బీజేపీ డ్యామేజీ సరే.. బీఆర్‌ఎస్‌కు మైలేజీ ఏదీ?

– జాతీయ రాజకీయాల్లో బీజేపీని దోషిగా నిలబెట్టిన కేసీఆర్
– బీజేపీని ఢీకొనే మొనగాడన్న ముద్ర
– ట్రాప్‌తో పెరిగిన బీఆర్‌ఎస్ నేషనల్ పొలిటికల్ గ్రాఫ్
-తొలిసారి బీజేపీ అగ్రనేతల పేర్లు బయటకు తెచ్చిన హీరోగా కేసీఆర్‌కు కొత్త పొలిటికల్ ఇమేజ్
– కానీ ఆ స్థాయిలో బీఆర్‌ఎస్‌కు పెరగని పొలిటికల్ మైలేజీ
– కేసీఆర్‌ను అభినందించని బీఆర్‌ఎస్ దోస్తులు
– బీఆర్‌ఎస్‌కు శుభాకాంక్షలు చెప్పని జాతీయ, ప్రాంతీయ పార్టీ నేతలు
– కనిపించని బీజేపీ వ్యతిరేకశక్తులు
– కుమారస్వామితోనే సరి
( మార్తి సుబ్రహ్మణ్యం)

నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. జాతీయ పార్టీ అయిన బీజేపీ ఇమేజీని దారుణంగా డామేజీ చేసింది. నీతి నిజాయితీ అనే మడిబట్టలు కట్టుకునే బీజేపీ అసలు రూపాన్ని, ఈ ట్రాప్ వ్యవహారం బయటపెట్టింది. హైదరాబాద్ వచ్చిన ఢిల్లీ రాయబారుల్లో.. ప్రత్యక్షంగా బీజేపీ నేతలెవరూ లేకపోయినా, లీకయిన ఆడియో టేపులను బట్టి.. వారు బీజేపీ దూతలుగానే నమ్మే పరిస్థితి ఏర్పడింది.

11 రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులను.. విజయవంతంగా ప్రోత్సహించిన బీజేపీ పెద్ద తలల పేర్లు, ఎప్పుడూ బయటకు రాలేదు. కానీ తెలంగాణలో మాత్రం అమిత్‌షా, బీఎల్ సంతోష్ వంటి అగ్రనేతల పేర్లు బయటకు రావడం, కమలానికి కలవరం కలిగించింది. ఈ వ్యవహారం తెలంగాణ సీఎం కేసీఆర్‌లోని వ్యూహ రచయితను, జాతీయ రాజకీయాలకు పరిచయం చేసింది. బీజేపీని ఢీకొట్టిన మొనగాడిగా పేరు తెచ్చి పెట్టింది. ఇది కొత్తగా జాతీయ రాజకీయాల్లో కాలుపెట్టిన కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచేదే. కానీ.. తాజా పరిణామాలు జాతీయ పార్టీగా మార్చిన బీఆర్‌ఎస్‌కు, ఆ స్థాయిలో పొలిటికల్ మైలేజీ తీసుకురాకపోవడమే, టీఆర్‌ఎస్‌గా ఉన్న బీఆర్‌ఎస్ నేతల అంచనాలను తలకిందులు చేసింది.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు రంగంలోకి దిగిన ఢిల్లీ దూతలను ట్రాప్ చేసిన వైనం, జాతీయ రాజకీయాలకు ‘కొత్త కేసీఆర్’ను పరిచయం చేసింది. గతంలో రేవంత్‌రెడ్డిని వ్యూహాత్మకంగా ట్రాప్ చేసిన కేసీఆర్ మేధస్సు, ఒక్క తెలుగురాష్ట్రాలకే తెలుసు. ఇప్పుడు జాతీయ పార్టీ అయిన బీజేపీ దూతలుగా వచ్చిన వారిని కూడా, అదే డైరక్షన్‌లో ట్రాప్ చేసిన కేసీఆర్ వ్యూహం జాతీయ స్థాయికి పాకింది. చర్చనీయాంశమయింది. కానీ ఆ స్థాయిలో ప్రచారం జరగకపోవడంతో, బీఆర్‌ఎస్ వర్గాల ఆశలు ఆవిరయ్యాయి.

దేశంలోనే అత్యంత ధనికపార్టీగా.. విస్తృత యంత్రాంగం ఉన్న బీజేపీని ఢీకొట్టేందుకు, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ సైతం భయంతో నిలువునా వణికిపోతోంది. బలం కోల్పోయి బలహీనమైన కమ్యూనిస్టుల సంగతి సరేసరి. మోదీ సర్కారు ఢీకొన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఇప్పుడు మౌనవ్రతంలో ఉన్నారు. ఢిల్లీలో బీజేపీ పీఠం కదిలించి.. తన సామ్రాజ్యాన్ని పంజాబ్‌కు విస్తరించిన ఆప్ అధినేత కేజ్రీవాల్ సైతం, ఇప్పుడు దూకుడు తగ్గించి బీజేపీ వైపు ఆచితూచి అడుగులేస్తున్నారు.

ఏపీలో అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీ రెండూ.. కమలం కరుణా కటాక్ష వీక్షణాల కోసం, చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నాయి. జాతీయ అంశాలపై ఆ పార్టీలు మూతికి మాస్కు కట్టుకున్న వైచిత్రి. వైసీపీ-టీడీపీ ఒకరికొకరు యుద్ధం చేసుకుంటున్నాయే తప్ప, కేంద్ర విధానాలను విమర్శించేందుకు వణికిపోతున్నాయి. ఆ రెండు పార్టీలకూ బీజేపీని ఎదిరించే ధైర్యం లేదు. ఇలా.. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా, కమలం వైపు కన్నెత్తి చూసే సాహసం చేయని వైచిత్రి.

ఇలా కమలం కత్తికి ఎదురులేని సమయంలో.. బీజేపీని తొడ కొట్టి సవాల్ చేసిన టీఆర్‌ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ స్ధాయి దృష్టిని ఆకర్షించారు. అదే ఊపులో బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో మంతనాలు జరిపిన కేసీఆర్, బీఆర్‌ఎస్ జాతీయ పార్టీకి ప్రాణం పోశారు. పశ్చిమ బెంగాల్ సీఎంkcr-others మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్‌కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, కర్నాటక మాజీ సీఎం, జనతాదళ్ నేత కుమారస్వామి, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, తమిళనాడు సీఎం- డిఎంకె అధినేత స్టాలిన్, ఆప్ అధినేత- ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జెఎంఎం అధినేత హేమంత్ సొరేన్ వద్దకు వెళ్లి బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే పని ప్రారంభించారు.

ఓ శుభముహుర్తంలో బీఆర్‌ఎస్ జాతీయ పార్టీకి ఊపిరిపోసిన కేసీఆర్, జాతీయ రాజకీయాలను తనవైపు మళ్లించుకునే ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రారంభ సభకు.. కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, తమిళనాడు వీసీకె పార్టీకి చెందిన తిరుమావలన్ మాత్రమే హాజరుకాగా, మిగిలిన వారంతా కేసీఆర్‌కు శుభాకాంక్షల సందేశం పంపించారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్ హడావిడి రెండు రోజుల తర్వాత సర్దుకుంది.

హటాత్తుగా, తన పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ పంపించిన దూతలను ట్రాప్ వేసి..TRS-MLAs రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని సంచలనం సృష్టించిన కేసీఆర్‌ను, మిత్రపక్షాలెవరూ అభినందించకపోవడం, బీఆర్‌ఎస్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

నిజానికి కేసీఆర్ చేసింది సాధారణ సాహసం కాదు. బయటపెట్టిన ‘ఢిల్లీ గుట్టు’ సామాన్యమైనదేమీ కాదు. ఆడియో లీకుల్లో బయటపడ్డ నేతలు, ఆషామాషీ స్థాయి వారు కాదు. నిజానికి బీజేపీ రాజకీయాలను నగ్నంగా బయటపెట్టిన కేసీఆర్‌కు, బీజేపీ వ్యతిరేక శక్తుల నుంచి అభినందలు ఆకాశానికి అందాలి. ఆయన వ్యూహానికి బీజేపీ వ్యతిరేక శక్తులంతా సలాము కొట్టి గులాములవ్వాలి.

కానీ ఒక్క కుమారస్వామి మినహా.. ఏ ఒక్క నేత కూడా కేసీఆర్‌ను అభినందించకపోవడం, బీఆర్‌ఎస్ నేతలను విస్మయానికి గురిచేసింది. నిజానికి ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు పంపిన దూతలను అరెస్టు చేసినKCR-brs1 తర్వాత.. ఇప్పటివరకూ కేసీఆర్‌కు సంఘీభావం ప్రకటించిన పార్టీ నేతలంతా, హైదరాబాద్‌కు తరలివస్తారని బీఆర్‌ఎస్ నేతలు ఆశించారు.

కనీసం ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి.. కేసీఆర్ వ్యూహాన్ని ఆకాశానికెత్తి, బీజేపీ బట్టలూడదీస్తారని బీఆర్‌ఎస్ నేతలు ఊహించారు. అయితే.. ఆప్ మంత్రి శిశోడియా మాత్రం, బీజేపీపై ఆడియో టేపులను అస్త్రంగాkcr-in-mumbai సంధించారే తప్ప, బీజేపీ దూతలను ట్రాప్ చేసిన కేసీఆర్‌ను అభినందించకపోవడం కూడా, బీఆర్‌ఎస్ నేతలను ఆశ్చర్యానికి గురిచేసింది.

తాజా పరిణామాలు.. బీఆర్‌ఎస్‌కు జాతీయ స్థాయిలో పొలిటికల్ మైలేజీ తెచ్చి, కేసీఆర్‌ను ‘బీజేపీని ఢీకొనే తిరుగులేని ఏకైక జాతీయ నేత’గా మారుస్తాయనుకున్న అంచనాలు ఫలించకపోవడం, బీఆర్‌ఎస్ శిబిరాన్ని ఆలోచనలో పడవేసినట్టయింది.

Leave a Reply