Suryaa.co.in

Andhra Pradesh

ఉక్రెయిన్ లో చదివిన వైద్య విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తాం

– వైయస్సార్‌ సీపీ ఎంపీ డాక్టర్‌ సత్యవతి

ఎంపీ డాక్టర్‌ సత్యవతి మాట్లాడుతూ.. ఏమన్నారంటే…
రష్యా- ఉక్రెయిన్‌ దేశాల మధ్య రాజకీయ కారణాలు కావచ్చు, వివిధ అంశాల వల్ల యుద్ధం అయితే జరుగుతూనే ఉంది. అయితే భారత్‌ వైఖరి పట్ల అందరూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే యుద్ధం అనేది కోరుకోవడం లేదని, అంతకన్నా ముందుగా అక్కడ ఉన్న భారత పౌరులంతా సురక్షితంగా బయటకు రావాలని ఆకాంక్షించింది.

ఒక వైద్యురాలిగా, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యురాలిగా మాట్లాడుతున్నాను. ఉక్రెయిన్‌లో వైద్యవిద్యను అభ్యసిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 692మంది విద్యార్థులను రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రక్రియ పూర్తయింది. ఇందుకోసం సహాయ సహకారాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి పార్లమెంటరీ సభ్యులమంతా ధన్యవాదాలు తెలుపుతున్నాం.

అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయా రాష్ట్రాలకు చెందిన వారిని రప్పించేందుకు చర్యలు చేపట్టినా… ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తీసుకున్న ప్రత్యేక చర్య గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోని నాలుగు దేశాలు అయిన హంగేరీ, రుమేనియా, స్లోవేకియా, పోలెండ్‌ కు మన ప్రతినిధుల్ని పంపించి అక్కడ ఉన్న తెలుగు సాయంతో ఆహారం, మందులు, భద్రత కల్పించేలా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

మేడపాటి ఎస్‌ వెంకట్‌ (హంగేరీ), చంద్రహాస్‌ రెడ్డి (రుమేనియా), రత్నాకర్‌ (స్లోవేకియా) రవీంద్రరెడ్డి( పోలెండ్‌) ఆయా దేశాలకు వెళ్లి అక్కడ ఉన్న తెలుగువారి సాయంతో మన రాష్ట్రానికి చెందిన 692మంది వైద్య విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. ఈ ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయిందని చాలా సంతోషిస్తున్నాం.

ఆ విద్యార్థుల భవిష్యత్‌ ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకం అయింది. వైద్య విద్యార్థులందరికీ పార్లమెంట్‌ సభ్యులుగా … వారి ఎడ్యుకేషన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌తో చర్చించి తప్పనిసరిగా మార్గదర్శకాలను తీసుకోవడం జరుగుతుంది.

మనకున్న వైద్య వ్యవస్థలో ప్రతి 2000 జనాభాకు ఒక ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌, ప్రతి వెయ్యిమంది జనాభాకు ఒక వైద్యుడు ఉండాలి. అయితే ఇవాళ ఉన్న పరిస్థితులను చూస్తే 10వేల మందికి ఒక వైద్యుడు ఉండటం చాలా ప్రాంతాల్లో చూస్తున్నాం. వైద్యవిద్యకు మరింత ప్రాధాన్యత నేపథ్యంలో తక్కువ ఖర్చుతో వైద్యవిద్య పూర్తవుతుందనే చిన్న చిన్న దేశాలకు వెళ్లడం చూస్తున్నాం.

రాబోయే రోజుల్లో వైద్యానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ కూడా ఒక ముందడుగు వేసింది. ప్రతి గ్రామంలో వెల్‌నెస్‌ సెంటర్‌ను పెట్టడం, పీహెచ్‌సీల సంఖ్య పెంచడం, 16 కొత్త మెడికల్‌ కాలేజీలను మంజూరు చేయడం భవిష్యత్‌లో మన రాష్ట్రం నుంచి, దేశం నుంచి కానీ వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లకుండా బృహత్తర ప్రణాళికగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ముందుకు వెళుతోంది. విద్యార్థులంతా విదేశాల్లో యుద్ధ వాతావరణాన్ని ప్రత్యక్షంగా చూడటం, వారి తల్లిదండ్రులు ఇక్కడ తీవ్ర ఆవేదన చెందడం చూశాం. విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా భవిష్యత్‌పై భరోసాతో మనోధైర్యంతో వైద్యవిద్యను కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నాం.

ఉక్రెయిన్‌లో కర్ణాటకకు చెందిన వైద్యవిద్యార్థి నవీన్‌ శేఖరప్ప మృతి పట్ల అతడి తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. త్వరలోనే యుద్ధం సమసిపోవాలని ఆశిస్తున్నాం.

LEAVE A RESPONSE