-దేవాలయ ఆస్తులను దేవాలయానికి అప్పగించడంలో కోర్టులను ధిక్కరించి మరీ 17ఏళ్లుగా గుంటూరు ప్రభుత్వ అధికారుల తాత్సర్యం..!!
-దేవాలయ ఆస్తులను ప్రభుత్వ అధికారులు తక్షణమే దేవాలయాలకు అప్పగించాలి లేనిపక్షంలో అధికారులపై న్యాయ పోరాటం…!!
అమరావతి: బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ గుంటూరు నగరంలో అరండల్‌పేట 7/3 లోని శ్రీ మోహన రంగనాయక స్వామి వారి దేవస్థానం ఆస్తి పాత గుంటూరు నగరంలో వున్న “తమ్మ రంగారెడ్డి నగర్‌లో” వున్న 7 ఎకరాల 16 సెంట్ల దేవాలయ ఆస్తులను ఆక్రమించి, కబ్జా చేసి ప్లాట్లు వేసి అమ్ముకొని ఇల్లు కట్టుకున్న సివిల్ కేసులో 19 మందికి చెందిన దేవస్థాన ఆస్తులను అప్పటి దేవాదాయ శాఖ ఫోర్జరీ సంతకాలతో అక్రమ రిజిస్ట్రేషన్ చేసియున్నది. ఆ 19 రిజిస్ట్రేషన్లను కోర్టు వారు రద్దు చేశారు.
దానికి సంబంధించిన సివిల్ దావలో ఈ దేవాలయ ఆస్తులను తక్షణమే దేవాదాయ శాఖ వారు 19మంది ఆస్తులను స్వాదినపర్చుకోమని గతంలోనే గుంటూరు జిల్లా కోర్టు వారు 2005లో ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం దేవాదాయ శాఖ వారు కోర్టులో ఈ 19మంది ఆస్తుల స్వాధీన E.P లలో ప్రస్తుతానికి 9 మంది ఆస్తులను తక్షణమే సీలు వేసి కోర్టుకు తెలియజేయాలని ఆస్తులను దేవస్థానానికి తక్షణమే అధికారులు అప్పగించాలని “గుంటూరు 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు” వారు ప్రభుత్వ అధికారులకు 11.11.2022 శుక్రవారం నాడు ఆస్తుల స్వాధీన వారెంట్ ఉత్తర్వులు జారీ చేసియున్నారు. గుంటూరు సిటీ సర్వేయర్(నగర పాలక సంస్ద, గుంటూరు) , పోలీసు డిపార్ట్‌మెంట్ తదితర ప్రభుత్వ అధికారులకు కోర్టు వారు ఈ వారెంట్లు జారీ చేసియున్నారు.
కోర్టు ఆదేశాలను రాజకీయ, ప్రభుత్వ ఒత్తిళ్లకు తలోగ్గకుండా అధికారులు తక్షణమే అమలుచేసి ఆస్తులను దేవాలయానికి అప్పగించాలని దేవాలయ భక్త బృందాలు మరియు బ్రాహ్మణ సంఘాలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కోర్టు వారి ఆదేశాలను గత 17 సం.లుగా ప్రభుత్వ అధికారులు కాలయాపనచేస్తూ గౌ.కోర్ట్ వారి ఉత్తర్వులను అమలు చేయకుండా రాజకీయ వొత్తిళ్లతో నాటకాలు వేస్తున్నారని, కోర్టు ఉత్తర్వులు అమలుజేయని పక్షంలో ప్రభుత్వ అధికారులపై కోర్టు ధిక్కరణ కేసులు పెట్టి న్యాయ పోరాటం చేస్తామని శ్రీధర్ అధికారులను హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో శిరిపురపు శ్రీధర్ శర్మ (రాష్ట్ర అధ్యక్షులు), బ్రాహ్మణ చైతన్య వేదిక, దేశరాజు పట్టాభి రామచంద్ర మూర్తి (వంశపరంపర్య ధర్మకర్త), నల్గొండ రాధాకృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు.