పరిశ్రమలకు పోయేకాలం వచ్చింది 

దేశం లేదా రాష్ట్రము ఆర్థికంగా సామాజికపరంగా ముందడుగు వేయడం లో పరిశ్రమల పాత్ర కీలకం. సమాజ సంక్షేమం పారిశ్రామిక పురోగతితో సాధ్యపడుతుంది. దేశంలో ఇనుము ఉక్కుతో ప్రశ్రమలతో  ప్రారంభమైన పారిశ్రామీకరణ కొద్ది కాలంలోనే అన్ని రంగాల్లో విస్తరించింది.   స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలో స్వర్గీయ  పండిట్ జవహర్లాల్ నెహ్రూ  పంచవర్ష ప్రణాళికలలో పరిశ్రమలకు ప్రాధాన్యం కల్పించారు.  దేశానికి  ఎన్నో ప్రభుత్వరంగ సంస్థలను నెలకొల్పారు. అలాగే ఖాదీ గ్రామీణ కేంద్రాలను, సిల్క్ బోర్డు, ఖాదీ బోర్డు, కాటన్, రేయాన్, ఉన్ని, జనుము, కుటీర పరిశ్రమలకు  ఊతం ఇచ్చారు.

దేశంలో వ్యవసాయాధారిత, అటవీ ఆధారిత మరియు ఖనిజ ఆధారిత పరిశ్రమలు, తోలు మరియు జౌళీ పరిశ్రమలు అనతికాలంలో రూపొందాయి.    ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ హామీ ఇచ్చారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజి ఇస్తామన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను – విశాఖ రైల్వే జోన్‌, గిరిజన యూనివర్సిటీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక  ప్యాకేజీ  తదితర అంశాల అమలుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.  కానీ ప్రజల ఆశలను వమ్ము చేశారు. చేసిన వాగ్దానాలను అమలు జరపకపోగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తెగనమ్మడానికి మోడీ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం పూనుకుంటోంది.

ఒకవైపు విశాఖ ప్రజలు ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని మొత్తుకుంటుంటే మరోవైపు ప్రభుత్వ రంగాన్ని పునాదులతో సహా పెకిలించివేయడానికి మోడీ ప్రభుత్వం నడుం కట్టింది. సంవత్సరంన్నర కాలంగా విశాఖ ఉక్కు కార్మికులు నిరంతరాయంగా ఆందోళన సాగిస్తూనే ఉన్నారు. రెండుసంవత్సరాలుగా  కార్మికులు ప్రజాసంఘాలు ఐక్యఉద్యమాలు చేస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  లెక్క చేయడం లేదు. బంగారు బాతు లాంటి ఫ్యాక్టరీని కారు చౌకగా అదానీ పరం చేయాలని చూస్తున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. ఉమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా విభజిత ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరగకుండా నివారించేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో నాటి ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ప్రతిపాదించగా బిజెపి బల్లలు చరుస్తూ బలపరిచింది. ఆనాడు బిజెపి ఒత్తిడితో కాంగ్రెస్‌ బిల్లు పెట్టింది.  ప్రత్యేక హోదా ఇస్తే పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతుందన్న ఆశతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న చదువుకున్న యువత మోడీపై నమ్మకంతో ఓటు వేశారు. నేడు మోడీ ఆ నమ్మకాన్ని వమ్ము చేసి వెన్నుపోటు పొడిచారు.

జిల్లాలో పారిశ్రామికరంగం పూర్తిగా పడకేసింది. జిల్లా లో కియా కార్ల ఫ్యాక్టరీ  దీని అనుబంధ సంస్థలు తప్ప కొత్త పరిశ్రమలకు వీలులేకుండా పోయింది . ఉమ్మడి జిల్లాలో పాతిక పరిశ్రమలు పైగా మూతపడ్డాయి. గత ఇరవై సంవత్సరాలలో నిరర్థక ఆస్తులు పెరిగిపోయాయి. గుంతకల్లు స్పిన్నింగ్ మిల్స్, పెనుకొండ లో హెచ్ఏంటి, మారుతీ గోల్డ్ స్టార్, కొడికొండ రిచ్ మ్యాన్ సిల్క్స్  పరిగిలో నిజాం సుగర్స్, హిందూపురం లోని ఫ్లూయిడ్స్  ఫ్యాక్టరీ వందల సిల్క్ రీలింగ్ యూనిట్లు మూతపడ్డాయి.  పట్టు మరియు సిల్క్ రీలింగ్ కోసం కర్ణాటకలోని రాంనగర్ కు వెళ్లాల్సిన పరిస్థితి.  ఉన్న పరిశ్రమలే నిలదొక్కుకోవడానికి అనేక అవస్థలు పడుతున్నాయి.

ఈ తరుణంలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసి, యువతకు ఉపాధి కల్పించే పరిస్థితులు కనిపించడం లేదు. జిల్లా పారిశ్రామిక శాఖలో నమోదయిన పరిశ్రమలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పరిశ్రమలు ఏర్పాటు అయ్యి నిరుద్యోగ యువతకు ఉపాధి దొరుకుతుందన్న ఆశలు అడియాశలు అవుతున్నాయి. పరిశ్రమలు ఏర్పాటు రాక… ఉద్యోగాలు లేక యవత నిర్వేదంలో మునిగిపోతోంది.   2021-22 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఎంస్‌ఎంఇ (సూక్ష్మ,చిన్నతరహా) పరిశ్రమలు వెయ్యి కొత్తవి ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. సుమారు రూ.500 కోట్లు పెట్టుబడులు పెట్టించాలని పరిశ్రమల శాఖ నిర్ధేశించుకుంది. తద్వారా సుమారు పది వేల మందికి కొత్తగా ఉపాధి కల్పించాలని ఉంది.

అయితే ఆచరణలో చూస్తే 33 పరిశ్రమలు మాత్రమే నెలకొల్ప గలిగారు. రూ.4.07కోట్లు పెట్టుబడి రాగా, 179 మందికి ఉపాధి లభించింది.  కొత్త పరిశ్రమలు లక్ష్యంలో పదవ వంతు కూడా రాలేదు. బడ్జెట్ కేటాయింపులు జరుగలేదు.  ఇక పెద్ద, మధ్యతరహా పరిశ్రమలు నాలుగు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. పెట్టుబడి రూ.1233 కోట్లు. ఇప్పటి వరకు ఒక్కటి కూడా పూర్తయ్యే పరిస్థితి లేదు.గత సంవత్సరం  కోవిడ్‌ మహమ్మరి వలన కుంటుపడింది అని చెబుతున్న, ఇప్పడు పరిస్థితి  బాగున్నా ప్రయోజనం లేదు.  కొత్త పరిశ్రమలను ప్రారంభించేందుకు పారిశ్రామికవేత్తలెవరూ ఉత్సాహం చూపటం లేదు. మూడేళ్ల నుంచి  ఇదే రకమైన పరిస్థితితో అనేక మంది యువకులు ఉపాధి లేక అవస్థలు పడుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పాలసీ లేదు. ఇండస్ట్రియల్ పాలసీలో బడుగు బలహీనవర్గాలకు, ఉత్పత్తి కులాలకు చోటు లేదు.  కేవలం కార్పొరేట్,  బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా కన్సల్టెన్సీ కనుసన్నలలో ప్రభుత్వాన్ని  నడుపుతున్నారు. రాష్ట్రము విడిపోయిన తరువాత మైక్రో స్మాల్ అండ్ మీడియం ఇంటర్ ప్రైస్ సెంటర్ లేదు, టూల్ డిజైన్, స్మాల్  ఇండస్ట్రీస్  ఖాదీ విలెజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఆఫిసులు ఉన్నాయా అన్న  సందేహం కలుగుతుంది.  జాకీ ఫ్యాక్టరీ పెట్టడానికి  కమిషన్లు బొక్కింది మీరంటే మీరని  వైసీపీ  తెలుగుదేశం పార్టీలు రోజు పత్రికాముఖంగా ప్రకటనలు గుప్పిస్తున్నారు.

మరోవైపు  బలమైన సంకల్పం లేక, ఇక్కడ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి పెంపుదలపై నాయకులకు చిత్తశుద్ధి లేకపోవడం తో   జాకీ,  అమరాన్  లాంటి పరిశ్రమలు ప్రక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి.  ఇక  ఇసుక మట్టి, సిమెంట్, ఇనుము, రవాణా  ధరలకు రెక్కలు రావడంతో నిర్మాణ రంగం కుదేలైంది. రెండు  సంవత్సరాల క్రిందట చేసిన సివిల్ పనులకు బిల్లులు పాస్ కాలేదు.  అర్బన్ హెల్త్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయం నిర్మాణానికి కాంట్రాక్టర్లు సుముఖత వ్యక్తం చేయడం లేదు.

డాక్టర్ యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక

Leave a Reply