Suryaa.co.in

Features

జవహరుకు జోహారు!

తలపై తెల్లని టోపీ
ఎదపై ఎర్ర గులాబీ
చేతిలో పావురం
మన జాతికి
అతడే గోపురం..!

భరత జాతి దాస్యశృంఖలాలు
తెగిన ఆ పండుగ రోజున
యావద్దేశం నీవైపే చూసిందయ్యా..
నువ్వే మా నేతవని..
అధినేతవని..
ఆపై విధాతవని..!

నువ్వు గొప్పోడివి..
బాపూ అంతటి
మహనీయుడు మెచ్చినోడివి..
పటేల్ పటిమను
కాదని గాంధీజీ
నీకు కట్టాడు పట్టం
అదే భారత చరిత్రలో
కీలక ఘట్టం..
స్వతంత్ర భారత
తొలి ప్రధానిగా..
ఆధునిక భారత నిర్మాతగా..
నీ కీర్తి అపూర్వం..
ఈ దేశం అభివృద్ధికి దూరమేగా
నెహ్రూకు పూర్వం..!

చిన్న పిల్లాడి నవ్వు
నీ మోములో..
పిల్లలంటే ఇష్టం నీ మదిలో..
జైలు నుంచి కూతురికి
లేఖలు వ్రాసి..
నిరూపించుకున్నావు
నీ వాసి..
పసితనం నుంచే ఇందిరకు
నీ భావాలు నూరిపోసి..
బిడ్డ ప్రధాని కావాలని
కళ్లు కాయలు కాసి..
ఆమె నీ ఆలోచనలు
కాచి వడపోసి..
నీ వారసురాలిగా
ఈ దేశాన్ని ఏలిన
అరుదైన సాహసి..
సమస్యల సహవాసి..!

అన్నీ బాగున్న ఓ చాచా..
నిందలో నిజాలో
నిన్ను అల్లుకుని
ఉన్నాయి చాలా..
దేశవిభజనలో నువ్వు సూత్రధారివని..
కొన్ని తప్పుడు నిర్ణయాలలో
కీలక పాత్రధారివని..
నేడు కాశ్మీర్లో రగులుతున్న నిప్పు నీ తప్పేనని..
వారసత్వ రాజకీయాలకు నువ్వే మూలపురుషుడివని..
ఆపై విలాస పురుషుడివని..
సతీమణి కన్ను గప్పి
సాగించిన లీల
ఇందిరమ్మకు తమ్ముడిని
కూడా ఇచ్చిందని
ఓ పెద్ద గోల..
ఇదంతా వద్దు వద్దని
చెల్లెమ్మ విజయలక్ష్మి
మొర పెట్టుకుందట
నీ మ్రోల..
ఆ కథలు నీ అభిమానులకు
అంతులేని వ్యధలు..
కమలమ్మకు ఎడ తెగని
వ్యాధుల బాధలు..!

ఇవన్నీ ఎలా ఉన్నా..
నీ నాయకత్వం
భారత అభివృద్ధికి
ఇచ్చింది శాశ్వతత్వం..
విపక్షాలకు మింగుడుపడని
నీ తత్వం..కొందరిలో
నీ పట్ల పెంచింది శత్రుత్వం..
ఎవరెలా అనుకున్నా
నీ నవ్వు వసివాడని పువ్వు..
నీ ముద్ర ప్రపంచానికి
ఆమోదముద్ర..
నీ బలమైన నాయకత్వం
అయింది ఈ దేశానికి
మూడు తరాల వారసత్వం..!
రాజుల కాలం
చెల్లినాక కూడా
కొనసాగిన రాచరికం…
ఈ దేశంలో
నీ కుటుంబం
సాధించిన..సాగించిన తిరుగులేని పెద్దరికం..!

సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286

LEAVE A RESPONSE