన్మోహన్ రెడ్డి గ్రహించాలి. డ్రైవర్లు, నేతకార్మికులు, దర్జీలు, మత్స్యకారులు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు.. మీరు ఎంతమందికి సాయం చేశారో చెప్పగలరా? ఎన్నికల హామీల పేరుతో పథకాలు అమలు చేస్తామని చెప్పిన జగన్ ప్రభుత్వం ఒక్కపథకాన్నికూడా సంపూర్ణంగా అమలుచేయలేదు. నిన్నగాకమొన్న తీసుకొచ్చిన కళ్యాణమస్తు పథకానికి కూడా సవాలక్ష కొర్రీలు. పదోతరగతి చదవాలనే నిబంధన ఎందుకు పెట్టారు? ఈ ప్రభుత్వం చెబుతున్న హామీలు, పథకాల సంపూర్ణ అమలు, లబ్దిదారుల వివరాలపై ఏ మంత్రి బహిరంగచర్చకు వస్తారో రావచ్చు. అసలు వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం తక్షణమే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
కొంగను విందుభోజనానికి పిలిచిన నక్క, పళ్లెంలో పాయసం పెట్టినట్టుగా, ముఖ్యమంత్రి సంక్షేమంపేరుతో ప్రజలను మోసగిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో జగన్ సర్కారు పూర్తిగా రివర్స్ గేర్ లో నడిచింది. సీపీఎస్ రద్దు చేయలేం.. జీపీఎస్ అనే పరిస్థితికి వచ్చారు. పోలవరం నిర్మాణంపై కూడా గతంలో మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ ప్రగల్భాలు పలికి, ఇప్పుడు పత్తాలేకుండా పోయాడు. రాష్ట్రంలోని పీడీ ఖాతాల్లోని సొమ్ముని దారిమళ్లించి పథకాలకు వినియోగించారు.. తప్ప ఏ కార్పొరేషన్ కు సొంతంగా నిధులు కేటాయించలేదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, బడ్జెట్ ను కులాలవారీగా విభజించి, సంక్షేమాన్నికూడా కులాలవారీగా చూపేదుస్థితికి వచ్చారు. బడ్జెట్ లో కేటాయించిన నిధులన్నింటినీ సంక్షేమానికి, పథకాలకే అమలుచేస్తే, అప్పులు తెచ్చిన సొమ్ము ఏమైంది. ఎవరి జేబుల్లోకి వెళ్లింది? ముఖ్యమంత్రి బటన్ నొక్కుళ్లతో ప్రజలంతా సంతోషంగా ఉంటే, సొంతపార్టీ ఎమ్మెల్యేలు,మంత్రులను జగన్ రెడ్డి ఎందుకు తిడుతున్నాడు? ‘గడపగడపకు’ అంటూ ప్రజలముందుకు వెళ్తున్నవారికి చీపుర్లు, చెప్పులతోకూడిన స్వాగతాలు ఎందుకు లభిస్తున్నాయో” ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని అశోక్ బాబు నిలదీశారు.