Suryaa.co.in

Andhra Pradesh

26 జిల్లా కేంద్రాల్లో జనవాణి కార్యక్రమం

• జగనన్న కాలనీలు, టిడ్కో గృహ సముదాయాల్లో జనసేన సోషల్ ఆడిట్
• నవంబర్ 12, 13, 14 తేదీల్లో జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్ళ పరిశీలన
• విశాఖలో పవన్ కళ్యాణ్ మీద దాడికి కుట్ర చేశారు
• వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించింది
• విశాఖ ఘటనలో సంఘీబావం తెలిపిన ప్రజాస్వామ్యవాదులకు పేరు పేరునా ధన్యవాదాలు
• పీఏసీ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్
• సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ స్వయంగా అర్జీలు స్వీకరించే జనవాణి కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహించాలని నిర్ణయించినట్టు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. గిరిజన జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రెండు ప్రాంతాల్లో నిర్వహించనున్నట్టు తెలిపారు. నవంబర్ 12,13, 14 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్ల వద్ద జనసేన పార్టీ తరఫున సోషల్ ఆడిట్ నిర్వహించనున్నట్టు చెప్పారు.

ఈ కార్యక్రమంలో స్వయంగా పవన్ కళ్యాణ్ పాల్గొననున్నట్లు తెలిపారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలతో పాటు తీసుకున్న పలు కీలక నిర్ణయాలు, ఆమోదించిన తీర్మానాలను వివరించారు. విశాఖ పర్యటన తదనంతర పరిణామాలు, రాష్ట్రంలో కులాల మధ్య వైషమ్యాలు రేపే విధంగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రల మీద రూపొందించిన ప్రత్యేక వీడియోను మీడియా సమావేశంలో ప్రదర్శించారు.

అనంతరం మనోహర్ మాట్లాడుతూ “రాష్ట్రవ్యాప్తంగా నాలుగు విడతలు జనవాణి కార్యక్రమం నిర్వహించాం. తిరుపతి వేదికగా జరిగిన నాలుగో విడత జనవాణి కార్యక్రమంలోనూ విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లాల తదుపరి జనవాణి కార్యక్రమం ఉంటుందని ప్రకటించాం. మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటించనున్న విషయాన్ని కూడా వెల్లడించాం. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నాలుగు విడతల జనవాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై 2781 అర్జీలు పవన్ కళ్యాణ్ స్వయంగా స్వీకరించారు.

సామాన్య ప్రజలు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్యను తీసుకువెళ్తే న్యాయం జరుగుతుందన్న ధైర్యంతో ఎంతో మంది జనవాణి కార్యక్రమానికి తరలివచ్చారు. జనసేన పార్టీకి అందిన అర్జీల్లో 28 ప్రభుత్వ శాఖల నుంచి 1671 అర్జీలు సమర్పించి అక్నాలడ్జిమెంట్లు స్వీకరించడం జరిగింది. విశాఖలో జనవాణి కార్యక్రమం జరిగితే అధికార పార్టీ నాయకుల దాష్టికాలు, ముఖ్యంగా భూ స్కాములు బయటపడతాయన్న ఉద్దేశంతోనే ఆ కార్యక్రమం జరగకుండా కుట్ర పన్నారు.

పార్టీ రాష్ట్ర నాయకత్వంతో చర్చించినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని అర్ధమయ్యింది. ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకునేందుకు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 26 జిల్లాలకు ఉన్న 26 రాజధానుల్లో జనవాణి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించాం. గిరిజన జిల్లాలో మాత్రం ప్రజల సౌలభ్యం కోసం పాడేరు, రంపచోడవరంలలో కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.

కేంద్రం గ్రాంటుని దారి మళ్లించారు
జగన్ రెడ్డి ప్రభుత్వంలో పేదల ఇళ్ల నిర్మాణం పత్రికా ప్రకటనలకే పరిమితం అవుతోంది. జగన్ రెడ్డిని నమ్ముకుని ప్రజలు ఓటు వేశారు. అయితే పేదల సొంత ఇంటి కల మాత్రం నెరవేరలేదు. గడచిన మూడున్నరేళ్లలో కేవలం 8 లక్ష్యాలు మాత్రమే పూర్తయ్యాయి. జగనన్న కాలనీల్లో ఎంపిక చేసిన లబ్దిదారులు ఇళ్లు కట్టుకోలేని పరిస్థితి. టిడ్కో ఇళ్ల వద్ద సైతం కనీస మౌలిక వసతులు కల్పించలేని పరిస్థితి. రహదారులు బాగాలేక కాంట్రాక్టర్లు మెటీరియల్ తోలలేకపోతున్నమన్నా ప్రభుత్వంలో చలనం లేదు.

ఈ పథకానికి కేంద్రం ఇచ్చిన రూ. 4500 కోట్ల గ్రాంటు నుంచి రూ. 1540 కోట్లు ఈ ప్రభుత్వం వివిధ పథకాలకు దారి మళ్లించింది. జననన్న కాలనీలు, టిడ్కో ఇళ్ల వద్ద పరిస్థితులు సమీక్షించి ఒక సోషల్ ఆడిట్ నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. నవంబర్ 12, 13, 14 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. రిటైర్డ్ ఇంజినీర్లు, నిపుణులు ఈ కార్యక్రమంలో మాకు సహకరించేందుకు ముందుకు వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జగనన్న కాలనీ, టిడ్కో గృహ సముదాయాల వద్దకు వెళ్లి ఎందుకు ఇళ్లు కట్టలేకపోతున్నారు.

మౌలిక వసతుల పరిస్థితి ఏంటి? లబ్దిదారులతో మాట్లాడి… 175 నియోజకవర్గాల నుంచి నివేదికలు తెప్పించుకుని వారంలో పవన్ కళ్యాణ్ కి నివేదిక సమర్పించే ఏర్పాటు చేయబోతున్నాం. లబ్దిదారులు చెల్లించిన మొత్తానికి బ్యాంకులకు వడ్డీలు కట్టుకోలేక ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మా నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తారు.

• కలసికట్టుగా వైసీపీ అరాచకాలను ఎదుర్కొంటాం
శనివారం నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కొన్ని సంఘటనల గురించి.. అరాచకపాలనతో సామాన్యులను ఇబ్బంది పెడుతున్న తీరు.. మా నాయకులు, జనసైనికుల మీద ప్రభుత్వం ఎవరూ ఊహించని విధంగా వేధింపులకు దిగడం.. ప్రశాంతంగా ఉండే విశాఖలో జనవాణి కార్యక్రమం చేసుకోవాడానికి వెళ్లినప్పుడు వాళ్లు పెట్టిన ఇబ్బందులు.. రిమాండ్ కి పంపిన 9 మంది మా నాయకుల కుటుంబాలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఈ ప్రభుత్వం చాలా అప్రజాస్వామికంగా.. గొంతు నొక్కే విధంగా వైసీపీ అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ప్రయత్నం చేస్తుంది. జనవాణి కార్యక్రమం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అధికార పార్టీ దాష్టికాలు బయటపడతాయని.. భూ కుంభకోణాలు వెలుగుచూస్తాయన్న ఉద్దేశంతోనే జనవాణి జరగకుండా కుట్ర చేసిందని తెలుస్తోంది. ఈ సంఘటనను రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదులంతా ముక్త కంఠంతో ఖండించారు. ప్రతి ఒక్కరు మా పార్టీ అధ్యక్షులకు సంఘీభావం తెలిపారు. అంతా కలసికట్టుగా ఈ అరాచకపాలనను ఎదుర్కోవాలని నిర్ణయించారు.

• ప్రభుత్వమే లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించింది
వ్యవస్థల దుర్వినియోగం.. ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం కోల్పోయే విధంగా అధికారంలో ఉన్న వారే శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మేము ఆ రోజు సాయంత్రం గం. 4.45 నిమిషాలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటే అంతకు గంట క్రితం జరిగిన సంఘటనలో ప్రతి ఒక్కరినీ ముద్దాయిగా చేర్చేసి మొత్తం 188 మంది మీద కేసులు పెట్టారు. 98 మంది మీద 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేయడం కంటే ఆశ్చర్యం ఏముంది. రిమాండ్ రిపోర్టులో చెత్త బుట్ట మూతను డెడ్లీ వెపన్ కింద తీసుకున్నారు. జెండా కర్ర కారుకు తగిలితే మంత్రి గారి కారు మీద కుట్రపూరితంగా దాడి చేశారని చెబుతున్నారు. ఎయిర్ పోర్టు సెక్యూరిటీ మొత్తం కేంద్ర బలగాలయిన సీఐఎస్ఎఫ్ చేతిలో ఉంటుంది. ఇప్పటి వరకు వారు ఈ ఘటన గురించి ఫిర్యాదు చేయలేదు. ప్రభుత్వ పెద్దల నుంచి ఫోను వెళ్లడం వల్లే విచ్చలవిడిగా ప్రయత్నం చేశారు. విశాఖ ప్రజల్ని భయబ్రాంతుల్ని చేశారు. పవన్ కళ్యాణ్ , మేము బస చేసిన గదుల పక్కన మా నాయకుల్ని ఈడ్చుకెళ్లారో.. ఎంత అరాచకం సృష్టించారో ఒక వీడియో ద్వారా మీకు చూపిస్తాం. ఈ తీరుని అంతా ఖండిస్తున్నాం.

• గర్జనకు సెక్షన్ 30 అమల్లో లేదా?
మరుసటి రోజు పవన్ కళ్యాణ్ కి పోలీసులు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కింద నోటీసు ఇచ్చి.. ఎక్కడా మీటింగులు పెట్టకూడదు, డ్రోన్లు వాడకూడదు అని కట్టడి చేశారు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలిగిన వ్యక్తిగా ఆయన నోటీసులు తీసుకున్నారు. మేము విశాఖ వెళ్లేందుకు 7వ తేదీ టిక్కెట్ తీసుకుంటే 12వ తేదీన మా నాయకులు వెళ్లి కమిషనర్, డీసీపీలను కలిసి లిఖితపూర్వక సమాచారం అందించారు. అప్పుడు పోలీసులు సెక్షన్ 30 అమల్లో ఉన్న విషయాన్ని మా నాయకులకు చెప్పలేదు. అప్పటికప్పుడు ఒక కాగితం తయారు చేసి తీసుకువచ్చి నోటీసు ఇచ్చారు. ఉదయం అధికార పార్టీ స్పాన్సర్ ప్రోగ్రాంగా గర్జన నిర్వహించారు. దానికి నోటీసులు లేవా? దానికి సెక్షన్ 30 వర్తించదా?
పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ కూడా చేయలేదు. ఈ విషయాలన్నింటికీ సంబంధించి రెండు తీర్మానాలు పీఏసీలో చేశాం. విశాఖ ఘటన సందర్భంగా మాకు అండగా నిలబడిన వివిధ పార్టీల పెద్దలు, ప్రజాస్వామ్యవాదులుగా నిలబడిన వ్యక్తులు కలసి సంఘీభావం తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాం. మా జనసైనికుల ఇళ్లకు అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో వెళ్లి భయబ్రాంతులకు గురి చేసి వారి కుటుంబ సభ్యులతో పోలీసులు అవమానకర రీతిలో ప్రవర్తించారు. అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడిన వారందరికీ సంఘీబావం తెలపడంతోపాటు మా అందరిలో మనో ధైర్యం నింపిన పవన్ కళ్యాణ్ కి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కృతజ్ఞతలు చెప్పింది.

• ప్రభుత్వ అవినీతి, అరాచకాల్ని ప్రజలకు వివరిస్తాం
జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అవనీతి, అరాచకపాలనను ప్రజలకు వివరించే అంశాన్ని ఒక బాధ్యతగా ముందుకు తీసుకువెళ్తాం. బాధ్యతగల ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేస్తాం. ఎక్కడా తగ్గే ప్రసక్తే లేదని పార్టీ నాయకులు కూడా ప్రతి ఒక్కరూ పీఏసీ సమావేశంలో బాధ్యత వ్యక్తపర్చడం జరిగింది విశాఖ వేదికగా పవన్ కళ్యాణ్ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి అధికార పార్టీ ఎన్ని కుట్రలు పన్నిందో అంతా చూశారు.
విశాఖలో పవన్ కళ్యాణ్ వాహనం మీద నిలబడి ఒక ఐపీఎస్ అధికారి కార్యక్రమం ఆపేయమని ఒత్తిడి తేవడం ఆశ్చర్యం కలిగించింది. వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ మీద దాడికి కూడా సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్ పర్యటన సాగుతుంటే ఎందుకు లైట్లు తీసేశారు. ఎందుకు ఆయన్ని అంధకారంలో తీసుకువెళ్లాలని చూశారు? ఆయన మీద దాడి జరగాలని, ఉత్తరాంధ్రలో భయబ్రాంతులు సృష్టించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ విధంగా ప్రవర్తించింది.

• పవన్ కళ్యాణ్ని రాజకీయంగా ఎదుర్కోలేకే కుట్ర
రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ప్రభుత్వం ఈ విధంగా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. ప్రజా ప్రయోజనాల కోసం, రాష్ట్రం కోసం నిలబడే పవన్ కళ్యాణ్ ని ఉత్తరాంధ్ర రానివ్వకుండా కుట్ర చేసింది. మంత్రి గారి పీఏ, పోలీసు అధికారి మీద దాడి జరిగిందని మరో అధికారి ప్రెస్ మీట్ పెడతారు. మా నాయకుల్ని పేరు పేరునా పిలిపించి బెల్టుతో కొట్టారు. అధికారం శాశ్వతం కాదు అన్న విషయాన్ని జగన్ రెడ్డి గ్రహించాలి. భవిష్యత్తు ఇలాగే ఉండదన్న విషయం తెలుసుకోవాలి.
అణచివేతకు గురి చేయాలనుకుంటే ప్రజలే తిరగబడతారు. జనసేన నిప్పుతో కాదు మంచి, మానవత్వంతో ఓ మార్పు కోసం, నైతిక విలువల కోసం, కొత్త తరం కోసం ప్రయత్నం చేస్తుంది. పవన్ కళ్యాణ్నా యకుల్లో అదే భరోసా నింపారు. అదే సమయంలో పోలీస్ శాఖను కించపర్చే విధంగా మాట్లాడవద్దని సూచించారు. వారు ప్రభుత్వ పెద్దల ఆదేశాలను మాత్రమే అమలు చేస్తున్నారన్న విషయాన్ని అర్ధమయ్యేలా చెప్పారు” అన్నారు.

LEAVE A RESPONSE