-కాగ్ నివేదిక ప్రకారమే జలవిహార్ బకాయిలు 33.81 కోట్ల రూపాయలు
– మరో 6 కోట్ల 51 లక్షల బకాయిలపై విజిలెన్స్ విచారణ
– నగదును దారి మళ్లిస్తున్నారన్న ఆరోపణలు
– దారిమళ్లించిన నిధులతో కొత్త కంపెనీలలో పెట్టుబడులు
– నగర నడిబొడ్డున ‘నడింపల్లి’ హవా
– పాలకులు ఎవరైనా ఆయన పక్షమే
– సర్కారుకు బకాయిలు ఎగ్గొట్టిన జలవిహార్ యాజమాన్యం
– సీఎంకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం
– అధికారుల అండతో ఇష్టారాజ్యం
– సర్కారు లీజు భూమి బ్యాంకుల్లో తాకట్టు
– దాన్ని చూపించి 56.33 కోట్ల బ్యాంకు రుణాలు
-ఏడాదికి 9.75 కోట్ల ఆదాయం చూపి 56.33 కోట్ల రుణం
– లాభాలు లేని కంపెనీకి అన్ని కోట్ల రుణాలు ఎలా ఇచ్చారు?
– జలవిహార్‌పై పాలకుల ప్రేమెందుకు?
-అధికారుల అండతోనే అడ్డదార్లు తొక్కారన్న కాంగ్రెస్ సీనియర్ నేత బక్క జడ్సన్
-సీబీఐ, ఐటీ, ఈడీలు ఏం చేస్తున్నాయని జడ్సన్ ఆగ్రహం
-బకాయిల వసూళ్లలో సామాన్యుడికో న్యాయం? పెద్దగద్దలకో న్యాయమా?
-ఈడీ విచారణకు జడ్సన్ డిమాండ్
(మార్తి సుబ్రహ్మణ్యం)
నగర నడిబొడ్డున ‘నడింపల్లి’ హవాకు తిరుగులేదు. పాలకులు ఎవరైనా, పార్టీలు ఏవైనా ఆయనకు పెద్ద సమస్య కాదు. ‘రాజు’ గారి ముందు రాజకీయపార్టీలు-అధికారులంతా దిగదుడుపే. అంతా గులాములే. కారణం ‘మామూలే’ హైదరాబాద్ నగర నడిబొడ్డున ‘నడింపల్లి’ పిపిపి పద్థతిలో లీజుకు తీసుకున్నజలవిహార్.. కోట్ల రూపాయలు బంకాయిలు పడినా పాలకులు పట్టించుకోరు. స్వయంగా కాగ్ బకాయిల బాగోతం బయటపెట్టినా అదే బేఖాతరిజం. అధికారులకు ‘గుర్తొచ్చినప్పుడు పంపించే’ నోటీసులంటే, రాజు గారికి అసలు లెక్కే లేదు. ఎందుకంటే అంతా మనోళ్లే కాబట్టి! పైగా అక్కడే అధికార పార్టీ నేతలు పెళ్లిళ్లు, దావత్‌లు చేసుకుంటారు.
రెండు లక్షల రూపాయలు దాటితే క్యాష్ రూపంలో ఏ బిజినెస్ చేయకూడదు. కానీ అది జలవిహార్‌కు మినహాయింపు. ఆ నగదును నడింపల్లి ఎటు మళ్లిస్తున్నారన్నది అటు ఐటి-ఈడీ కూడా పట్టించుకోదు. పిపిపి పద్ధతిలో ఏర్పాటుచేసిన ఈ వాటర్ పార్క్‌కు.. అక్షరాలా 53 కోట్ల 33 లక్షల అప్పులిచ్చిన
బ్యాంకులు, రాజు గారికి తమ స్వామి భక్తి చాటుకున్నాయి. ఎలాగంటే.. పార్క్‌కు ఏడాదికి 9 కోట్ల 75 లక్షలు ఆదాయం వస్తే, బ్యాంకులు మాత్రం ఏకంగా 56 కోట్లు అప్పు ఎలా ఇస్తాయన్న ప్రశ్న అడిగిన వాడు, పాపాత్ముడి కిందే లెక్క. ఎందుకంటే అది ‘రాజు గారి గది’ కాబట్టి! సర్కారుకు కోట్లాది రూపాయల పన్ను ఎగవేసి, దర్జాగా వ్యాపారం చేసుకుంటున్న జలవిహార్ బకాయిల కథ ఇది.
హైదరాబాద్ నగర నడిబొడ్డున, హుస్సేన్‌సాగర్ పక్కనే అందరినీ ఆకర్షించే ఓ వాటర్‌పార్క్ కనిపిస్తుంది. లోపలకు వెళితే అదొక అందమైన అనుభూతి. లోపలికి వెళ్లినవారు తన్మయం చెందాల్సిందే. అదేజలవిహార్. దాని విస్తీర్ణం 12.5 ఎకరాలు. అక్కడికి వచ్చే సందర్శకుల సంఖ్య రోజుకు వెయ్యి మందికి పైమాటనే. వీకెండ్స్, స్పెషల్ డేస్‌లో అంతకు రెట్టింపుమంది. టికెట్ల రూపంలో రోజుకు 3 లక్షలకు పైగా ఆదాయం. ఇతర కార్యకలాపాలపై మరో 8 లక్షల రూపాయల ఆదాయం. అంటే రోజుకు జలవిహార్ యాజమాన్యానికి వచ్చే ఆదాయం 11పైమాటే అన్న మాట.
ఇదంతా అందరికీ కనిపించే దృశ్యాలే. ఇక ఇన్‌కంట్యాక్స్, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలకు కనిపించని మరో కోణం ఉంది. అదేమిటో చూద్దాం. జలవిహార్ పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ పద్ధతిలో ఏర్పాటుచేయబడింది. ఆర్‌జేరావు అనే ఎన్‌ఆర్-అతని మిత్రబృందం, నెక్లస్‌రోడ్‌లో జలవిహార్ ఏర్పాటుచేశారు. నాటి టీడీపీసర్కారు అప్పట్లో దానికి 12.5 ఎకరాలు కేటాయించింది. 2000వ సంవత్సరంలో ఏర్పాటుకావలసిన జలవిహార్, అనేక సమస్యల వల్ల 2006లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 2007, మే 20న అధికారికంగా ప్రారంభమైంది.
ఆ ప్రాజెక్టులోకి ప్రవేశించిన రాజు, అసలు యాజమాన్యాన్ని సాగనంపిన తర్వాతనే అసలు కథ ఆరంభమైంది. సహజంగా ఒక కంపెనీని హక్కు భుక్తం చేసుకోవాలంటే, దానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. కానీ అంత భారీ స్థాయి పెట్టుబడులు లేకుండానే, 80 శాతానికి పైగా ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టి, షేర్‌హోల్డర్లుగా మారడటం మాత్రం కేవలం రాజుకే సాధ్యపడింది.
2020లో కాగ్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ప్రకారం.. రాజుకు చెందిన జలవిహార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి, అప్పటివరకూ చెల్లించాల్సిన 33 కోట్ల 81 లక్షల రూపాయలు ప్రభుత్వానికి కట్టకుండా తప్పించుకుంది. ఇక జలవిహార్ బకాయిల చెల్లింపులపై హైకోర్టు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
జలవిహార్ అధికారిక లెక్కల ప్రకారం.. దాని రోజువారీ ఆదాయం 2.74 లక్షలు మాత్రమే. 2007 నుంచి సంవత్సరానికి 15 నుంచి 18 కోట్ల చొప్పున ఆదాయం దారిమళ్లిస్తున్నారన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ కి చేరిన ఒక ప్రధాన ఆరోపణ. గత 15 ఏళ్ల నుంచి ఈవిధంగా దారిమళ్లించిన నిధులను కొత్త కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారన్నది ప్రభుత్వానికి చేరిన ఫిర్యాదు. పిపిపి పద్ధతిలో ఏర్పాటయిన వాటర్‌పార్క్ ఆదాయం తక్కువ చూపుతూ, పన్నులు ఎగవేసి ఖజానాకు గండికొడుతున్న వైనంపై చర్యలు తీసుకోవాలంటూ, ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత జడ్సన్ డిమాండ్ చేశారు. ఆ మేరకు ఆయన కోర్టులో కేసు కూడా దాఖలు చేశారు.
రోజువారీ క్యాష్ రూపేణా వచ్చే ఆదాయంలో 90 శాతం డబ్బుకు లెక్క చూపకుండా, నగదు రూపంలో దారి మళ్లించి, వాటితో డొల్ల కంపెనీలు సృష్టిస్తున్నారంటూ జడ్సన్ గతంలోనే ఆరోపించారు. ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం, 2 లక్షల రూపాయలకు మించి క్యాష్ రూపేణా లావాదేవీలు నడిపేందుకు అనుమతులు లేని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జలవిహార్ యాజమాన్యం ఫంక్షన్ హాల్స్‌ను అద్దెలకు ఇస్తూ, క్యాష్ రూపంలో నగదు తీసుకోవడం సర్కారు ఖజానాకు గండికొట్టడమేనంటున్నారు.
‘ జలవిహార్‌లో ఏం జరుగుతోందో అధికారులకు తెలుసు. క్యాష్ లావాదేవీల సంగతీ వాళ్లకు తెలుసు. ఈ విషయం వారికి తెలియదనుకుంటే పొరపాటు. అసలు వాళ్లే లీజు హోల్డర్లకు ఎలా తప్పించుకోవాలో, ఏ పాయింట్ మీద కోర్టుకు వెళ్లాలో సలహాలిస్తారు. అధికారులు కఠినంగా వ్యవహరించి నిధుల దారి మళ్లింపు పై విచారణ చేస్తే సర్కారుకు వందల కోట్ల ఆదాయం దక్కుతుంద’ని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జడ్సన్ వ్యాఖ్యానించారు.
ఇప్పటివరకూ జలవిహార్ నుంచి రావలసిన కోట్లాదిరూపాయల బకాయిలను, పర్యాటక శాఖ వసూలు చేయకుండా మౌనంగా ఉందంటే, ఈ వ్యవహారంలో ఎంతమంది ఉన్నతాధికారులు, ఎంతమంది అధికారపార్టీ నేతల ప్రమేయం ఉందో స్పష్టమవుతుందని ఆయన విమర్శించారు. ‘ఒక సామాన్య వ్యాపారి ఒక మున్సిపల్ షాపులకు అద్దె కట్టకపోతేనే ఖాళీ చేయించే అధికారులు, ఏళ్ల నుంచి జలవిహార్ కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో పెడితే, దానిపై ఎందుకు చర్యలు తీసుకోరు? వారితో అధికారులు-ప్రభుత్వానికి ఉన్న మొహమాటం ఏమిటని’ జడ్సన్ ప్రశ్నల వర్షం సంధించారు.
ఇక ప్రభుత్వానికి చెందిన భూమి అయిన జలవిహార్‌ను, పిపిపి పద్ధతిలో తీసుకున్న యాజమాన్యం.. దాని ఆస్తులు ఎక్కువ చూపి బ్యాంకుల నుంచి, 56.33 కోట్ల రూపాయల రుణం పొందడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో, వాటర్ పార్క్ ఆదాయం కేవలం 9.75 కోట్లు మాత్రమే. అయితే దానికి మించి అదనపు ఆదాయం, ఆస్తులు, పనులు జరిగినట్లు తన స్టేట్‌మెంట్‌లో పేర్కొనలేదు. ఏడాదికి కేవలం 9 కోట్ల 75 లక్షల రూపాయల ఆదాయం ఉన్న కంపెనీకి, 56 కోట్లు ఎలా మంజూరు చేశారన్న ప్రశ్నలకు, అటు బ్యాంకుల నుంచి కూడా సమాధానం లేకపోవడం ఆశ్చర్యం.
ఏడాదికి 2 నుంచి 10 లక్షల రూపాయలు మాత్రమే, లాభాలు వస్తున్నట్లు అధికారికంగా చూపుతున్నారు. మరి లాభాలు లేని కంపెనీకి బ్యాంకులు అన్ని కోట్ల రూపాయలు ఎలా రుణాలిచ్చాయి? ఏ ప్రాతిపదికన రుణాలిచ్చాయి? రికవరీ కోణంలో ఏ అంచనాతో అన్నేసి కోట్లు అప్పులిచ్చాయన్న దిశగా.. అటు దర్యాప్తు సంస్థలు కూడా దృష్టి సారించకపోవడం, సహజంగానే అనుమానాలకు తావిస్తుంది. పిపిపి పద్ధతిలో ఏర్పాటయిన జలవిహార్, ప్రభుత్వానికి చెల్లించాల్సిన 6 కోట్ల 51 లక్షల రూపాయలను ఇప్పటిదాకా చెల్లించలేదు. దానిపై విజిలెన్స్ విచారణ జరిగినా చర్యలు శూన్యమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కాగా అసలు హైదరాబాద్‌లో ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్న బడా కంపెనీలు ఎగవేసిన బకాయిల మొత్తం విలువ 272 కోట్ల రూపాయల పైమాటేనట. ఫోరం ఫర్ గుడ్ గవర్నరెన్స్ (ఎఫ్‌జిజి) సంస్థ, ఆర్టీఐ ప్రకారం చేసిన అర్జీకి సర్కారు ఇచ్చిన సమాధానం చూస్తే కళ్లు తిరగాల్సిందే.
అందులో ట్రైడెంట్ హోటల్ 87.86 కోట్లు, అర్బన్ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్ 62.77 కోట్లు, 3 స్టార్ హోటల్ 50.35 కోట్లు, ప్రసాద్ ఐమాక్స్ 27.45 కోట్లు, ఎక్స్‌పోటల్ 15.13 కోట్లు, స్నోవరల్డ్ 15.01 కోట్లు, జలవిహార్ (రాక్ గార్డెన్) 6.51, గోల్ప్ కోర్స్ (శామీర్‌పేట) 5.58 కోట్లు, దసపల్లా 1.08 కోట్ల రూపాయలు 2007, 2009, 2014 సంవత్సరం నుంచి లీజు బకాయిలు ఉన్నట్లు తేలింది.
ఆడిటింగ్ జరిపిస్తున్నాం: ఎండి మనోహర్
జలవిహార్ లావాదేవీలపై ఆడిటింగ్ చేయిస్తున్నామని టిఎస్‌టిడిసి ఎండి మనోహర్ చెప్పారు. జలవిహార్ 8 నెలల క్రితమే తమ కార్పొరేషన్ అధీనంలోకి వచ్చిందన్నారు. యాజమాన్యానికి సంబంధించి కేటాయించిన భూమి వారికి స్వాధీనం చేయడానికి ఐదేళ్లు పట్టిందన్నారు. తమకున్న సమాచారం ప్రకారం 50 లక్షల వరకూ చెల్లించినట్లు తెలిసిందన్నారు. ఏదేమైనా జలవిహార్ లావాదేవీలపై నిశిత పరిశీలన చేస్తున్నామని మనోహర్ చెప్పారు.
నగదు లావాదేవీలు వద్దన్నాం: శ్రీనివాసరాజు
జలవిహార్‌లో జరిగే అన్ని లావాదేవీలు నగదు రూపంలో చేయవద్దని గతంలో పర్యాటక శాఖలో కార్యదర్శిగా చేసిన శ్రీనివాసరాజు చెప్పారు. దానివల్ల ప్రభుత్వానికి నష్టం అన్న విషయాన్ని యాజమాన్యానికి తమ అధికారులు స్పష్టం చేశారన్నారు. అప్పట్లో ఆ మేరకు సర్క్యులర్ కూడా పంపించామని వివరించారు. ఇప్పుడు పర్యవేక్షణ వ్యవహారాలను టూరిజం కార్పొరేషన్‌కు అప్పగించామని శ్రీనివాసరాజు వెల్లడించారు.