Suryaa.co.in

Andhra Pradesh

మూడున్నరేళ్ల జగన్ పాలనంతా బీసీలను అణచివేయడమే

-ఈనెల 5 నుండి ఇదేం ఖర్మ.. మన బీసీలకు నినాదం నిరసనలు
-మూడున్నరేళ్ల జగన్ పాలనంతా బీసీలను అణచివేయడమే
– కొల్లు రవీంద్ర

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి బీసీలకు అన్యాయం, దగా తప్ప చేసిందేమీ లేదు. నిధులు, విధులు, అధికారాలను సొంత వారికి కట్టబెట్టి.. బీసీలను డమ్మీలను చేశారు. బీసీలకే సొంతమైన సబ్ ప్లాన్ నిధుల్ని మళ్లించారు. బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలపై సొంత వారిని షాడోలుగా నియమించి శాసిస్తున్నారు. బీసీ నేతలకు రాజ్యాంగబద్దంగా సిద్ధించిన అధికారాలను సైతం లాక్కున్నారు. బీసీల్లో తిరుగుబాటు మొదలవ్వడంతో.. ఉద్దరిస్తున్నట్లు కలరింగ్ ఇస్తూ సభలు సమావేశాలకు సిద్ధమయ్యారు. జగన్ రెడ్డి బీసీలకు చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరించడమే ధ్యేయంగా ‘ఇదేం ఖర్మ…. మన బీసీలకు’ పేరుతో మూడు రోజుల కార్యక్రమానికి రూపకల్పన చేశాం.

ఈనెల 5న అనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు తహశీల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందించనున్నాం. 6న అనగా మంగళవారం నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, 7న అనగా బుధవారం జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలతో పాటు కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించనున్నాం. తెలుగుదేశం పార్టీ నినాదం, సిద్ధాంతంతో రూపొందించిన ‘జయహో బీసీ’ నినాదాన్ని కాపీ చేయడంతోనే.. జగన్ రెడ్డి బీసీలకు చేసిందేమీ లేదని స్పష్టమవుతోంది. జగన్ రెడ్డీ… బీసీలకు చేసిన మోసం దగా ఇక చాలు. నీ పాలనలో బీసీలు అణచివేతకు గురైంది చాలు. నాడు.. బీసీ నేతను అంతమొందించి నీ కుటుంబ ప్రస్థానం మొదలైంది. ఇప్పుడు.. నీ అరాచకాన్ని అంతమొందించేందుకు బీసీలు సిద్ధమయ్యారు.

LEAVE A RESPONSE