రాష్ట్రం 550 శాతం రెవిన్యూ లోటులో ఉంది

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

రాష్ట్ర ప్రభుత్వం 550 శాతం రెవెన్యూ లోటు లో ఉన్నదని, ఇంతటి రెవెన్యూ లోటులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం ఇంకా అప్పులను ఇస్తుందా?, ఈ డబ్బులన్నీ ఏమవుతున్నాయని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఎంత?, లోతు ఎంత అని ఆయన ప్రశ్నించారు. 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి 17 వేల కోట్ల రెవిన్యూ లోటు ఉంటుందని కాగ్ పేర్కొనగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు . ఈ అప్పులలో ఎనిమిది వేల కోట్ల రూపాయల లిక్కర్ బాండ్లను కలపలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖలో లిక్కర్ బాండ్లను కూడా కలపనున్నట్లు పేర్కొన్నప్పటికీ, వాస్తవంగా లిక్కర్ బాండ్ల ద్వారా సేకరించిన అప్పులను కలపలేదని చెప్పారు. ఒకవేళ ఆ అప్పులను కూడా కలిపితే ఐదు నెలల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 52 వేల కోట్ల రూపాయలకు మించిపోయి ఉండేవని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 49 వేల కోట్ల రూపాయలను ఐదు నెలల్లోనే హాం ఫట్ చేసిందన్న ఆయన, ఐదు నెలల క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ 1200 కోట్ల రూపాయలతో, 17వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ను కాగ్ ప్రతిపాదించగా, జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని వెల్లడించారు. ఇప్పటికే 217 శాతం అధికంగా అప్పులను చేసిందన్నారు. లిక్కర్ బాండ్లు 8 వేల కోట్ల రూపాయలను కూడా కలుపుకుంటే, అప్పులు 300 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థ బేషుగ్గా ఉందని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలీసులకు మినహా మిగతా ప్రభుత్వ ఉద్యోగుల ఎవరికి జీతాలు ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే 5,500 కోట్ల రూపాయల అవసరమని రఘురామకృష్ణం రాజు వివరించారు. పాత అప్పులు వడ్డీలకు గాను 8,900 కోట్ల రూపాయలు / month వెచ్చించాల్సి ఉంటుందని చెప్పారు . ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో వచ్చే ఆదాయం వేరని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త అప్పులు ఇవ్వకపోతే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందని, అలాగే సో కాల్డ్ సంక్షేమ పథకాలను కూడా అమలు చేయలేదని అన్నారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే, ఈ ప్రభుత్వం కొత్తగా సంక్షేమ పథకాలు ఇచ్చింది ఏమీ లేదన్న ఆయన, టైటిల్ పిచ్చిలో పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే పరిస్థితి లేదని, కేవలం అస్మదీయులకు మాత్రమే బిల్లుల చెల్లింపులో మినహాయింపు ఉన్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం భయంకరమైన అప్పుల ఊబిలో చిక్కుకున్నదని, అనుదినం ఇంకా ఈ ఊబి లోకి దిగజారి పోతుందని వ్యాఖ్యానించారు.

అమరావతి రైతుల పాదయాత్ర అద్వితీయంగా కొనసాగుతుంది
అమరావతి రైతుల పాదయాత్ర అద్వితీయంగా కొనసాగుతుందని రఘురామకృష్ణంరాజు అన్నారు.. ఉండి, భీమవరంలలో పాదయాత్రకు అనూహ్య స్పందన లభించిందన్న ఆయన, చాలాచోట్ల రైతు పాదయాత్రికులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు పాదయాత్రతో పాలకుల వెన్నులో చలి పుడుతుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. రైతు పాదయాత్రలకు వ్యతిరేకంగా పాలక పక్షం వారు కొబ్బరికాయలు కొడుతుంటే, వారి పీడ వదిలించడానికి కూష్మాండం బద్దలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.

ఆష్యుర్ కంపెనీకి మీ కూతురు, అల్లుడి కంపెనీ అన్ సెక్యూర్డ్ లోన్ ఇచ్చింది నిజం కాదా?
ఆష్యుర్ కంపెనీకి మీ కూతురు, అల్లుడికి చెందిన కంపెనీ ఇన్ సెక్యూర్డ్ లోన్ ఇచ్చింది నిజం కాదా అని రఘురామకృష్ణంరాజు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డిని సూటిగా ప్రశ్నించారు. అలాగే దసపల్లా భూములకు సంబంధించి కోర్టు తీర్పు ఎప్పుడు వచ్చిందని నిలదీశారు. అప్పుడే 64 మందికి ఎందుకని భూములను రిజిస్ట్రేషన్ చేయలేదని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. అప్పుడే రిజిస్ట్రేషన్ చేసి ఉంటే, ఇప్పుడు మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేయవలసిన అవసరం ఉండేది కాదు కదా అంటూ ప్రశ్నించారు. 2017 18 లోనే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉండగా, ఇప్పుడు విజయసాయి ఎందుకని కాకి గోల చేస్తున్నారంటూ నిలదీశారు. రిజిస్ట్రేషన్ కానీ దసపల్లా భూములను ఎందుకని మీరు అప్పు ఇచ్చిన కంపెనీ పేరిట, భూముల డెవలప్మెంట్ అగ్రిమెంట్ జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి చెప్పే అబద్దాలతో ప్రభుత్వం ప్రతిష్ట మసకబారుతోంది రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు.

ఋషికొండకు గుండు కొట్టారు
ఋషికొండలో ముఖ్యమంత్రి ఇల్లు ఎందుకు కట్టుకోకూడదని?అంటూ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. ఋషికొండ ప్రకృతి విధ్వంసం పై తాను సుప్రీంకోర్టును ఆశ్రయించగా, హైకోర్టులో కొనసాగుతున్న కేసులో ఇంప్లిడ్ కావాలని సూచించారని తెలిపారు. అయితే హైకోర్టులో ఈ కేసు గత మూడు నెలల నుంచి వాయిదాలపై వాయిదాలు పడుతూ వస్తోందని అన్నారు. రేపు కోర్టులో ఏమైనా జరగవచ్చునన్న ఆయన, ప్రజా న్యాయస్థానం ముందు ఈ విషయాన్ని తాను ప్రస్తావించాలని అనుకుంటున్నానని తెలిపారు. ఋషికొండపై 21.5 ఎకరాలలో కొండను చెక్కి వేశారని, వాటికి సంబంధించిన చిత్రాలను ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు ప్రదర్శించారు. న్యాయస్థానానికి చెప్పిన దాని కంటే ఏడు ఎనిమిది రెట్లు ఎక్కువగానే, కొండ పై నిర్మాణాలను చేపడుతున్నారని తెలిపారు.