– పార్లమెంటుకు ఒక నెంబరు, కేంద్రానికి ఒక నెంబరు, కోర్టులకు ఒక నెంబరు ఇచ్చారు
-తప్పుడు లెక్కలు ఇవ్వకూడదనే ఇంగిత జ్ఞానం ప్రభుత్వానికి లేదు
– కేంద్రం, ఆర్బీఐ రాసిన లేఖలు బయటికి రానివ్వడంలేదు
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీ.వీ రెడ్డి
దేశంలో ఏ రాష్ట్రమైనా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. పెట్టుబడులు తేవడానికి కృషి చేస్తుంది. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర నిధులకోసం తాపత్రయపడుతుంది. కానీ మన రాష్ట్రం అప్పులకోసం తహతహలాడుతోంది.
రాష్ట్రంలో లేస్తే అప్పు, పడుకుంటే అప్పు అన్నట్లుంది. వారం వారమే కాదు సంవత్సరంలో 365 రోజులు అప్పులమయమైంది.పోలవరం ప్రాజెక్టు, రైల్వే ప్రాజెక్టు నిర్మాణాలకు నిధుల కోసం ఢిల్లీ వెళ్లారనుకుంటే పప్పులో కాలేసినట్లే. రాష్ట్ర నాయకులు ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి నిధులు తెచ్చి పోలవరం, రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేస్తారనుకుంటే మిథ్యే.
రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఢిల్లీ వెళ్లారంటే అది అప్పుల కోసమే.నాలుగు నెలల్లో ఏ రాష్ట్రం కూడా 15 లేదా 20 వేలకు మించి అప్పు చేయలేదు. వారి పరిధిలోపే అప్పులు తెచ్చుకున్నారు. మన రాష్ట్రం 4నెలల్లో 40 వేల 190 కోట్ల అప్పు తెచ్చింది.ఆర్బీఐ బాండ్ల రూపంలో తెచ్చిన అప్పు మాత్రమే ఇది.
ఇది కాకుండా కేంద్రం, ఎక్స్ టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టు లు కొంత అప్పు ఇస్తాయి. ఈ అప్పుల గురించి పార్లమెంటులో అడిగితే 12 వందల కోట్లు తెచ్చారన్నారు. అది సత్యమో, అసత్యమో తెలియదు. పార్లమెంటుకు అప్పుల డేటా ఇస్తే పార్లమెంటు సమాధానం చెబుతుంది. అసెంబ్లీకి, పార్లమెంటుకు, కేంద్ర ప్రభుత్వానికి అన్ని తప్పుడు లెక్కలు చెప్పడం ప్రభుత్వానికి అలవాటైంది. కరోనా మరణాలు వివరాలు తెలిపినప్పుడు అసెంబ్లీలో ఒక నెంబరు, పార్లమెంటుకు ఒక నెంబరు, కేంద్రానికి ఒక నెంబరు, కోర్టులకు ఒక నెంబరు ఇచ్చారు. తప్పుడు లెక్కలు ఇవ్వకూడదనే ఇంగిత జ్ఞానం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం చెబుతున్న లెక్కల వాస్తవానికి పొంతన లేకుండా పోతోంది. పార్లమెంటును తప్పుదారి పట్టిస్తున్నారు. పార్లమెంటుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు కావున పార్లమెంటు నుండి వచ్చే సమాచారం పరిగణనలోకి తీసుకునే పరిస్థితులు లేవు.
ఆర్బీఐ ద్వారా 40వేల 190 కోట్లు తెచ్చారు. మిగతావి చెప్పడంలేదు. జీవోలు దాచారు. సమాచారం బయటికి రానివ్వడంలేదు. కేంద్రం, ఆర్బీఐ రాసిన లేఖలు బయటికి రానివ్వడంలేదు. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను దేశంలో ఏ రాష్ట్రం అప్పు 20 వేల కోట్లు దాటలేదు. 28 వేల కోట్లు పరిధి మాత్రమే ఉంటే రాష్ట్రం ఆ పరిధి దాటింది. మేం చేసింది లక్షా 20 వేల కోట్లే అని పార్లమెం టులో సమాధానం చెప్పారంటున్నారు.పార్లమెంటులో చెప్పింది ఒక రూపంలో తెచ్చిన అప్పు మాత్రమే.అది కూడ పూర్తి సమాచారం ఇవ్వలేదు.
కేంద్రం మార్చిలో లెటర్ రాసిందంటున్నారు. ఆ లెటర్ బయట పెట్టడంలేదు.రాష్ట్రం కాగ్ కు ఖచ్చితమైన డేటా ఇవ్వలేదు. తప్పుడు లెక్కలిచ్చారు. వారు ఆ తప్పుడు లెక్కలనే చూపించారు.కార్పొరేషన్ ద్వారా తెచ్చిన రుణాలు దాచిపెట్టారు. లక్షా 68 వేల కోట్ల ఖర్చు ఫిబ్రవరి నాటికి అయితే మార్చి నాటికి లక్షా 58వేల కోట్లు ఖర్చు అయిందని తగ్గించి చూపారు. వీటిని దొంగ లేక్కలనక మరేమంటారు?
మే నెలలో ఈ వివరాలు బయటపడ్డాయి. అప్పటి నుంచి మేం అడుగుతున్నాము. అన్నీ తప్పుడు లెక్కలు చూపుతున్నారు. ఫిజికల్ డెఫ్ సిట్ 2 శాతమే ఉంది, రెవెన్యూ డెఫ్ సిట్ తక్కువ ఉందని చెబుతున్నారు. ఖర్చు పెరుగుతేనేమో తక్కువ చూపుతున్నారు. ఆదాయం తక్కువ వస్తే ఎక్కువ ఆదాయం చూపిస్తున్నారు. చూపాల్సిన ఖర్చులు చూపడంలేదు. మార్చి వచ్చేసరికి ఖర్చులు తక్కవ చేసి చూపారు, ఆదాయం ఎక్కువ చేసి చూపించారు. రాష్ట్రం ఖచ్చితమైన లెక్కలు చూపితే ఫిజికల్, రెవెన్యూ లోబడ్జెట్, అప్పుల అంశంలో రాష్ట్రం మొట్టమొదటగా ఉంటుంది. ప్రజలు అసహ్హించుకుంటారని దొంగ లెక్కలు ఇస్తున్నారు.
ఎక్కడా రోడ్ల కోసం ఒక తట్ట మట్టి వేయలేదు. రోడ్డుకు ప్యాచ్ వర్క్ లని ఎక్కడ చేయలేదు. డెవలప్ మెంట్ పనులని ఒక్కటి మొదలు పెట్టలేదు. పెండింగ్ ఉన్న బిల్లులను విడుదల చేయలేదు. 20శాతం లంచాలు ఇచ్చిన వారికి అరకొరగా బిల్లులను విడుదల చేశారు. తెచ్చిన అప్పులు, కేంద్రం నిధులు ఎక్కడికి పోతున్నాయి? ఈ నిధులన్నీ ఎవరు స్వాహా చేస్తున్నారు. ప్రతి వారం అప్పుల కోసం ప్రణాళికలు రచిస్తున్నారు, కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.8,300కోట్లు అప్పు తెచ్చారు. మరో 25వేల కోట్ల రూపాయలు లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయాన్ని స్పెషల్ మార్జిన్ అని బెవరేజ్ కార్పొరేషన్ కమిటీకి బదిలీ చేశారు. దాని ద్వారా రుణాలు తేవడానికి సన్నాహాలు చేస్తున్నారు. రెండు నెలల్లో ఆ రుణాలు కూడ విడుదల కావచ్చు. వచ్చే 25వేల కోట్లని ఏ ఖజానాకి దారి మళ్ళించాలని ప్రణాళిక వేశారు.
దశల వారి మద్యపాన నిషేధం అని నిసిగ్గుగా 25సంవత్సరాలకు లిక్కర్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చింది చాలక మళ్లీ అప్పులు తేవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుగా తెచ్చిన నగదుతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం అంటే ఖచ్చితంగా స్వాగతిస్తాం. ఎవరు అడ్డుపడరు. కాని మీరు అటువంటి పనులకు పూనుకోవడం లేదు. మూడుళ్ళైనా అభివృద్ధి చేసింది ఏమి లేదు. మీ అసమర్ధతని కప్పిపుచ్చుకోవడానికి గత టీడీపీ ప్రభుత్వంలో వైఫల్యాలు జరిగాయని తప్పుడు వార్తాలు, నివేదికలు ఇస్తున్నారు. టీడీపీ హయాంలో ఎక్కువ అప్పులు అయ్యాయి అని అంటున్నారు.
సజ్జల రామకృష్ణా రెడ్డి, దువ్వూరి కృష్ణ అప్పు లక్షా 20వేల కోట్లు కూడ లేదని మాట్లాడతారు. ఆర్థిక సంక్షోభంలో శ్రీలంకను మించి పోయింది మన ఆంధ్ర రాష్ట్రం అని మేము అంటే మీరు ఎలా పోలుస్తారు శ్రీలంకతో అని మాట్లాడారు. మీరు మరో దేశంతో పోల్చుకోవచ్చు కాని మేము మరో దేశంతో పొల్చకూడదా? నేడు అప్పులేనిదే రాష్ట్రం ముందుకు సాగని పరిస్థితి. తెచ్చిన అప్పులు ఏమవుతున్నాయో తెలియని పరిస్థితి. పాత చింతకాయ అన్న చందాన నాలుగు సంక్షేమ పథకాలు పట్టుకొని బైబిల్ అది ఇది అని కథలు చెబుతూ వాటిలో కూడ సరిగా ప్రజలకు సహాయం అందించడం లేదు. 17వేలు అని చెప్పి 13వేలు ఇస్తున్నారు, లబ్ధిదారులని తగ్గిస్తున్నారు.
అప్పులని విపరీతంగా చేసి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? అప్పులు మీద పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకు శ్వేత పత్రం విడుదల చేయడం లేదు. మేము జీవోలు, ఆర్బిఐ ద్వారా తెచ్చిన బాండ్లని ఆధారాలుగా చూపిస్తున్నా దాన్ని ఒప్పుకోలేని పరిస్థితిలలో మీరు ఉన్నారు. ప్రతి విషయాన్ని టీడీపీతో పోల్చి టీడీపీ వైఫల్యాలుగా చూపించడం కాదు ఆరోపించిన ఆరోపణలని నిరూపించండి. రాష్ట్రాన్ని నడి సముద్రంలో ముంచేశారు. వీలైనంత దోచుకొనే ధోరణితో డబ్బుని దారి మళ్ళిస్తున్నారు. ప్రతి పక్షపార్టీగా మేము అడిగిన వాటికి మీరు నిజాలని నివృత్తి చేయాలి. మిమ్మల్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక ఎల్లో మీడియా, దుష్టచతుష్టయం అని నానా మాటాలు మాట్లాడుతున్నారు.
మీరు చేసిన తప్పుడు పనులని కప్పిపుచ్చుకోవడానికే సంక్షేమం కోసం అప్పులు తెస్తుంటే ప్రతి పక్షాలు అడ్డుకుంటున్నాయని ఇటువంటి ప్రేలాపనలు చేస్తున్నారు. అమ్మఒడిలో ఎందుకు కోతలు పెట్టారు. జనవరిలో ఇస్తానన్న అమ్మఒడి ఎందుకు ఎగొట్టారు. రోడ్లు విపరీతంగా మరమ్మత్తులకు గురి అవుతున్నా ఎందుకు రోడ్లని వేయడం లేదు. మీరు తేవాలనుకుంతా అప్పులని తేస్తూనే ఉన్నారు మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారో ప్రజలకు స్పష్టం చేయండి. మీరు రాజ్యంగానికి విరుద్ధంగా వెళుతున్నారు. తప్పుడు విధానాలని అవలంబిస్తున్నారు. మీ పరిపాలన వలన మన రాష్ట్ర భవిష్యత్తు అంధకారమవుతుంది, భవిష్యత్తులో రావాల్సిన ప్రయోజనాలు రావు. ఫీజు రీయింబర్స్ మెంట్ సంవత్సరానికి నాలుగు క్వార్టర్లీ ఇస్తామని మూడు క్వార్టర్లీనే ఇస్తున్నారు.
ఉన్నత విద్యని అభ్యసించే వారికి ఫీజు రియంబర్సమెంట్ ని రద్దు చేశారు. ఎవరు పేద ప్రజల సంక్షేమానికి అడ్డుపడుతుంది. మేము ఇస్తున్న సంక్షేమ పథాకాల్ని రద్దు చేసి కొన్నింటికి పేర్లు మార్చి వాటిలో కూడ కోతలు విధించి ప్రజలు నవరత్నాలు సంక్షేమ పథకాలు అని ఇచ్చుకుంటున్నారు. టీడీపీకి అంటే కొత్తగా మీరు ప్రజలకు ఏం ఇస్తున్నారు. సంక్షేమానికి 41శాతం టీడీపీ ఖర్చు చేస్తే మీరు 31శాతం ఖర్చు చేస్తున్నారు. పెట్రోల్, డిజీల్ ధరలు కేంద్ర తగ్గించమన్న తగ్గించకుండా కేంద్రం ధరలు పెంచిందని మాయ మాటలు చెబుతున్నారు. వ్యాట్ అనేది రాష్ట్రం చేతిలో ఉంటుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో వాట్ ధర అమలవుతుంది. వీటన్నిటి మీద ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి.