– పోస్టింగుల కోసం మరీ ఇంత పరాధీనమా?
– క్షమాపణలతో సరిపెడితే ఎలా ?
– అప్పటి ఐఏఎస్‌ల ఆత్మాభిమానం ఏమయింది?
– తెలుగు రాష్ట్రాల్లో వర్థిల్లుతున్న ‘జీహుజూరిజం’
( మార్తి సుబ్రహ్మణ్యం)
జ్ఞానము-దంతము వచ్చినప్పుడు బాధ పెడుతుందని అప్పుడెప్పుడో యండమూరి వీరేంధ్రనాధ్ నవలలలో చదివినట్లు గుర్తు. కానీ మన తెలుగు ఏఐఎస్-ఐపిఎస్‌లకు ఆ రెండూ వచ్చి దశాబ్దాలయినా, ఇంకా బాధ పడటం మాత్రం అలవాటుగా మారినట్లుంది. అయితే అదేమో శారీరక మార్పులో భాగంగా, ప్రకృతిపరంగా వచ్చిన బాధయితే, ఇది తమంతట తాము కొనితెచ్చుకున్న బాధ. అదే తేడా. మిగిలినదంతా ‘షేమ్’ టు ‘షేమ్’. ఏపీ హైకోర్టులో శిక్షలుపడ్డ ఎనిమిది ఐఎస్‌ఎస్‌లతోపాటు.. ఇంకా శిక్షలు పడని అనేకమంది ఐఎఎస్-ఐపిఎస్‌లు పడుతున్న బాధలు కూడా షేమ్ టు షేమ్!
పాలక ప్రభువులు ఏ పోస్టింగు ఇస్తే అందులో చేరిపోయి, తమ మానాన తాము పనిచేసుకుని వెళ్లడం ఒక రకం. అలా కాదు.. నాలుగుచేతులా సంపాదించే పోస్టింగు కావాలనుకునేవాళ్లయితే, పాలకులు చెప్పింది చేసి జీహుజూరనడం ఇంకో రకం. అసలు.. ఇవన్నీ కాదు. మీరు చెప్పేది కుదరదు. అది రూల్సుకు విరుద్ధం. నేను చచ్చినా ఆ పనిచేయను. కావాలంటే నన్ను ట్రాన్స్‌ఫర్ చేసినా నాకేమీ బాధలేదని కుండబద్దలు కొట్టడం మరో రకం.
ఇవన్నీ కాకుండా.. అయ్యగారు చెప్పినవన్నీ చేయకుండా, మధ్యలో తన ఐడియాలజీని చొప్పిస్తూ ఆయన గారి మూడు చూసి నచ్చచెప్పడం, కుదరకపోతే మధ్యేమార్గంగా వెళ్లడం, ఆ క్రమంలో తామూ బాగుపడటం ఇంకో రకం. ఇది లౌక్యం తెలిసిన వారు చేసే పని. ఇలాంటి లౌక్యులు ఏ గవర్నమెంటు ఉన్నా పాలకుల వద్ద పాతుకుపోతారు. గతంలో చంద్రబాబు పేషీలో పనిచేసిన అధికారుల మాదిరిగా అన్నమాట.
అలాకాకుండా..పైన నాకు ‘ప్రభువు దయ’ ఉంది కాబట్టి..తమకేం జరిగినా ప్రభువు చూసుకుంటాడులేనని, మిగిలిన వ్యవస్థలన్నీ ఆయన ముందు బలాదూరేనన్న అహంకారంతో విర్రవీగే అతి విధేయులు మరో ప్రత్యేక బాపతు. ఐఏఎస్-ఐపిఎస్‌లలో ఈ తరహా అధికారులు ఎవరి పాలనలోనయినా మనకు దర్శనమిస్తుంటారు.
కానీ.. కొన్నాళ్లు జైలు శిక్ష అనుభవించి మళ్లీ పోస్టింగులు తెచ్చుకున్న వాళ్లు కూడా… ఫలానా కేసు బెంచిమీదకు వచ్చినప్పుడు, ఫలానా జడ్జిలు ఉండటానికి వీల్లేదు. మీరు చెబితే మేం చేయాలా? మీరు ఆర్డరేస్తే మేం ఇంప్లిమెంట్ చేయాలా? మాకు మా సీఎం ఫీలింగ్స్ ముఖ్యం. ఆయన హర్టయితే మేం తట్టుకోలేం అని కోర్టులతోనే యుద్ధానికి దిగే స్పెషల్ క్యాటగిరి మరొకటి. ఇప్పుడు ఏపీలో… ఇంకా సూటిగా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ‘స్పెషల్ క్యాటగిరి’ అధికారులే మనకు దర్శనమిస్తున్నారు. వీళ్లే ఐఏఎస్ వ్యవస్థను ‘అయ్యా యస్’ వ్యవస్థగా మార్చేస్తున్నారన్నది సత్తెకాలపు సత్తయ్య ల ఆవేదన, ఆందోళన.
ఏపీలో ఎనిమిది ఐఏఎస్ అధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. క్షమాపణ చెప్పినందున, జైలు శిక్ష రద్దు చేసి దాని బదులు సంక్షేమశాఖల హాస్టళ్లకు నెలకోసారి వెళ్లి, తమ
సొంత ఖర్చులతో సామాజిక సేవ చేయాలి. – ఇదీ సీనియర్ ఐఏఎస్ అధికారులయిన వై. శ్రీలక్ష్మి, బి.రాజశేఖర్, ఎం నాయక్, గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజాశంకర్, వి.చినవీరభద్రుడు, జె.శ్యామలరావు, జి.విజయ్‌కుమార్‌లకు ఏపీ హైకోర్టు విధించిన శిక్ష. ఆ మేరకు వారు ఏ జిల్లాల్లో సేవచేయాలో కూడా నిర్దేశించింది.
సుత్తి లేకుండా దేశంలో సంచలనం సృష్టించిన ఈ తీర్పు సారాంశమిది. హైకోర్టు అలాంటి విలక్షణ, సంచలన తీర్పు ఎందుకు ఇచ్చిదంటే… ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాలలో గ్రామసచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలు పెట్టవద్దని హైకోర్టు 2020 జూన్‌లో ఆదేశించింది. అయినా అధికారులు తొలగించలేదు. దానితో కోర్టుధిక్కరణ కేసు నమోదయింది. ఆ తర్వాతే దిద్దుబాటుకు దిగారు. ఆగ్రహించిన హైకోర్టు అందుకు బాధ్యులయిన ఎనిమిదిమంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష విధించింది. దానితో జైలుకెళితే పరువు(?)పోతుందని భయపడిన సదరు అధికారులు, మీ బాంచెన్.. కాల్మొక్తా అనేంతవరకూ వెళ్లారు.
ఈ ఎనిమిది మంది అధికారుల్లో ఆల్రెడీ జైలుశిక్ష అనుభవించిన ఓ నీతి నిజాయితీపరురాలు, పులుకడిగిన ముత్యమయిన అధికారిణి కూడా ఉన్నారు. సదరు అధికారిణే ఫలానా జడ్జి, ఫలానా కేసుల్లో ఉండటానికి వీల్లేదని వాదించారు. అలాంటి నిస్వార్ధ అధికారిణి ప్రతిభ కేంద్రానికి వివరించి, పక్క రాష్ట్రం నుంచి తెప్పించుకున్నారు. అది వేరే విషయం. చల్లబడిన న్యాయమూర్తులు, సరే.. అలాగయితే మీరు ఎనిమిది జిల్లాల్లోని సంక్షేమ హాస్టళ్లకు నెలకోసారి వెళ్లి సేవ చేయమని ఆదేశించారు.
చిన్నప్పుడు స్కూల్లో మాస్టారు నలుగురిలో నిలబెట్టి గోడకుర్చీ వేయిస్తే సిగ్గుతో చచ్చిపోయేవాళ్లం. చెప్పులు లేకుండా స్కూలు గ్రౌండ్‌లో గంటసేపు నిలబెట్టిస్తే, పొద్దునే తోటి వాళ్ల ముందు ముఖం ఎలా చూపించాలని చితికిపోతాం. తప్పు చేసిన వాడిని హెడ్మాష్టరు అందరి ముందు తోలు తీస్తే సగం చచ్చిపోయే వాళ్లం. ఇప్పుడు హైకోర్టు ఆ ఎనిమిదిమంది ఐఏఎస్ అధికారులకు విధించిన శిక్షకూ.. చిన్ననాటి చితికిన మన సిగ్గుకూ పెద్ద తేడా ఏమీలేదు. మన చిన్నప్పుడు ఎవరైనా కోర్టుకెళితే వాళ్లను వింతగా-విచిత్రంగా చూసేవాళ్లం. అసలు శిక్ష పడితే వారిని వెలివేసేంత పనిచేసేవాళ్లు. అప్పటి అధికారులు కూడా కోర్టు ఒక్కమాట అంటేనే సిగ్గుతో చితికిపోయేవాళ్లు. కోర్టు మెట్టెక్కితే సగం చచ్చినట్లు లెక్క అనుకునే వాళ్లు.
అదంతా సత్తెకాలపు సత్తయ్యల కాలం. ఇప్పుడు అది అధికారులకు అలవాటయింది. సాక్షాత్తూ డీజీపీలు, సీఎస్‌లు, ముఖ్య కార్యదర్శులు కోర్టు బోనెక్కడం కామనయిపోయింది. ఇక కలెక్టర్లు, ఎస్పీల హాజరుకయితే లెక్కే లేదు. రోజూ చచ్చేవాడిని ఓదార్చడం ఎందుకన్నట్లు మారింది. వారు కూడా ఈ నగుబాటుపర్వానికి పెద్దగా సిగ్గుపడుతున్నట్లు లేదు. కానీ, వారి వద్ద పనిచేసే ఉద్యోగుల ముందు మాత్రం పలచనయిపోతున్నారు. ‘రోజూ కోర్టు మెట్లెక్కి అక్షింతలు వేయించుకునేవాళ్లు కూడా, మాపై పెత్తనం చేస్తున్నారన్నట్లు’ ఉంటాయి కింది స్థాయి ఉద్యోగుల చూపులు. ఆ చూపుల్లో అంత అర్ధం ఉంది మరి!
నిజమే. ఈ సిగ్గుమాలినతనానికి, నగుబాటు పర్వానికి వారి బాధ్యత లేదు పాపం. పాలకులు చెప్పింది చేయడమే వారి పాపం. చట్టానికి, రాజ్యాంగానికి వ్యతిరేకమయిన నిర్ణయాలు తీసుకునే పాలకులకు జీహుజూరనడమే వారి ప్రస్తుత అవమాన పర్వానికి అసలు కారణం. ప్రస్తుత హైకోర్టు తీర్పునకు కారణమయిన, స్కూళ్లలో నిర్మాణ వ్యవహారాలను అధికారులు అప్పట్లోనే అడ్డుకునే అవకాశం ఉంది. కానీ ఆ సాహసం చేయలేకపోయారు. కారణం పైవాడిని చూసి భయం.
ఒకవైపు ఆ ‘పైవాడి’ దయవల్లే బోలెడుమంది అధికారులు జైలుపాలయ్యారని తెలిసినా, ఈ ‘జీహుజూరిజం’ ఏమిటో అర్ధం కాదు. బహుశా… జైలు శిక్ష పడిన మేడమ్ గారికి మళ్లీ మంచిపోస్టింగ్ ఇచ్చారు కాబట్టి, కాలం ఖర్మం కలసివస్తే రేపు ఆవిడ సీఎస్ కూడా అవచ్చు కాబట్టి, రేపు తాము జైలు కెళ్లినా పైవాడు మేడమ్
మాదిరిగా, తమనూ కరుణిస్తారన్న భరోసానే వారి తెగింపునకు కారణం కావచ్చన్నది సెక్రటేరియేట్ వర్గాల విశ్లేషణ. గతంలో డీజీపీగా పనిచేసిన గౌతం సవాంగ్, సీఎస్‌గా పనిచేసిన నీలం సహానీ ప్రత్యక్షంగా హైకోర్టు
మెట్లు ఎక్కినా, ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ సుప్రీంకోర్టు విచారణకు వర్చువల్‌గా హాజరయినా.. కోందసు ఐఏఎస్-ఐపిఎస్‌లలో పాలకుల భజన తగ్గకపోవడమే ఆశ్చర్యం.
అసలు ఐఏఎస్-ఐపిఎస్‌లకు ఏ పోస్టులో ఉన్నా వారి జీతాలు వారికొస్తాయి. కాకపోతే కొన్ని అదనపు సౌకర్యాల్లోనే తేడాలుంటాయి. అందువల్ల ఎక్కడ పనిచేసినా వారికొచ్చిన నష్టమేమీ లేదు. ఉదాహరణకు సీనియర్ ఐఏఎస్ ఎల్వీ సుబ్రమణ్యానికి సీఎస్ పోస్టు ఎప్పుడో రావలసి ఉంది. కానీ ఆయనకంటే జూనియర్లకు చాలామందికి సీఎస్ ఇచ్చారు. అందుకాయనేమీ ఫీలయి కోర్టుకెళ్లలేదు. ఇచ్చిన పోస్టింగులోనే పనిచేశారు. చివరాఖరకు తనను అవమానకర రీతిలో.. సీఎస్ పని నుంచి అర్ధంతరంగా దించేసిన తర్వాత కూడా ఎల్వీ కోర్టుకెక్కలేదు. ఇచ్చిన పోస్టింగు తీసుకుని, లాంగ్‌లీవ్ పెట్టి వెళ్లిపోయారు. ఆత్మాభిమానం ఉన్నవాళ్లు చేసే పని అది. ఆయనొక్కడే కాదు. ఉమ్మడి రాష్ట్రంలో అనేకమంది ఏఐఎస్‌లు తమ అభిప్రాయాలు నిర్మొహమాటంగా చెప్పేవారు. ఐఏఎస్-ఐపిఎస్ అసోసియేషన్‌కు గొప్ప చరిత్ర ఉండేది. ఇప్పుడవి పనిచేస్తున్నాయో, లేవో కూడా తెలియని పరిస్థితి. కానీ తెలివైన కొందరు ప్రవీణులు ‘అంతకుమించి’ ప్రతిభ కనబరచి.. పైవాడికి తమ ‘ప్రావీణ్యాన్ని’ ప్రదర్శించి పెద్ద పోస్టింగుల కోసం పాకులాడే, బానిసత్వం వల్లే అధికారులకు ఈ కష్టాలు, కన్నీళ్లని బుద్ధిజీవుల విశ్లేషణ.
ఒక్కమాట. ఎనిమిది మంది ఐఏఎస్‌లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం. మిగిలిన అధికారులకు అది కనువిప్పు. కానీ.. సదరు అధికారులు క్షమాపణ కోరిన వెంటనే కోర్టు కరుణించడంపై మాత్రం, సామాన్యుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వారు చేసింది నేరమయినప్పుడు శిక్ష కూడా అందుకు తగినట్టే ఉండాలి తప్ప, ఐఏఎస్‌లన్న ఒకే ఒక కారణంతో జైలు శిక్ష మినహాయింపు ఇవ్వడం భావ్యంగా లేదన్నది జనాభిప్రాయం. గతంలో కూడా అనేకసార్లు ఇలాగే అధికారులకు శిక్షలు విధించకుండా సారీతో సంతృప్తి చెందారన్నది కోర్టులను ప్రేమించేవారి మరో అసంతృప్తి. ఒకసారి జైలు శిక్ష విధిస్తే.. మిగిలిన అధికారులు భవిష్యత్తులో ఒళ్లు దగ్గరపెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారన్నది బుద్ధిజీవుల వాక్కు.రేపు ఎవరైనా శిక్షకు గురయిన వారు తమనూ ఈసారి క్షమించాలి. మేం కూడా ఐఏఎస్‌ల మాదిరిగా సేవ చేస్తామని అభ్యర్థిస్తే పరిస్థితి ఏమిటి అన్నది మరో ధర్మసందేహం.