– గుళ్లలో ‘వీఐపీల విజిటింగుల’ గోసపై తిరుగులేని తీర్పు
– తెలుగు రాష్ట్రాల వీఐపీలకు మరి తెలివొస్తుందా?
– ‘భక్తుల ఇబ్బందుల జాబితా’లో జడ్జిలు కూడా
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘గుడికి దేవుడే వీఐపీ. దైవదర్శనానికి వచ్చే వీఐపీలకు,సామాన్య భక్తుల మధ్య వివక్ష చూపవద్దు. ఏ పరిస్థితిలోనూ వీఐపీల దర్శనాల వల్ల సామాన్య భక్తులు, పౌరుల హక్కులకు భంగం కలగవద్దు. వారు ఇబ్బంది పడవద్దు. సామాన్యుల దర్శనానికి అసౌకర్యం కలిగించరాదు. దీనికి ఆలయ అధికారులదే బాధ్యత. మతంపై నమ్మకం ఉన్నవారు గుళ్లకు వస్తుంటారు. అలాగే వీఐపీలూ భక్తుల మాదిరిగానే వస్తుంటారు.రద్దీగా ఉండే ఆలయాల్లో వీఐపీ సంస్కృతితో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. వీఐపీల
దర్శనాన్ని పదినిమషాల్లో ముగించాలి. వారితో వచ్చే సిబ్బందిని క్యూ మార్గంలో పంపించాలి’
– ఇది మనం చిన్నప్పటి నుంచి గుళ్లలో వీఐపీల హడావిడి చూసి మనసులో అనుకుని, నోటితో తిట్టుకునే మాటలే. మరిప్పుడు చిన్నప్పటి మాటలు ఎందుకు గుర్తుకొచ్చాయనుకుంటున్నారా? యస్. మన కలలో కనిపించేవి, కోరుకునేవి తెల్లారి జరిగితే అదో వింత అద్భుతం. కదా?! ఇంకా.. మనం కోరుకున్నవి కోరుకున్నట్లు జరిగితే మహా అద్భుతం.
అరే.. నేను అనుకున్నదే జరుగుతోందే?! అందుకు ఆయనకు హేట్సాఫ్ చెప్పాలనుకుని.. వీలుంటే తన కల నెరవేర్చిన ఆ మహానుభావుడి ఫోన్ నెంబర్ సంపాదించి.. సార్సార్.. మరేమో.. నేనేమో.. రాత్రేమో… అని, తన కలల వృత్తాంతం అంతా సదరు మహానుభావుడికి నాన్‌స్టాప్‌గా వినిపించి, చివరాఖరకు థ్యాంక్సండీ. మీ మేలు మర్చిపోను అని పెట్టేస్తాం. కదా…అంతే కదా? అంతే కదా?
ఎగ్జాట్లీ.. తమిళనాడు చైన్నై హైకోర్టు మధురై ధర్మాసనం సరిగ్గా ఇలాంటి తీర్పే ఇచ్చింది. అది కూడా జస్ట్ రెండ్రోజుల క్రితం. అదే ఇది! అందుకే అందరికీ ఇంత యమానందం!! వీఐపీల వల్ల సామాన్య భక్తులు దతాబ్దాల నుంచి అనుభవిస్తున్న కష్టాలపై జస్టిస్ ఎంఎస్ సుబ్రమణ్యం ఇచ్చిన తీర్పు.. సదరు వీఐపీల చెంప, వీపుపై ఒకేసారి చెర్నాకోలు లాంటివే. లేకపోతే.. వీఐపీలు గుళ్లకు వస్తే ఎంత హడావిడి? ఎంత కత? ఎన్ని ఓవరాక్షన్లు? చూడలేక భక్తులకు తిట్టుకోవడమే మిగిలేది.
ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాష్ట్ర మంత్రులు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న పెద్ద పెద్ద ఆసాములు.. బోర్డు మెంబర్లు, వారి బంధుగణం, చివరాఖరకు హైకోర్టు-సుప్రీంకోర్టు జడ్జిలు, చీఫ్
జడ్జిలు గుళ్లకు దర్శనానికొచ్చారంటే ఇక భక్తులు చచ్చారే! గంటల తరబడి వారికి దర్శనాలు, పూర్ణకుంభస్వాగతాలు, పూలదండలు, ప్రసాదాల కిట్లు, వారిని గెస్టుహౌసు దాకా తోడ్కొని స్వామివారికి సేవచేసేంత హ డావిడి.. చూసే వారికి రోత.
పాపం ఏమాటకామాట. ఏపీ సీఎం జగనన్న ఒక్కరే వీరందరిలో మినహాయింపు. ఆయన ఎప్పుడో గానీ తిరుమల వెళ్లరు. ఒకవేళ వెళ్లినా కుటుంబంతో రారు. ఆయన భార్యను తిరుమలకు ఎప్పుడూ తీసుకువెళ్లిన దాఖలాలు లేవు. బంధుగ ణం కూడా వెంట కనిపించదు. ఆయన పర్యటన అంతా.. వచ్చామా.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి దేవుడికి దండం పెట్టామా? వెళ్లామా? అంతే.
ఇప్పుడు జస్టిస్ సుబ్రమణ్యం ఇచ్చిన తీర్పు.. గంటలపాటు వీఐపీ భక్తుల వెయిటింగ్ శరాఘాతాలతో, క్షతగాత్రులవుతున్న భక్తులకు చల్లనికబురు. ఒకరకంగా అది భక్తుల నెత్తిన పంచామృతం పోసినట్లే. అందుకే జస్టిస్ సుబ్రమణ్యం జిందాబాద్. ఇంత చిన్నదానికే అంత సంబరమా అంటే.. అంతే కదా మరి!
సరే సరే.. జస్టిస్ సుబ్రమణ్యం గారి తీర్పు అద్భుత: అద్భుతస్య: అద్భుతోభ్య. మరి తిరుపతి, శ్రీశైలం, అన్నవరం, భద్రాచలం, కనకదుర్గ, కోటప్పకొండ, యాదాద్రి, సింహాచలం, ద్రాక్షారామం, వేములవాడ వంటి పెద్ద గుళ్లకు ఎప్పుడంటే అప్పుడు వచ్చే హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల సంగతేమిటి? సదరు న్యాయమూర్తులు వచ్చినప్పుడు ఇబ్బంది పడే భక్తుల మాటేమిటి? వారితో వచ్చే పరివారంతో వచ్చే అదనపు ఇబ్బందుల సంగతేమిటి? సుబ్రమణ్యం గారి తీర్పు-వ్యాఖ్యానంలో.. గుళ్లకు వచ్చే న్యాయమూర్తుల వల్ల పడే భక్తులు పడే ఇబ్బందులను కూడా ప్రస్తావిస్తే ఆయనకు పుణ్యం, పురషార్ధం దక్కేది.
జస్టిస్ సుబ్రమణ్యం గారి తీర్పు మన తెలుగు పత్రికలు, చానెళ్లలో కూడా వచ్చింది కాబట్టి.. అది చదివిన న్యాయమూర్తులు, మంత్రులు, గవర్నర్లు భక్తుల గోస అర్ధం చేసుకుని.. తమ దర్శనాల సంఖ్యను తగ్గించుకుంటే అదే పదివేలు. ఈ తీర్పేదో నరసింహన్ ఉమ్మడి రాష్ట్ర గవర్నరుగా ఉన్నప్పుడు ఇచ్చి ఉంటే, తిరుమల వెంకన్న భక్తులు బోలెడు సంతోషపడేవారు. ఎందుకంటే ఆయన వెంకన్నకు రెగ్యులర్ కస్టమర్ కదా? అందుకు!