నిన్ను నువ్వే నమ్ముకో..
నిన్ను నువ్వే ప్రశ్నించుకో..
నిన్ను నువ్వే శోధించుకో..
అంతిమంగా
నిన్ను నువ్వే మార్చుకో..
ఇదే జిడ్డు కృష్ణమూర్తి మతం
నాకైతే సమ్మతం..
నీ అభిమతమే నీ మతమైతే
నువ్వే దేవుడివి..
అంతకు మించి
నిజమైన మనిషివి..!
జగద్గురు స్ధానం..
కోట్లాది రూపాయల సంపద..
ఇవన్నీ తృణప్రాయమై…
మనిషే తన మతమైన..
గురు కృష్ణ…
ఎంతటి ఒత్తిడులకు
లొంగని ధీమూర్తి..!
నీ హృదయపు లోతుల్లో
జరిగేదే అసలైన విప్లవమని
నీలో పరివర్తన..
నీ రుజువర్తన..
జరిగే వరకు
ఈ విధ్వంసం ఇలాగే..
ఈ హింస అలాగే..
ఇదే జిడ్డు నీతి..
అదే రీతి..కృష్ణ కృష్ణా..!
నిత్య ప్రశాంతమైన
ఆ వదనం వెనక
ఆలోచనలు నిండిన
లోతైన మస్తిష్కం..
అనిబిసెంటునే ఆకట్టుకున్న బుడతడు..
ఆమే కట్టబెట్టిన జగద్గురు
స్థానాన్ని వద్దనుకున్న
మనసా ధీరుడు..
వచన..రచన ఆయుధాలై
తనతో తానే
యుద్ధం చేసిన వీరుడు..
ఈ జగద్గురుడు..!
తాను వద్దనుకున్న బిరుదు
తన పరమైనా…
తన బోధనలు
శిష్యులకు వరమై..
గురుస్థానమే తన సొంతమై..
ఆయన తత్వమే
ఎందరికో ప్రశాంతమై..
అదే ఒక మతమై!
మతమైనా.. రాజకీయమైనా..
సమాజమైనా…
కావేవీ మార్పునకు హేతువు..
నీ అంతరంగమే సేతువు…
అందులోనే నీ ప్రశ్నలకు
జవాబులు శోధించు…
అనుకున్న మార్పు సాధించు..
నువ్వు నమ్మినదే బోధించు..!
ఆదర్శాలు..ఆశయాలు..
సిద్ధాంతాల రాద్ధాంతాలు..
ఈ చట్రాలలో..ఆ చట్టాలలో
మనిషిని బంధించినా..
ఓ జనం..
లేదయ్యా ప్రయోజనం..
నీపై నీ అవగాహన..
నీకు నువ్వే చేసుకునే బోధన
నీ హృదయ స్పందన..
అదే అసలైన పరివర్తన!
సమస్య..సమాధానం
వేరు కావు..
సమస్యలోనే సమాధానం..
ఇలా చెప్పిన
జిడ్డు కృష్ణమూర్తి
బోధనలే నీ చుట్టూ
పరిభ్రమించే
ఎన్నో ప్రశ్నలకు
తిరుగులేని సమాధానం..
అలాంటి ఆచార్యునికి
శిరసా వందనం!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286