Suryaa.co.in

Andhra Pradesh

పెత్తందారులతో ప్రయాణం… పేదలతో పోరాటమే జగన్ విధానం

-రాష్ట్ర బడ్జెట్ అంచనాలు పాత సీసాలో పాత సారానే
-బడ్జెట్ పై బుగ్గన కోతలు అంతా ఒక ట్రాష్
-వివేకాను ఒక్కరు కూడా సంస్మరించుకోక పోవడం విడ్డూరం
-తనను కొట్టిన వాడికి, అది చూసి ఆనందించిన వాడికి వడ్డీతో సహా చెల్లిస్తా
-హవ్వ…తన స్థానంలో తాను కూర్చుని పెదవి విప్పకపోయినా అసెంబ్లీ నుంచి సస్పెన్షనా?, ఇదెక్కడి విడ్డూరం?
-నేతలు మాట్లాడిందే రాస్తే కోర్టు ధిక్కరణ ఎలా అవుతుంది?
-ధరల స్థిరీకరణకు మూడు వేల కోట్ల నిధులా?, ఎక్కడ?? ఎప్పుడూ?
-రైతుల ఆత్మహత్యలలో ఆంధ్ర ప్రదేశ్ దే అగ్రస్థానం
-పేదలను ధనవంతులను చేశామని ప్రభుత్వం చెబుతోన్న పేదలింకా ఎందుకనీ అప్పులు చేస్తున్నారు?
-మేకప్ వేసుకు తిరిగే ఆ ఎంపీ ని కోట్లు బొక్కినందుకు తాడేపల్లి ప్యాలెస్ లో గుడ్డలూడదీసి కొట్టారని రాజమండ్రి వాసులే చెబుతున్నారు
-పిఏ, పిఎస్ లను విచారణకు పిలిచిన సీబీఐ , వారికి కూడా నోటీసులను జారీ చేస్తే చేయవచ్చు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

పేదవాడితో ప్రయాణం చేస్తాను… పెత్తందారులతో యుద్ధం చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు శుద్ధ అబద్ధం. డబ్బున్న వారే పెత్తందారులు అనుకుంటే అంబానీ, అదాని ఎవరు?. అంబానీ, అదానీలతోనే జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేస్తున్నారు. పేదలపై ముఖ్యమంత్రి చేస్తున్న పోరాటం కళ్లకు కనబడుతోంది. ప్రజలపై ఈ ప్రభుత్వం దారుణమైన పన్నులను వేస్తోంది. పడిపోతున్న ఆస్తుల విలువలు, పెరిగిపోతున్న ఆస్తి పన్నులను పరిశీలిస్తే, పెత్తందారులతో ప్రయాణం, పేదలపై యుద్ధమే జగన్మోహన్ రెడ్డి విధానమని స్పష్టమవుతుందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా తన నివాసంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఆస్తిపన్నుకు తోడు ప్రజలపై చెత్త పన్ను కూడా విధించారు. రకరకాల పన్నులతో ప్రజలని వేధిస్తున్నారు. రూపాయకు లభించే విద్యుత్ మీటర్ ను నాలుగు రూపాయలకు బిగించి, మూడు రూపాయలు జేబులో వేసుకుంటున్నారు. ఆ మీటర్ల కంపెనీ ఎవరిదో తెలియదు. ఎక్కడికక్కడ దోచుకో, దాచుకో, ఎవరికి పంచకు అన్నదే తమ విధానంగా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో కొంత పంచితే పంచవచ్చు. దోచుకో, దాచుకో స్కీం లో యాక్టివ్ గా ఉంటూ పెత్తందారులతో సహవాసం చేస్తూ, వారికే పదవులను ఇస్తూ వారితోనే పోరాటం చేస్తున్నాను అని అంటే ప్రజలు నవ్వుకుంటారని అన్నారు. పేదవారితో కలిసి పని చేస్తాం… ఇదే మా ఎకనామిక్స్, అదే మా పాలిటిక్స్ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అదే మా పాలిటిక్స్ అని చెప్పడం అర్ధం అయ్యింది. ఎకనామిక్స్ అని చెప్పడం వెనుక మేము ఇలాగే అబద్ధాలు చెబుతాం. మీరు నమ్మాల్సిందే అని అర్థమా అంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు. దాచుకున్న పీఎఫ్ డబ్బులు దోచుకుంటున్నారు. మనం ఖర్చుపెట్టిన డబ్బులు ఎప్పటికీ వెనక్కి వస్తాయో తెలియని అయోమయ పరిస్థితి ఉద్యోగులదని అన్నారు.

ఎక్కువ అప్పులు రాబట్టడానికే అంచనాలు పెంచారు
రాష్ట్ర బడ్జెట్ పాత సీసాలో పాత సారానే. అంతకుమించి ఏమీ లేదు. ఆశల అంచనాలతో బడ్జెట్ ను రూపొందించారు. 13 లక్షల కోట్ల రూపాయలు జి ఎస్ డి పి గా చూపించడం వెనుక, అధికంగా అప్పులను రాబట్టాలనే ఎత్తుగడ కనిపిస్తోంది. అంచనాలను ఇబ్బడి ముబ్బడిగా పెంచి చూపెట్టడం అంతా మాయ అని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు 55 వేల కోట్ల రూపాయలను కేటాయించి, డిబిటి విధానం ద్వారా ప్రజలకు అందజేస్తామనే అబద్దాన్ని కూడా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తాము చెప్పిన అబద్ధాలు ప్రజలు నమ్మాలి అంటే , భగవంతుడి సహకారం కూడా కావాలని అనుకున్నారేమో. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో సింహభాగం 21 వేల కోట్ల రూపాయల నిధులు పెన్షన్ల చెల్లింపులకు కేటాయించాలి. గత నాలుగేళ్లుగా చెల్లించని కళ్యాణమస్తు పథకానికి 200 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ మొత్తము ఇచ్చేది లేదు. ప్రభుత్వం విధించిన నిబంధనలను పరిశీలిస్తే, మహా అయితే 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే చేయవచ్చు. గత ఏడాది ఆసరా ఎత్తివేశారు. ఈ ఏడాది బడ్జెట్లో గారడీ చేయడానికి బహుశా నిధులు కేటాయించారు అనుకుంటా. 55 వేల కోట్ల రూపాయల నిధులను వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా అందజేస్తున్నామని చెబుతూనే, కులాల వారీగా వేరుగా నిధులను అందజేస్తున్నట్లుగా ప్రజలను భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నారని రఘురామకృష్ణం రాజు విమర్శించారు.

జనాభాలో అధిక శాతం ఉన్న కాపులకు 20 వేల కోట్ల రూపాయలు , 18 శాతం ఉన్న దళితులకు 22 వేల కోట్ల రూపాయలు, బీసీలకు కులాలకు సంక్షేమ పథకాల ద్వారా అంద చేస్తున్న సహాయాన్ని, ప్రత్యేకంగా కులాలవారీగా వేరుగా సహాయం చేస్తున్నట్లు చెప్పడం విడ్డూరంగా ఉంది . బీసీలకు బీసీ బంధు, ఎస్సీలకు దళిత బంధు పేరిట సహాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఎస్సీ బీసీలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. ఆ పథకాలను సరిగ్గా అమలు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఇంత పెద్ద మొత్తం నిధులు సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేయవలసిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఒకవైపు వినియోగించుకుంటూనే, రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తామని చెబుతున్న 55 వేల కోట్ల రూపాయలలో కేవలం 14 నుంచి 15 వేల కోట్ల రూపాయలను మాత్రమే తన వాటాగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఈ పథకాల అమలుకు కేంద్రం నుంచి 60 శాతం నిధులను పొందుతూ, వాటికి దొంగ బిల్లులను, యుటిలైజేషన్ సర్టిఫికెట్లను పెట్టి కేంద్ర ప్రభుత్వం పేరు లేకుండానే, అంతా తామే చేసినట్లు చెబుతున్నారని రఘురామకృష్ణం రాజు విమర్శించారు . ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో 60 శాతం నిధులేమో కేంద్ర ప్రభుత్వానివి అయితే, పేరేమో 40% నిధులు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్నిదని తెలిపారు. వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం అమలకు 60 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం భరిస్తుండగా, అంతా తామే భరిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం బుఖాయింపులకు పాల్పడుతోంది. లక్షల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి లభిస్తున్నట్లుగా బడ్జెట్లో చూపెడుతూ, ఆ ఆదాయం లో నుంచి అలా, ఇలా ఖర్చు పెడుతున్నామని అప్పుల అంకెల గారడితో పెనుమాయ తప్పితే ఉన్నది ఉన్నట్టు చూపెడితే వచ్చిన ఇబ్బంది ఏమిటో తెలియడం లేదన్నారు. ఎవరైనా అడిగితే వారిపై కేసులు నమోదు చేసి వేధించడం పరిపాటిగా మారింది.

రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదు. మనవారు కాకపోతే ప్రభుత్వానికి సరఫరా చేసినవారికి డబ్బులు ఇచ్చేది లేదు. రాష్ట్ర బడ్జెట్లో బాకీల ఊసే లేదు. లక్ష యాభై వేల కోట్ల రూపాయల బాకీలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ అప్పులు తీర్చాలంటే ఈ బడ్జెట్ సరిపోదు. సి ఎఫ్ ఎం ఎస్ వెబ్సైట్ పనిచేయదు. వచ్చే ఆదాయం ఎక్కువగా చేసి చూపెట్టడం… చెల్లించాల్సిన డబ్బులను తక్కువగా చేసి చూపెట్టడమనేది ఎన్ని రోజులు. మాయమాటలతో, కుదిరితే తమకాల పరిమితిని అంతా ఏదో రకంగా గడిపేద్దామని చూస్తున్నారు. ఈ వ్యవస్థలను ఎవరు కాపాడుతారనేది అర్థం కావడం లేదు. రాజ్యాంగ పరిరక్షకులైన పెద్దవాళ్లు పట్టించుకోవడం లేదు. జనం ఎన్నుకున్నారని అది వాళ్ళ కర్మ. వారి కర్మానికి వారినే వదిలేస్తే మళ్లీ అటువంటి తప్పు చేయరనే భావనలో కేంద్ర పెద్దలు ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఎక్కువగా అప్పులు ఇచ్చి వదిలేస్తున్నారెమోననే అనుమానం కలుగుతోందని రఘురామకృష్ణం రాజు అన్నారు.

దేశంలోనే అప్పులు చేసే ప్రజలు రాష్ట్రంలోనే ఎక్కువ
దేశంలోనే అప్పులు చేసే ప్రజలు ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువగా ఉన్నారని గణంకాలు చెబుతున్నాయని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రాష్ట్రంలో 168% మంది ప్రజలు అప్పులు తీసుకొని, పన్నులు కడుతున్నారు. ప్రజలను అప్పులపాలు చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. పేదవాళ్లందరినీ ధనవంతుల్ని చేస్తామని మోహన్ రెడ్డి, మనోహరంగా చెబుతుంటే పేదలు ఎందుకు అప్పులు చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. చిన్న మొత్తాలకు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది అంటే పేదవాడు ధనవంతుడైనట్టా?, పేదవాడు మరింత పేదవాడైనట్టా?? అని ఆయన నిలదీశారు.
ఇదే గణాంకాలను చూపెట్టి ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలు ప్రశ్నించాలని కోరారు. జనం వెర్రి వెధవలు మనం చెప్పిన అబద్ధాలను గతంలో నమ్మారు… మళ్లీ చెబుదాం… మళ్లీ నమ్మిద్దాం అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వ్యవహార శైలి ఉంది. నమ్మని వారిని గుర్తించి ఎన్నికలకు రాకుండా అడ్డుకోవాలని భావనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే దుర్మార్గులకే మంచి రోజులులాగా అనిపిస్తున్నాయి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వారిపై ప్రభుత్వ పెద్దలు కక్ష కట్టి తప్పుడు కేసులను బనాయిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలను తుంగలో తొక్కుతున్న జగన్ ప్రభుత్వం
రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. ప్రభుత్వాలేవీ మతపరమైన అంశాలలో జోక్యం చేసుకోవద్దని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఒక మతానికి అనుకూలంగా వ్యవహరిస్తోంది.
ఆ మతానికి డబ్బులు ఇచ్చి అది కట్టుకో… ఇది కట్టుకో అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఈ విధానం మంచిది కాదు. రాజ్యాంగ విలువలు పాటించాలి అని చెప్పిన పాపానికి దొంగ కేసులు నమోదు చేసి అక్రమంగా అరెస్టు చేసి లాకప్ లో చిత్రహింసలకు గురిచేచేసి, ఆ వీడియోను చూసి ఈ ప్రభుత్వ పెద్దలు ఆనందించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

పార్లమెంటులోనూ మేకప్ వేసుకుని తిరిగే వాడు ఎలా ఉంటాడో అందరికీ తెలుసు
తనని కమెడియన్ గా సంబోధిస్తూ, తనకు తానే హీరోనని అనుకునే నల్లగా కాకి మేకప్ వేసినట్లు గా ఉండే ఓ వ్యక్తి ఎలా ఉంటాడో ప్రజలందరికీ తెలుసునని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. పార్లమెంటులోనూ మేకప్ వేసుకొని తిరిగే సదరు వ్యక్తి, గతంలో సాయి రెడ్డి మాట్లాడినట్లుగా ఇప్పుడు నల్లగా కాకి లా ఉండే వాడు మాట్లాడుతున్నాడు. నెత్తిన విగ్గు… పూర్వం గుర్రం, గాడిద గాడు రాసే వాడు. సాయి రెడ్డి రియలైజ్ అయ్యి తన పేరిట రాయవద్దన్నాడు. ఇలా ఎవరు మాట్లాడిస్తున్నారో అందరికీ తెలుసు. వాడు మాట్లాడిస్తాడు… వీడు మాట్లాడుతాడు. లాఠి గుర్తుందా? అని అన్నాడు. తనని కొట్టిన వాళ్లలో వీడు ఉన్నాడా?, ఈ నల్లవాడు కాస్త పొడుగు. వీడికి ఎవరు చెప్పారో, ఆ వీడియో చూసిన వాడే చెప్పాడా?, లేకపోతే ఆ వీడియో చూపెట్టిన వాడు చెప్పాడా?, తనని కొట్టిన మాట నిజమే. రాజమండ్రి భూముల్లో కోట్ల రూపాయలు కొట్టేసినందుకు ఆ నల్లని ఎంపీ ని కూడా తాడేపల్లి ప్యాలెస్ లో గుడ్డలూడదీసి దేహశుద్ధి చేసి నోటు రాయించుకొని మరి డబ్బులు వసూలు చేసినట్టు రాజమండ్రి ప్రజానికమే చెబుతున్నారు. తనను కొట్టారనేది నిజం. లాఠీ గుర్తుందా అంటే గుర్తుంది. గుర్తుపెట్టుకుంటాను. కొట్టిన వాన్ని వదలను… కొట్టించిన వాన్ని వదలను. తాను భాగస్వామ్యం వహించే ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా బాకీ తీర్చుకుంటాను. ఇంటింటికి మంచి చేశామని వై నాట్ 175 చెప్పుకుంటున్నారని మరి అటువంటప్పుడు తాను ఈ ప్రభుత్వాన్ని ఎలా కూల్చగలను. తనపై అక్రమంగా రాజద్రోహం కేసు పెట్టి, అరెస్టు చేయించి చిత్రహింసలకు గురి చేయించారు. నువ్వు తిన్న తన్నులు మర్చిపోయి, వసూలు చేసిన డబ్బులు మర్చిపోయావని రాజమండ్రి వాసులు మాట్లాడిందే చెబుతున్నాను. రేపు అవసరమైతే నలుగురిని వెంటేసుకొని ఈ విషయంపై మాట్లాడితే మాట్లాడు. తాను 1 20 నుంచి 125 సార్లు లాటి దెబ్బలు తిన్నది నిజం. అయినా కొంతమందికి ఇప్పటికీ అనుమానమే… తాను లాఠీ దెబ్బలు తినలేదని… నువ్వే ధ్రువీకరించారు. శరీర రంగు నల్లగా ఉన్న వారందరి గురించి తాను మాట్లాడలేదు. ఆ పనికిమాలిన వాడి గురించిమాట్లాడానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

రేపు మాపో అసలు అప్పులు బయటపడతాయి
అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా ఒక మాయ, బడ్జెట్ పై బుగ్గన కోతలు అంతా ఒక ట్రాష్. రేపు మాపో అసలు అప్పులు బయట పడతాయని రఘురామకృష్ణం రాజు అన్నారు. అసెంబ్లీలో ఎవరిని మాట్లాడనివ్వడం లేదు. తన పార్లమెంటరీ నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తన స్థానంలోనే కూర్చుని, పెదవి విప్పకపోయినా ఆయన్ని అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఈ బోగస్ బడ్జెట్ పై మాట్లాడుతారని భయంతోనే గళం విప్పే శాసనసభ్యులను సస్పెండ్ చేశారు. గవర్నర్ ను ముఖ్యమంత్రి ఎదురు చూసే విధంగా చేశారని టిడిపి శాసనసభ్యులు పయ్యావుల కేశవ్ అన్నారట. ఆయన రాంగ్ గా మాట్లాడితే, అదే వార్త ఈనాడు దినపత్రికలో వచ్చిందట. దానికి ఈనాడు దినపత్రిక యజమాని రామోజీరావు అసెంబ్లీకి పిలిపించాలని ఒక మంత్రి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. అసెంబ్లీలో ఎవరు మాట్లాడడానికి అవకాశం లేకుండా అందరిని సస్పెండ్ చేసి బయటకు పంపించి, అబద్దాలను అలవోకగా చెబుతున్నారు. ధరల స్థిరీకరణ కోసం మూడు వేల కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. ధరల స్థిరీకరణ నిధి ఎప్పుడు, ఎక్కడ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 22 లక్షల మంది రైతులకు 36 వేల కోట్ల రూపాయలతో లబ్ధి చేకూర్చామని పేర్కొనడం విడ్డూరంగా ఉంది.

రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయడం కూడా లబ్ధి చేకూర్చినట్లేనా?. కేంద్ర ప్రభుత్వం, ఎఫ్సీఐ 75% నిధులు విడుదల చేస్తే, ఆ నిధులను కూడా కొన్ని నెలల పాటు వాడుకొని, ధాన్యం విక్రయించిన రైతులకు మూడు నెలలు ఆలస్యంగా చెల్లించడం లబ్ధి చేకూర్చడమేనా? అని రఘురామకృష్ణం రాజు నిలదీశారు. ధాన్యం విక్రయించిన సొమ్ములు సకాలంలో అందకపోవడం వల్ల ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. రైతులకు డబ్బులు ఆలస్యంగా చెల్లించడం వల్లే ఈ దుస్థితి నెలకొంది. రైతులకు ఇచ్చిన సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఉచితంగా ఇచ్చిందా?. రైస్ మిల్లర్లతో మాట్లాడుకుని దోచుకోవలసినంత రాష్ట్ర ప్రభుత్వం దోచుకుందని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేకుండా బయటకు పంపించి, మాట్లాడితే సింహాలు, పులులు అంటుంటారు. ప్రతిపక్ష టీడీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఐదు మందిని తమ వైపు తిప్పుకున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక అసెంబ్లీలో అడుగు పెట్టవద్దని నిర్ణయించుకున్నారు. ఇక మిగిలిన 16 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీలో ఎదుర్కోలేని వారు సింహాలు చెప్పుకోవడం సిగ్గుచేటు. పార్లమెంట్ సమావేశాలలో వెల్లోకి వెళ్లి నిరసన తెలిపిన ఆరు మందిని సస్పెండ్ చేస్తే, స్పీకర్ తో మాట్లాడిన వెంటనే వారిని సభా కార్యకలాపాలకు అనుమతించారు. పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి కేటాయించిన సమయంలో ఆయన ఏమి మాట్లాడిన అనుమతించారు. పార్లమెంటరీ కార్యకలాపాలను చూసి రాష్ట్ర అసెంబ్లీ ఎంతో నేర్చుకోవలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో సాధారణంగా ప్రజా ప్రతినిధులకు మాట్లాడే స్వేచ్ఛ లేదు. అసెంబ్లీలో కూడా మాట్లాడనివ్వకపోవడం దారుణమని రఘురామకృష్ణం రాజు అన్నారు.

మళ్ళీ నోటీసులు ఇచ్చినట్లుగా డ్రామా
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారణకు హాజరు కావాలని సీబీఐ మళ్లీ నోటీసులు ఇచ్చినట్లుగా నీలి మీడియా కథనాలను ప్రసారం చేసింది. అయితే ఆయనకు మళ్ళీ సీబీఐ నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని ఆదేశించలేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఇటీవల ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కూడా నోటీసులు ఇవ్వకముందే ఇచ్చినట్లుగా హడావిడి చేసి డ్రామా ఆడిన తెల్సిందే. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు తీర్పు పెండింగ్లో ఉండగానే సిబిఐ దుందుడుకుగా వ్యవహరిస్తుందనే సంకేతాలను ప్రజల్లోకి పంపడానికి నీలి మీడియా ఈ తరహా కథనాలను ప్రసారం చేసింది. గతంలో పీఏ, పీఎస్ లను విచారణకు పిలిచిన సిబీఐ, వారి పైన వ్యక్తులకు కూడా నోటీసులు వస్తే ఇవ్వవచ్చునని అన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చారన్నది పచ్చి అబద్ధం. ఇంకా ఎవరికైనా నోటీసులు ఇస్తే ఇచ్చి ఉండవచ్చునని పేర్కొన్నారు.

ఢిల్లీ పెద్దలను కలవాలని నిర్ణయించిన సీఎం
ప్రజా సంక్షేమం కోసం హడావుడిగా తమ పార్టీ నాయకులు ఢిల్లీ పెద్దలను కలవాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ కోసం ప్రధానమంత్రి ని, కేంద్ర హోంశాఖ మంత్రిని ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉన్నట్లు తెల్సింది. రైల్వే జోన్ కోసం అయితే రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ ను కలవాలి. కానీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఆయనని కలిసిందే లేదని అన్నారు.

కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కృష్ణారెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలం కొట్టివేయాలని ఆయన తన పిటిషన్ లో కోరారు. ఈ తరహా పిటిషన్లు కోర్టులో చెల్లవు. ఈ తరహా పిటిషన్ల వెనుక ఎవరో పెద్ద వ్యక్తుల హస్తం ఉన్నట్లు అనిపిస్తుందని రఘురామకృష్ణం రాజు అన్నారు.

వివేకాను ఒక్కరు కూడా సంస్మరించుకోక పోవడం విడ్డూరం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి నాల్గవ వర్ధంతి సందర్భంగా ఆయన్ని తమ పార్టీ నేతలు ఒక్కరు కూడా సంస్మరించుకోక పోవడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే ఆయన హత్యకు గురయ్యారు. వివేకా వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి, ఒక ట్విట్ చేసి ఉంటే బాగుండేది. కడప జిల్లాలో కూడా ఆయన సంస్మరణ వేడుకలు నిర్వహించకపోవడం బాధ కలిగించింది. వివేక నాల్గవ వర్ధంతి సందర్భంగా మళ్లీ ఈ తరహా హత్యలు జరగవద్దని కోరుతూ న్యాయపోరాటం చేస్తున్న డాక్టర్ సునీత, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారని రఘురామకృష్ణం రాజు తెలిపారు

LEAVE A RESPONSE