Suryaa.co.in

Andhra Pradesh

మా రాజశేఖర్ రెడ్డి ని ఏమీ అనవద్దు

-ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెంపకంపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్స్

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం నాడు తాడిపత్రిలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన వైఎస్ జగన్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన్ను తల్లి సరిగ్గా పెంచలేదని ఓ మహాతల్లి చెప్పింది.. ఆమె ఎలా పెంచిందో అడిగి తెలుసుకుంటాను. ఆమె చెప్పింది కరెక్టే.. ఈయన్ని పెంచడం మా రాజశేఖరరెడ్డికి కష్టం అయ్యింది. వాళ్ల పెంపకం మంచిదే.. కానీ అప్పటికే డైవర్ట్ అయ్యి వాళ్ల తాత రాజారెడ్డి దగ్గరికి ఆయన వెళ్లాడు. తాత రాజారెడ్డి పెంచడంతో సేమ్ టు సేమ్ రాజారెడ్డిలాగే తయారయ్యాడు. మా రాజశేఖరరెడ్డిని ఏమీ అనొద్దు’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అంతటితో ఆగని ఆయన.. గతంలో వివాదమైన కొన్ని కేసులు, మంత్రి కేటీఆర్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ గురించి చేసిన కామెంట్స్‌పైనా స్పందించారు.

తమ్ముడూ కేటీఆర్.. నువ్వు చెప్పిందే కరెక్ట్.. కట్టుబడి ఉండు
 “తమ్ముడూ కేటీఆర్.. నువ్వు చెప్పింది కరెక్ట్.. ఆ కామెంట్స్‌కు కట్టుబడి ఉండు. ఎందుకనీ.. మళ్లీ స్లిప్ ఆప్ ద టంగ్ అంటావ్..?.. కేటీఆర్‌ చెప్పింది అక్షర సత్యమే. కేటీఆర్‌లో లోపల ఆవేశం ఉంది.. ఉన్నమాట అంటే ఏమీ కాదు.. రోడ్లు, కరెంటు లేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అయిపోయింది. రోడ్లు బాగలేకపోవడంతో ఖరీదైన వాహనాల్లో కాకుండా జీపుల్లో తిరగాల్సి వస్తోంది. బహుశా కేటీఆర్.. భయపడి కాదు బాగుండదని మాట మార్చాడు అంతే. తెలంగాణలో ఉండే షర్మిల విమర్శిస్తే ఈయనకు కుతకుత అనదా..?” అని జేసీ వ్యాఖ్యానించారు.
గతంలో జరిగిన బస్సుల వ్యవహారంపై కూడా మాట్లాడారు. “ఊత పదం నీ అమ్మా అన్నానని .. ఈ రోజుకు నన్ను ఇప్పటికీ వదిలిపెట్టలేదు.. మాకు సంబంధించిన బస్సులు, లారీలు కూడా తిరగనివ్వలేదు” అని ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాగా.. గత కొన్ని రోజులుగా జేసీ ఫ్యామిలీ పార్టీ మారుతున్నారని పెద్ద ఎత్తునే పుకార్లు షికార్లు చేశాయి. “అవును.. బీజేపీ వాళ్లు మా ఇంటికొచ్చారు.. నేను వాళ్లింటికి వెళ్లలేదు. ఐదు పార్టీల పెద్దలు నాకు టిక్కెట్ ఇస్తారు.. అయినా సరే నాకేమీ వద్దు..” అని జేసీ చెప్పుకొచ్చారు.

‘ప్రబోధానంద ఆశ్రమం కేసులో ఎస్పీ అనే దేవుడి దగ్గరికి నేను వెళ్లాను. ఆయన చేతుల్లో ఏమిలేదు.. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర ఫైల్ ఉంది. తాడిపత్రి నాయకులు చెప్పిన వారిపైనే కేసులు పెడుతున్నారు. 46 మందిలో 35 మంది ముస్లింలే. ఇంత దారుణమా.. ఈ కథేంటో సజ్జలే చెప్పాలి. సజ్జలా ఏదో ఒక రోజు దీనికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. పెద్దవడగూరు ఎస్ఐ అత్యుత్సాహం చూపుతున్నాడు. వైఎస్సార్ పార్టీ డ్రస్ వేసుకున్నావా ఏంటి..? తగ్గించుకో.. లేకుంటే జనం తిరగబడుతారు’ అని జేసీ వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడారు.

LEAVE A RESPONSE