Suryaa.co.in

Andhra Pradesh

బడుగు వర్గాల అభ్యున్నతే జగన్ లక్ష్యం

– సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో వైయస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అయిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము
– సమావేశంలో పాల్గొన్న కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, సీఎం వైయస్‌ జగన్‌, వైయస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి:

వైయస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ఏమన్నారంటే…
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరికీ స్వాగతం. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరపున మీకు స్వాగతం పలుకుతున్నాం. ద్రౌపది ముర్ము ఢిల్లీలో నామినేషన్‌ దాఖలు చేసినప్పుడు, ఆమెను సమర్థిస్తూ నాకూ, ఎంపీ మిధున్‌రెడ్డికి సంతకం చేసే అవకాశాన్ని సీఎం  వైయస్‌ జగన్‌ కల్పించారు. నామినేషన్‌ దాఖలు సందర్భంగా ముర్ము వ్యవహరించిన విధానం, ఒద్దిక, గౌరవంగా ప్రవర్తించిన తీరు దేశమంతా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు మాత్రమే కాకుండా బీఎస్పీ, శిరోమణి అకాళీదళ్‌ పార్టీ, బిజూ జనతాదళ్‌ పార్టీలు కూడా ముర్ము అభ్యర్థిత్వాన్ని సమర్థించాయి.

15వ రాష్ట్రపతి ఎన్నిక రెండు కారణాల వల్ల చరిత్రాత్మకం కానుంది. తొలిసారిగా ఒక ఆదివాసీ మహిళ ఈ పదవికి పోటీ చేస్తోంది. రెండో విషయం. ఒడిషాలోని రాయ్‌రంగపూర్‌లో కౌన్సిలర్‌గా పని చేసి ఇప్పుడు రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్నారు ఒక మహిళ. ముర్ము కౌన్సిలర్‌గా తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి, రాష్ట్రంలో ఎమ్మెల్యేగానూ, మంత్రిగానూ, ఆ తర్వాత జార్ఖండ్‌ గవర్నర్‌గా కూడా విశేష సేవలందించారు. ఇప్పుడు ఆ అనుభవంతో రాష్ట్రపతిగా కూడా రాణిస్తారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూరై్తన సందర్భంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకుంటున్న సమయంలో ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఎన్నిక కానుండడం గొప్ప విషయం.
రాష్ట్రంలో సీఎం వైయస్‌ జగన్‌ నేతృత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆయన ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి లక్ష్యాలుగా పని చేస్తున్నారు. రెండింటికీ ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా వారి కోసం ఎన్నో కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నారు. మేమంతా ఆయన ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్నాం.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళల అభ్యున్నతికి గత మూడేళ్లుగా సీఎం వైయస్‌ జగన్‌ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన మంత్రివర్గంలో 70 శాతం పదవులు వారికే ఇచ్చారు. అంతే కాకుండా వారికి ముఖ్యమైన శాఖలు కూడా ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లల్లో మహిళలకు 50 శాతానికి పైగా పదవులు ఇచ్చారు. ఇది గతంలో ఎక్కడా, ఎప్పుడూ జరగలేదు. దాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి మాత్రమే చేసి చూపారు.

రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము గురించి ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించినంతగా, మరెవ్వరం చెప్పలేము. ముర్ము గురించి ప్రధాని నరేంద్రమోదీ ఏమన్నారంటే.. ‘దేశ సేవ, నిరుపేదల అభ్యున్నతి కోసం ద్రౌపది ముర్ము తన జీవితాన్ని అంకితం చేశారు. సమాజంలో అట్టడుగున ఉన్న వారితో పాటు, పేదరికంలో ఉన్న వారు అభివృద్ధి చెందేలా ఎంతో కృషి చేశారు. ఆమెకు మంచి పరిపాలన దక్షత ఉంది. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై మంచి అవగాహన ఉంది. అందుకే ఆమె రాష్ట్రపతి పదవిలో రాణిస్తుందని నాకు ఎంతో విశ్వాసం ఉంది. ఆమె ఒక గొప్ప రాష్ట్రపతిగా నిలుస్తారు. కచ్చితంగా నిలుస్తారు’..

మేడమ్‌ మీకున్న విశేష అనుభవం వల్ల రాష్ట్రపతిగా మీరు ఎంతో రాణిస్తారని మా అందరి ధృఢ విశ్వాసం. దేశంలోనే అత్యున్నతమైన ఆ పదవికి మీరు అన్ని విధాల అర్హులు. మేడమ్‌ మీ విజయం ఖాయం. మా అందరి పక్షాన మీకు అభినందనలు. మీ నేతృత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని మా అందరి నమ్మకం. మీరు ఎంతో ఉజ్వలంగా బాధ్యతలు నిర్వర్తించి, ఒక గొప్ప రాష్ట్రపతిగా నిల్చిపోతారు. మరోసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

LEAVE A RESPONSE